హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒదిగివున్న నేపాల్ మరోసారి ప్రకృతి ప్రకోపానికి నిలువునా వణికిపోయింది. తాజాగా సంభవించిన ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తడంతో గ్రామాలు క్షణాల్లో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు దాదాపు 95 నుండి 100కు పైగా మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయగా, వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. ప్రకృతి విలయాలకు నేపాల్ గురికావడం ఇదే మొదటిసారి కాదు.. 1934 నాటి భీకర భూకంపం నుండి నేటి వరదల వరకు ఈ హిమాలయ దేశం మృత్యు చరిత్రను మోస్తూనే ఉంది.
1934 నాటి పెను విషాదం: నేపాల్-బీహార్ మహా భూకంపం
నేపాల్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన విపత్తుగా 1934 జనవరి 15న వచ్చిన భూకంపం నిలిచింది. రిక్టర్ స్కేలుపై 8.0 తీవ్రతతో మధ్యాహ్నం 2:13 గంటలకు సంభవించిన ఈ ప్రకంపనల కేంద్రం మౌంట్ ఎవరెస్ట్‌కు దక్షిణాన 9.5 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర బీహార్, నేపాల్ సరిహద్దులను కుదిపేసిన ఈ ఘోర విపత్తులో దాదాపు 10,700 నుండి 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది గ్రామాలు భూస్థాపితమై చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయాయి.
1988 భూకంపం.. 1993 వరదల తాండవం
1988 ఆగస్టు 20న ఉదయ్‌పూర్ జిల్లా కేంద్రంగా 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం నేపాల్, బీహార్ సరిహద్దుల్లో 1,003 మందిని బలితీసుకుంది. ఆ తర్వాత, 1993 జూలై 19-20 తేదీల్లో కురిసిన కుండపోత వర్షాలు వెయ్యేళ్లలో ఎన్నడూ చూడని జలప్రళయాన్ని సృష్టించాయి. ఈ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో బాగ్మతి బ్యారేజీతో సహా ప్రధాన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 700 మందికి పైగా జనం జలసమాధి అయ్యారు.
2014-2015 ప్రకృతి ప్రకోపం: గూర్ఖా భూకంప విధ్వంసం
2014 ఏప్రిల్‌లో ఖుంబు ఐస్‌ఫాల్ వద్ద సంభవించిన హిమపాతంలో 16 మంది షెర్పా గైడ్లు మరణించగా, అదే ఏడాది ఆగస్టులో సున్‌కోషి నదికి అడ్డంగా కొండచరియలు విరిగిపడి 150 మందికి పైగా చనిపోయారు. ఇక 2015 ఏప్రిల్ 25న వచ్చిన గూర్ఖా భూకంపం రాజధాని ఖాట్మండును చావుకేకలతో నింపింది. ఈ భయంకర విపత్తు నేపాల్, భారత్, చైనా, బంగ్లాదేశ్‌లలో కలిపి 8,962 మంది ప్రాణాలను హరించగా, దాదాపు 22 వేల మంది క్షతగాత్రులయ్యారు.
2017 నుంచి 2024 వరకు ఎడతెగని విలయం
2017 వర్షాకాలంలో నేపాల్ దక్షిణాన ఉన్న తెరాయ్ ప్రాంతాన్ని ముంచెత్తిన వరదల్లో 140 మందికి పైగా మరణించారు. 2023 నవంబర్ 3న జాజర్‌కోట్ జిల్లాలో 5.7 తీవ్రతతో సంభవించిన భూకంపం 153 మందిని బలితీసుకుంది. అలాగే, 2024 సెప్టెంబరులో ఖాట్మండు లోయ, బాగ్మతి ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షాలు కురవడంతో సంభవించిన వరదలు, కొండచరియల విలయానికి 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుత జల విలయం
తాజాగా 2026 ఆగస్టులో విరుచుకుపడిన వరదల్లో పదుల సంఖ్యలో గ్రామాలు నేలమట్టమయ్యాయి. నదులు ఉప్పొంగి ఉగ్రరూపం దాల్చడంతో ఇప్పటివరకు 95 మందికి పైగా శవాలు లభ్యమయ్యాయి. ఇంకా 133 మంది భారతీయులతో సహా పలువురి ఆచూకీ లభించలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకు పదేపదే విధ్వంసం?
వాతావరణ మార్పుల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రపంచ దేశాల జాబితాలో నేపాల్ 4వ స్థానంలో ఉంది. భౌగోళికంగా సున్నితమైన హిమాలయ ప్రాంతం కావడంతో కొండచరియలు విరిగిపడటం, మెరుపు వరదలు ఇక్కడ సర్వసాధారణంగా మారాయి. ఇంత తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నప్పటికీ, దేశంలో ఆధునిక వాతావరణ హెచ్చరిక వ్యవస్థలు సరిగా లేకపోవడమే ప్రాణ, ఆస్తి నష్టాలు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.
ఇది కూడా చదవండి: మథురలో అరుదైన రాఖీ సంప్రదాయం!


