పరీక్ష అంటే ఒకప్పుడు.. ఉపాధ్యాయులు ప్రశ్నలు అడిగేవారు విద్యార్థులు సమాధానాలు రాసేవారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రశ్నాపత్రాలు, మార్కులు ఆ తర్వాత ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ఇలా పరీక్షల రూపం కాలానుగుణంగా మారుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మరో కొత్త పరీక్ష మొదలైంది. ఎలాంటి ప్రశ్నాపత్రం లేదు.. ఇన్విజిలేటర్ కనిపించడు.. అయినా ప్రతిరోజూ మనం ఓ పరీక్ష రాస్తూనే ఉన్నాం. అదీ మన చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తోనే!
స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం సమాచారం తెలుసుకునే సాధనం మాత్రమే కాదు.. మన అలవాట్లు, ఆసక్తులు, అభిరుచులను బయటపెట్టే అద్దంగా మారింది. మనం ఏ వీడియో చూస్తున్నాం? ఏ వార్తపై ఆగుతున్నాం? ఏ ఫొటోను ఇష్టపడుతున్నాం? ఏ అంశాన్ని పదే పదే వెతుకుతున్నాం? ఇవన్నీ మనకు తెలియకుండానే ఓ డిజిటల్ రికార్డుగా మారుతున్నాయి. ఈ పరీక్ష నిర్వహిస్తోంది కృత్రిమ మేధస్సు (AI). సమాధానాలు రాసేది కలం కాదు.. మన వేళ్లు.
మనం చేసే ప్రతి క్లిక్, ప్రతి స్క్రోల్, ప్రతి సెర్చ్, ఒక వీడియోను చూసే సమయం, ఒక వార్తపై స్పందించే తీరు.. ఇవన్నీ AIకి మన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే సంకేతాలుగా మారుతున్నాయి. వినియోగదారుల ప్రవర్తనా సరళిని విశ్లేషించే ఈ సాంకేతికత ఆధారంగానే మనకు కనిపించే కంటెంట్, ప్రకటనలు, సిఫార్సులు మారుతున్నాయి.
కనిపించని ప్రశ్నాపత్రం ఇదే..
ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలామంది చేసే మొదటి పని ఫోన్ చూడటం. యూట్యూబ్‌లో వీడియోలు చూడటం, సోషల్ మీడియాలో పోస్టులు పరిశీలించడం, గూగుల్‌లో సమాచారం వెతకడం.. ఇవన్నీ సాధారణ అలవాట్లుగానే అనిపిస్తాయి. కానీ AI దృష్టిలో ఇవన్నీ కీలకమైన డేటా. మీరు ఏ వీడియో దగ్గర ఎక్కువసేపు ఆగారు?. ఏ వార్తను వెంటనే ఓపెన్ చేశారు?. ఏ అంశాన్ని పదే పదే వెతికారు?. ఏ పోస్టును షేర్ చేశారు?. ఎలాంటి ప్రాంప్ట్‌లతో ఇమేజ్‌లు జనరేట్ చేస్తున్నారు?.. ఇలాంటి చర్యలను కలిపి AI మీ ఆసక్తులు, అభిరుచులు, ఆలోచనా విధానంపై ఓ అంచనాను రూపొందిస్తుంది.
మీకు నచ్చే ప్రపంచాన్నే చూపిస్తుంది..
ఉదాహరణకు మీరు వరుసగా ఫుడ్ వీడియోలు చూస్తున్నారు అనుకోండి.. మీ ఫీడ్‌లో ఆ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించిన వీడియోలు చూస్తే.. ట్రంప్, చైనా, రష్యా, ఇరాన్ వంటి అంశాలకు సంబంధించిన కంటెంట్ ఎక్కువగా కనిపించవచ్చు. అలాగే మీరు సినిమాలు, క్రీడలు, టెక్నాలజీ లేదంటే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు ఎక్కువగా చూస్తే.. అదే తరహా సమాచారం మీ ముందుకు వస్తుంది. అంటే ఏఐ అనేది మీకు ప్రపంచాన్ని మొత్తం చూపించదు. మీరు దానితో ఎలా ప్రవర్తిస్తే.. ఆ ఆసక్తితో కూడిన ప్రపంచాన్ని మీ ముందు నిర్మిస్తోంది.
జస్ట్ మూడే సెకన్లు
డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో వినియోగదారుడి దృష్టి చాలా విలువైనది. ఒక వీడియో లేదంటే పోస్టు వద్ద వినియోగదారు ఎంతసేపు ఆగుతున్నాడు? ఎక్కడ స్క్రోల్ ఆపుతున్నాడు? అనే అంశాలు కూడా అల్గారిథమ్‌లకు సంకేతాలుగా మారతాయి. ఒక వీడియోను వెంటనే స్కిప్ చేస్తే ఆసక్తి లేదని భావించే అవకాశం ఉంటుంది. అదే వీడియోను పూర్తిగా చూస్తే.. ఆ అంశం వినియోగదారుడికి నచ్చిందనే అంచనాకు రావచ్చు. డేటా ఆధారంగానే భవిష్యత్తులో కనిపించే కంటెంట్, ప్రకటనలు, సజెషన్స్ మారుతుంటాయి.
భావోద్వేగాలనూ చదువుతున్న ఏఐ..
మనిషి నిర్ణయాల్లో భావోద్వేగాల పాత్ర చాలా ఎక్కువ. దీనిని కూడా ఏఐ గుర్తిస్తోంది. ఉదాహరణకు ఒక వార్తకు రెండు శీర్షికలు ఉన్నాయనుకుందాం. ‘‘దేశాన్ని కుదిపేసిన సంచలన నిర్ణయం!’’. ‘‘ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది’’ ఇలా. ఇందులో మొదటి టైటిల్‌కు ఎక్కువ క్లిక్స్ వస్తే.. సంచలన పదాలు ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని ఏఐ నేర్చుకుంటుంది.అందుకే సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే శీర్షికలు, చిత్రాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఏఐ కూడా మన నుంచే నేర్చుకుంటోంది!
చాలామంది ఏఐ మనల్ని మాత్రమే నిశితంగా విశ్లేషిస్తుందని భావిస్తారు. కానీ వాస్తవానికి మన స్పందనల నుంచే ఏఐ చాలా నేర్చుకుంటుంది. తనను తాను మెరుగుపరుచుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందల కోట్ల మందిలో.. ఎలాంటి కంటెంట్‌కు ప్రజలు స్పందిస్తున్నారు?. ఏ అంశాలపై ఎక్కువ సమయం గడుపుతున్నారు?. ఏ విషయాలు వారిని ఆకర్షిస్తున్నాయి?. ఇలాంటి సమాచారంతో ఏఐ మరింత ఖచ్చితమైన సిఫార్సులు అందించే ప్రయత్నం చేస్తోంది.
మార్కులు కనిపించవు.. ప్రభావం మాత్రమే!
ఈ ఏఐ పరీక్షలో మనకు మార్కులు గట్రా పడవు. ఎలాంటి ఫలితాల పట్టా రాదు. కానీ దాని ప్రభావం మన జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. యూట్యూబ్ సూచించే వీడియోలు మారతాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మారతాయి. గూగుల్ మన తర్వాతి ప్రశ్నను ఊహించే ప్రయత్నం చేస్తుంది. ఆన్‌లైన్ షాపింగ్‌లో కనిపించే ప్రకటనలు కూడా మన ఆసక్తులకు అనుగుణంగా మారతాయి(ఇది ఎప్పటి నుంచో సోషల్ మీడియాలోనూ నడుస్తున్న తంతే!). మన మాటల కంటే మన ప్రవర్తనే AIకి ఎక్కువ సమాచారం ఇస్తోంది.
సౌకర్యమా?.. సవాలా?
భవిష్యత్తులో విద్య, వైద్యం, ఉద్యోగాలు, వినోదం వంటి రంగాల్లో ఏఐ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. మనకు అవసరమైన సమాచారాన్ని ముందుగానే అందించడం, పనులను సులభతరం చేయడం, నిర్ణయాల్లో సహకరించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఏఐ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇదే సమయంలో మరో వైపు కూడా ఉంది.
మన ప్రతి ఆన్‌లైన్ కదలిక, ప్రతి ఆసక్తి, ప్రతి అభిరుచి డేటాగా మారుతున్న వేళ.. వ్యక్తిగత గోప్యత, డేటా భద్రత, తప్పుడు సమాచారాన్ని గుర్తించే సామర్థ్యం మరింత కీలకంగా మారనున్నాయి. సౌకర్యం కోసం ఏఐపై ఆధారపడుతున్న కొద్దీ దాని వినియోగంపై అప్రమత్తత కూడా అంతే అవసరం. ఒకప్పుడు మనిషి యంత్రాలను పరీక్షించాడు. ఇప్పుడు ఏఐ యుగంలో యంత్రం నిశ్శబ్దంగా మనిషిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం సాంకేతిక పరిణామం కాదు.. మనిషి, యంత్రం మధ్య కొత్త సంబంధానికి నాంది. అందుకే ఏఐ మనకు సౌకర్యమా?.. లేక కొత్త సవాలా?.. అన్నది నిర్ణయించేది చివరకు మనమే.
::వెబ్‌డెస్క్ ప్రత్యేకం
ఇదీ చదవండి: ఇరాన్ నాటకాన్ని బయటపెట్టిన ట్రంప్


