రాష్ట్రంలోనూ పెరుగుతున్న ‘గ్రానీ డంపింగ్’ ఉదంతాలు
అనారోగ్యంతో ఉన్న వృద్ధులను ఆస్పత్రుల్లో వదిలేస్తున్న పిల్లలు
బిల్లులు సైతం కట్టకుండా ముఖం చాటేస్తున్న సంతానం
వార్ధక్యంలో ఒంటరవుతున్న తల్లిదండ్రులు
గతేడాది హైదరాబాద్ లింగంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంపాలైన 78 ఏళ్ల తల్లిని కుమారుడు చేర్చాడు. రూ. 3 లక్షల బిల్లు కావడంతో డబ్బు తీసుకొచ్చి కడతానని చెప్పి వెళ్లిన అతను మళ్లీ కనిపించలేదు. 45 రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్న ఆమెను చివరకు పోలీసులు, ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో వృద్ధాశ్రమానికి తరలించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో నగరంలోని కూకట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రి ముందు 82 ఏళ్ల తండ్రిని కుమారుడు కారులో దింపి వెళ్లిపోయాడు. ఆ పెద్దాయన వద్ద ఆధార్ కార్డు, రూ. 200 మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలోని కారు నంబర్ ఆధారంగా ఆ కుమారరత్నాన్ని పట్టుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: దేశంలో కుటుంబ సంస్కృతి, విలువలు ఒకప్పుడు అనుబంధాలు, ఆత్మీయతల కలబోతగా ఉండేవి. కానీ నేటి ఉరుకుల పరుగుల ఆధునిక జీవనంలో అను రాగాలు దూరమవుతున్నాయి.. మమకారాలు మాయమవు తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు అమెరికా వంటి అగ్రదేశాల్లో కనిపించిన ఈ పెడధోరణి ప్రస్తుతం మన రాష్ట్రం దాకా పాకింది. ఎంతగా అంటే.. జన్మనిచ్చి, విద్యాబుద్ధులు నేర్పించి జీవితంలో ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్నారనే కారణంతో ఏమాత్రం కనికరం లేకుండా పిల్లలు వదిలించుకుంటున్న ఉదంతాలు కొంతకాలంగా పెరుగుతున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులు, కేర్ హోమ్స్ వద్ద తల్లి లేదా తండ్రిని వదిలేసి కుటుంబ సభ్యులు పరారవుతున్న దారుణ పరిస్థితులు సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి. ఈ పెడ ధోరణినే ‘గ్రానీ డంపింగ్’గా పిలుస్తున్నారు. అధికారిక గణాంకాలు లేనప్పటికీ ఈ తరహా కేసులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెలకు సగటున 12 నుంచి 15 వరకు నమోదవుతున్నాయని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న వృద్ధులను ఆస్పత్రుల్లో చేర్పించి కుటుంబ సభ్యులు వెళ్లిపోతున్నారని.. బిల్లులు కూడా కట్టకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ అమానవీయ ధోరణిపై ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
46 శాతం వృద్ధులపై పిల్లల నిర్లక్ష్యం..
ఆర్థిక భారం, వృద్ధుల వైద్య ఖర్చు నెలకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉంటోంది. దీనికితోడు ఉమ్మడి కుటుంబాలు మాయమై చిన్న కుటుంబాలు, న్యూక్లియర్ కుటుంబాలు ఏర్పడటంతో కుటుంబ సభ్యులు వృద్ధులను చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేర్పించడమో లేదా అక్కడ వదిలేయడమో చేస్తున్నారు. చికిత్స పూర్తయినప్పటికీ వారిని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావట్లేదు. కొన్ని సందర్భాల్లో వృద్ధులను రోడ్ల పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లోనూ వదిలివేస్తున్నారు. హెల్పేజ్ ఇండియా 2025 సర్వే ప్రకారం తెలంగాణలో 46 శాతం మంది వృద్ధులు పిల్లల నుంచి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నారు.
ఎందుకు ఇలా చేస్తున్నారు?
వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులు వదిలించుకోవాలని నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రేమ లేకపోవడమే కారణం కాదని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయç³డుతున్నారు. వృద్ధుల దీర్ఘకాలిక సంరక్షణ ఖర్చులు పెరగడం, చాలామంది వృద్ధులకు ఉండే మతిమరుపు వంటి అనారోగ్య సమస్యల నేపథ్యంలో నిరంతరం పర్యవేక్షించేందుకు సౌకర్యాలు లేకపోవడం, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు కూడా కొన్ని కుటుంబాలను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయని చెబుతున్నారు.
అయితే తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంరక్షణ చట్టం 2007 ప్రకారం తల్లిదండ్రులను పోషించడం పిల్లల చట్టబద్ధ బాధ్యతని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ చట్ట నిబంధనలను ఉల్లంఘించే వారికి 3 నెలల జైలు లేదా రూ. 5 వేల జరిమానా పడే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. పిల్లల నిరాదరణకు గురయ్యే వృద్ధులు హైదరాబాద్ పోలీసుల పరిధిలోకి వచ్చే సీనియర్ సిటిజన్ సెల్, 1091 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.
అమెరికాలో 1990ల నుంచే..
అనారోగ్యంతో బాధపడే వృద్ధులను ఆస్పత్రుల వద్ద వదిలేసే విష సంస్కృతి ఇటీవల కాలంలో వచ్చిందేమీ కాదు. అమెరికాలో 1992లోనే అమెరికన్ కాలేజీ ఆఫ్ ఎమర్జెన్సీ ఫిజీషియన్స్ సర్వే ప్రకారం సంవత్సరానికి సుమారు 70,000 మంది వృద్ధులు ఆస్పత్రుల వద్ద నిరాదరణకు గురైనట్లు అంచనా. అయితే గ్రానీ డంపింగ్ కేవలం కుటుంబ సమస్య కాదు.. వృద్ధ సంరక్షణ వ్యవస్థ, సామాజిక భద్రత, కుటుంబాలపై పడుతున్న సంరక్షణ భారానికి కూడా అద్దం పడుతున్న సమస్య. కుటుంబం చూసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు వృద్ధులను వదిలేయడం కాకుండా, సామాజిక సేవలు, అసిస్టెడ్ లివింగ్ లేదా ప్రభుత్వ/స్వచ్ఛంద సహాయ వ్యవస్థలను ఉపయోగించుకోవడం అవసరం.
అలాంటి వారికి మానవీయ సేవలు అందిస్తున్నాం
అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను కొందరు పిల్లలు ఆస్పత్రుల్లో అడ్మిట్ చేసి వెళ్లిపోతున్నారు. ఎక్కువగా 70 ఏళ్లు దాటిన వారు, పక్షవాతం, షుగర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారినే పిల్లలు వదిలేస్తున్నారు. అలాంటి వృద్ధులను మా సిబ్బంది దగ్గరుండి చూసుకుంటున్నారు. మేము కూడా మా సొంత తల్లిదండ్రుల్లాగే భావించి వారికి వైద్యంతోపాటు మానవీయ సేవలు అందిస్తున్నాం. ‘గ్రానీ డంపింగ్’పై 2024–25లో పోలీసులకు 170కిపైగా ఫిర్యాదులు చేశాం.
– డాక్టర్ రాకేశ్ సహాయ్ (ఉస్మానియా సూపరింటెండెంట్)
– డాక్టర్ శివప్రసాద్ (ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి సూపరింటెండెంట్)


