సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం
హాజరుకానున్న ఏపీ, తెలంగాణ అధికారులు, ఇంజనీర్లు
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా, గోదావరి జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ రెండో సమావేశం సెప్టెంబర్ 7న న్యూఢిల్లీలో జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన గతేడాది జూలై 16న ఢిల్లీలో తెలంగాణ, ఏపీ సీఎంలతో నిర్వహించిన సమావేశంలో సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవడానికి ఓ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకోగా, కమిటీ తొలి సమావేశం గత జనవరి 30న జరిగింది. తదుపరి సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతో ఎజెండాను ప్రతిపాదించాలని రెండు రాష్ట్రాలకు ఆ సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ సూచించారు.
పోలవరం–బనకచర్ల/నల్లమల్లసాగర్ ప్రాజెక్టుపై ఈ కమిటీ సమావేశాల్లో చర్చించడానికి అప్పట్లో తెలంగాణ అభ్యంతరం తెలిపింది. రెండు రాష్ట్రాలు కమిటీకి ఎజెండాను ప్రతిపాదించకపోవడంతో తదుపరి సమావేశం సాధ్యం కాలేదు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చల ద్వారా జలవివాదాలు పరిష్కరించుకోవాలని ఆయన రెండు రాష్ట్రాలకు సూచించారు. దీంతో తక్షణమే సీడబ్ల్యూసీ కమిటీ రెండో సమావేశాన్ని నిర్వహించనుంది.
1న తుమ్మిడిహెట్టిపై సీడబ్ల్యూసీ భేటీ
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం విషయంలో కదలిక వచ్చింది. 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించడానికి మహారాష్ట్రను ఒప్పించాలని కోరుతూ జూన్ 11న ప్రధాని నరేంద్రమోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. పీఎం కార్యాలయ సూచనల మేరకు ఈ అంశంపై సెప్టెంబర్ 1న మహారాష్ట్ర, తెలంగాణ అధికారులతో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనుంది.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో వార్ధా, వెయిన్‌గంగా నదులు ప్రాణహిత నదిలో కలిసే ప్రాంతానికి ఎగువన లంబాకారాంలో బరాజ్ నిర్మించడానికి ఇప్పటికే తెలంగాణ ప్రీఫిజిబిలిటీ నివేదికను సిద్ధం చేసింది. బరాజ్ నిర్మాణంతో మహారాష్ట్రలో ఏర్పడనున్న ముంపు విషయంలో ఆ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కావడం లేదు. గతంలో 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి అంగీకరించిన మహారాష్ట్ర తాజా చర్చల్లో 150 మీటర్లకు ఎత్తు పెంచేందుకు సమ్మతిస్తే తెలంగాణకు భారీ ఊరట లభించనుంది.


