ఏఐ.. స్టార్టింగ్‌ ప్రాబ్లమ్‌! | New challenges for candidates in practicing skills | Sakshi
Sakshi News home page

ఏఐ.. స్టార్టింగ్‌ ప్రాబ్లమ్‌!

Aug 27 2026 6:03 AM | Updated on Aug 27 2026 6:03 AM

New challenges for candidates in practicing skills

ఎక్కడి నుంచి నేర్చుకోవాలో తెలియని స్థితి 

పెరిగిన వాడకం.. అభ్యాస మార్గాలు అస్పష్టం  

నైపుణ్యాల సాధనలో అభ్యర్థులకు కొత్త సవాళ్లు 

సాక్షి, హైదరాబాద్‌: మన దేశంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వాడకం విపరీతంగా పెరిగింది. అయినప్పటికీ మెజారిటీ అభ్యాసకులు సాంకేతిక నైపుణ్యాలను ఎక్కడ నుంచి నేర్చుకోవడం ప్రారంభించాలో తెలియక సతమతమవుతున్నారు. తగినంత అవగాహన లేకపోవడం, శిక్షణా కార్యక్రమాల ఎంపికలో గందరగోళం వంటి అంశాలు వారి వృత్తిపరమైన ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నాయి. 

ప్రముఖ విద్యా సంస్థ అప్‌గ్రాడ్‌ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 56 శాతం మంది భారతీయ అభ్యాసకులు కృత్రిమ మేధస్సును నేర్చుకునే ప్రయాణంలో సరైన దిశానిర్దేశం లేకపోవడమే అతిపెద్ద అడ్డంకిగా భావిస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాల కోర్సులు, వాటి విశ్వసనీయతపై ఉన్న అనిశ్చితి కారణంగా 43 శాతం మంది అయోమయానికి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని వివిధ వృత్తుల్లో ఉన్న అభ్యాసకుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 

ఏదో ఒక రూపంలో.. 
సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 94 శాతం మంది ఏదో ఒక రూపంలో ఏఐని ఉపయోగిస్తున్నామని చెప్పారు. అందులో సగానికి పైగా (53 శాతం) మంది ప్రతిరోజూ దీనిని వాడుతున్నారు. ఈ ధోరణి కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా, చిన్న నగరాలు, పట్టణాలకు కూడా విస్తరించింది. దీనివల్ల ఉద్యోగులు, విద్యార్థులు ఈ నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 87 శాతం మంది ఇప్పటికే ఈ తరహా కార్యక్రమాల్లో చేరడం లేదా నేర్చుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. 

వృత్తిపరమైన రంగంలో ఎక్కువ అనుభవం ఉన్నవారు ఈ సాంకేతికతను నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రారంభ దశలో ఉన్న అభ్యాసకులలో రోజువారీ వాడకం 44 శాతంగా ఉంటే, 8 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్న వారిలో ఇది 62 శాతానికి పెరిగింది. సీనియర్‌ నిపుణుల్లో 31 శాతం మంది వారానికి కనీసం మూడు గంటలు దీనిని అభ్యసించడానికి వెచ్చిస్తున్నారు.  

మునుపటి కంటే సులభంగా.. 
ఈ నైపుణ్యాల వల్ల 54 శాతం మంది తమ వృత్తి జీవితంలో స్పష్టమైన పురోగతిని సాధించారు. ఇందులో ఆత్మవిశ్వాసం పెరగడం, కొత్త బాధ్యతలు చేపట్టడం, పదోన్నతులు, అదనపు ఆదాయ వనరులు పొందడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. దాదాపు సగం మంది అభ్యాసకులు గతంలో తమ సామర్థ్యానికి మించిన పనులను ఇప్పుడు దీని సహాయంతో సులభంగా చేయగలుగుతున్నారు. వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ సాంకేతిక సృజనాత్మకతలో భారతీయులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నారు. కేవలం నాలుగింట ఒకవంతు మంది మాత్రమే ఇతర సాధనాలతో దీనిని అనుసంధానించారు. కేవలం 20 శాతం మంది మాత్ర మే ఆటోమేటెడ్‌ వ్యవస్థలను లేదా నూతన అప్లికేషన్లను తయారు చేయగలిగారు. 

భవిష్యత్తు సవాళ్లు 
సాంకేతిక రంగంలో జరుగుతున్న వేగవంతమైన మార్పులను అందుకోవడం 43 శాతం మందికి దైనందిన సవాలుగా మారింది. ‘భారత్‌ ఇప్పుడు ఈ సాంకేతికత పనిని మారుస్తుందా లేదా అనే ప్రశ్నను దాటి ముందడుగు వేసింది. ప్రజలు ఇప్పటికే దీనిని ఉపయోగిస్తూ, నైపుణ్యాలపై పెట్టుబడి పెడుతున్నారు. తదుపరి సవాలు ఏమిటంటే అభ్యాసకులకు స్పష్టమైన మార్గాన్ని చూపించడం. వారు నేర్చుకున్న నైపుణ్యాలను అర్థవంతమైన ఉద్యోగ అవకాశాలుగా మార్చడమే’అని అప్‌గ్రాడ్‌ పేర్కొంది. భారత్‌లో ఈ సాంకేతిక ప్రయాణం విజయవంతం కావాలంటే కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా, ఉద్యోగాలకు ఉపయోగపడే ఆచరణాత్మక నైపుణ్యాల వైపు అడుగులు పడాల్సి ఉందని అభిప్రాయపడింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement