జపాన్‌లో దీర్ఘకాలికంగా స్థిరపడాలని, శాశ్వత నివాస హోదా పొందాలని భావిస్తున్న విదేశీయులకు భారీ షాక్ తగలనుంది. 2026 అక్టోబర్ 1 నుంచి విదేశీయుల రెసిడెన్సీ సంబంధిత దరఖాస్తుల ఫీజులను గణనీయంగా పెంచేందుకు జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా శాశ్వత నివాసం (Permanent Residence) కోసం దరఖాస్తు చేసే వారు ఇప్పటివరకు చెల్లిస్తున్న 10,000 యెన్లకు (సుమారు రూ.6 వేలు) బదులుగా 200,000 యెన్లు (సుమారు రూ.1.2 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఫీజు ఏకంగా 1900 శాతం లేదా 20 రెట్లు పెరగనుంది.
అక్టోబర్ 1 నుంచే కొత్త ఫీజులు
జపాన్ కేబినెట్ ఆగస్టు 25న కొత్త ఫీజుల విధానాన్ని అధికారికంగా ఆమోదించింది. నివాస హోదాను మార్చుకోవడం లేదా ప్రస్తుత రెసిడెన్సీ వ్యవధిని పొడిగించుకోవడానికి చేసే దరఖాస్తుల్లో ఇకపై ఒకే ఫీజు కాకుండా, మంజూరయ్యే నివాస కాలాన్ని బట్టి రుసుము నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఇలాంటి దరఖాస్తులకు కౌంటర్ ద్వారా చేస్తే సాధారణంగా 6,000 యెన్ల ఫీజు ఉంది.
కొత్త ఫీజుల వివరాలు ఇవే..
మూడు నెలల వరకు నివాస కాలానికి: 10,000 యెన్లు
ఒక సంవత్సరం కాలానికి: 33,000 యెన్లు
మూడు నుంచి ఐదేళ్లలోపు కాలానికి: 64,000 యెన్లు
ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి: 75,000 యెన్లు
శాశ్వత నివాస అనుమతి కోసం: 200,000 యెన్లు
అంటే ప్రస్తుతం 6,000 యెన్లుగా ఉన్న రెసిడెన్సీ పొడిగింపు లేదా హోదా మార్పు ఫీజు గరిష్ఠంగా 75,000 యెన్లకు చేరనుంది. శాశ్వత నివాస దరఖాస్తు ఫీజు మాత్రం 10,000 నుంచి 200,000 యెన్లకు పెరుగుతుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు కొంత తక్కువ
కౌంటర్‌లో నేరుగా దరఖాస్తు చేయడంతో పోలిస్తే ఆన్‌లైన్‌లో చేసే కొన్ని రెసిడెన్సీ దరఖాస్తులకు తక్కువ ఫీజు ఉంటుంది. మంజూరయ్యే కాలాన్ని బట్టి ఆన్‌లైన్ ఫీజు 10,000 నుంచి 65,000 యెన్ల మధ్య ఉండనుంది. అయితే శాశ్వత నివాస అనుమతి దరఖాస్తు మాత్రం ఆన్‌లైన్‌లో కాకుండా సంబంధిత కార్యాలయంలోనే చేయాల్సి ఉంటుంది.
ఫీజుల పెంపునకు కారణమేంటి?
జపాన్‌లో విదేశీ నివాసితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన పరిపాలనా వ్యయాలను భర్తీ చేయడమే ఫీజుల పెంపు వెనుక ప్రధాన కారణంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్పులకు మార్గం సుగమం చేస్తూ జపాన్ పార్లమెంట్ మే 2026లో ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని సవరించింది. ఆ చట్టం ద్వారా నివాస హోదా మార్పు లేదా పొడిగింపు ఫీజుకు గరిష్ఠ పరిమితిని 100,000 యెన్లకు, శాశ్వత నివాస దరఖాస్తు ఫీజుకు గరిష్ఠ పరిమితిని 300,000 యెన్లకు పెంచారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం అమల్లోకి తీసుకురానున్న వాస్తవ ఫీజులు వరుసగా 75,000, 200,000 యెన్లుగా ఉన్నాయి.
అందరికీ ఒకే భారం కాదు
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, మానవతా కారణాలతో ప్రత్యేక పరిగణన అవసరమైనవారికి ఫీజు తగ్గింపునకు అవకాశం కల్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తగ్గింపు ఫీజులకు అర్హత పొందే వర్గాలను కూడా ప్రభుత్వం విస్తరించింది. ఇందులో కొంతమంది జపాన్ పౌరుల లేదా ప్రత్యేక శాశ్వత నివాసితుల పిల్లలను ఒంటరిగా పెంచుతున్న విదేశీయులు, అలాగే నివాస అనుమతి నిరాకరణ మానవతా దృష్ట్యా అనుచితంగా భావించబడే వ్యక్తులు కూడా ఉన్నారు.
ఈ ఫీజుల మార్పు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ముఖ్యంగా కొత్త ఫీజులు దరఖాస్తు తేదీ ఆధారంగా వర్తిస్తాయి. అంటే అక్టోబర్ 1కు ముందే దరఖాస్తు చేసిన వారికి పాత ఫీజులే వర్తిస్తాయి. నిర్ణయం అక్టోబర్ 1 తర్వాత వెలువడినా కొత్త ఫీజు వర్తించదు.
ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులు భయపడుతున్నాయ్..


