మరో సరస్సుతోనూ ప్రమాదం పొంచి ఉందంటూ చైనా ప్రభుత్వ మీడియా హెచ్చరించింది. టిబెట్–నేపాల్ సరిహద్దులోని బ్యారియర్ సరస్సు 72 గంటల్లో పొంగిపొర్లే ప్రమాదం ఉందని చెబుతోంది. భారీ కొండచరియలు విరిగిపడటంతో టిబెట్‌లోని నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 558 మంది వరకు గల్లంతైనట్లు చైనా మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని బీజింగ్ అధికారులు మరో హెచ్చరికను జారీ చేశారు.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. నేపాల్ వైపు దాదాపు 100 మంది చైనా పౌరులు గల్లంతైనట్లు తెలిపారు. టిబెట్‌లోని గ్యిరోంగ్ సమీపంలో ల్హెండే నదిలోకి భారీగా మట్టి, రాళ్లు కొట్టుకురావడంతో ముగ్గురు మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ ఘటన కారణంగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాలను వరదలు ముంచెత్తాయి. నేపాల్‌లో దిగువ ప్రాంతాల్లో ఈ వరదల కారణంగా 177 మంది మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారు. ఇళ్లు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోయాయి. టిబెట్ వైపు ప్రమాద ప్రాంతాల్లోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇద్దరు గ్రామస్థులను రక్షించారు.
ఇదిలా ఉండగా.. మరో ప్రమాదాన్ని చైనా మీడియా గుర్తించింది. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన ఏర్పడిన బ్యారియర్ సరస్సు ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. దీంతో చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ సరస్సుపై నిఘా పెంచింది. ఈ సరస్సు విపత్తు ప్రాంతానికి ఈశాన్య దిశలో, చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదులు కలిసే ప్రాంతంలో ఉంది. గురువారం నాటికి ఈ బ్యారియర్ సరస్సులో సుమారు 20 లక్షల ఘన మీటర్ల నీరు ఉన్నట్లు అంచనా. సరస్సు ఇప్పటికే పొంగిపొర్లుతోంది. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల ఘన మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉందని చైనా సెంట్రల్ టెలివిజన్ తెలిపింది.
ఇదిలా ఉండగా.. సహాయక చర్యల కోసం చైనా బీజింగ్, చెంగ్డూ నుంచి అగ్నిమాపక, రెస్క్యూ బృందాలను పంపించింది. స్థానిక పోలీసులు, సాయుధ బలగాలతో కలిసి ఈ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గ్యిరోంగ్ పట్టణంలోని ప్రధాన పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలు పునరుద్ధరించారు. అయితే పోర్టుతో అనుసంధానమైన ప్రాంతాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ సేవలు ఇంకా నిలిచిపోయినట్లు సీసీటీవీ తెలిపింది.
ఇదీ చదవండి: నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్


