చావు తప్పి కన్ను లొట్టపోవడమంటే ఇదే.. మహిళకు వింత అనుభవం | Woman fell from the 10th floor At Mumbai Video Viral | Sakshi
Sakshi News home page

చావు తప్పి కన్ను లొట్టపోవడమంటే ఇదే.. మహిళకు వింత అనుభవం

Aug 27 2026 11:14 AM | Updated on Aug 27 2026 11:35 AM

Woman fell from the 10th floor At Mumbai Video Viral

ముంబైలో ఓ యువతి పదో అంతస్తు నుంచి దూకిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ‘చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు’ అన్న చందంగా.. నేలను తాకాల్సిన ఆమె భవనం పక్కనే ఉన్న చెట్టుపై పడటంతో ప్రాణాలతో బయటపడింది. ‘బతికితే బలుసాకు తినవచ్చు’ అన్న సామెతను గుర్తు చేసేలా.. మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఆమెకు ఆ చెట్టే ప్రాణరక్షకంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ముంబైలోని భాండూప్‌ వెస్ట్‌ తుల్షెట్‌పాడ ప్రాంతంలోని సన్‌షైన్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతీక్ష హివ్రాలే(26) సన్‌షైన్‌ బిల్డింగ్‌లోని పదో అంతస్తు ఫ్లాట్‌ కిటికీ నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. పదో అంతస్తు నుంచి కిందకు దూకిన ఆమె నేరుగా నేలను తాకకుండా.. భవనం పక్కనే ఉన్న చెట్టుపై పడింది. దీంతో చెట్టుపై సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయి వేలాడుతూ కనిపించింది. ఆమె పరిస్థితిని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందిన వెంటనే ఉదయం 9.32 గంటలకు ముంబై ఫైర్‌ బ్రిగేడ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుక్‌ ల్యాడర్‌ సహాయంతో చెట్టు వద్దకు చేరుకున్న సిబ్బంది.. ఎంతో జాగ్రత్తగా ప్రతీక్షను కిందకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను ప్రైవేట్‌ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమె ఎడమ కాలికి గాయం అయినట్లు తేలింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం సియాన్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

చదవండి: నేపాల్‌కు అత్యవసర సాయం పంపిన భారత్‌

పోలీసుల వివరాల ప్రకారం ప్రతీక్షకు నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే ఆమె పదో అంతస్తు నుంచి ఎందుకు దూకింది? అసలు ఏం జరిగింది? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా ప్రస్తుతం పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయలేకపోయారు. వైద్యుల నుంచి మెడికల్‌ ఎండార్స్‌మెంట్‌ తీసుకున్నారు. ఆమె కోలుకుని స్పృహలోకి వచ్చిన తర్వాత వాంగ్మూలం నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement