‘కిస్తీ’ కోసం కుస్తీ! | Confusion over Indiramma rural houses | Sakshi
Sakshi News home page

‘కిస్తీ’ కోసం కుస్తీ!

Aug 27 2026 5:29 AM | Updated on Aug 27 2026 5:29 AM

Confusion over Indiramma rural houses

చివరి విడత బిల్లులు 15,475 మందికే!

ఇవ్వాల్సింది లక్ష మందికి....ఇందిరమ్మ గ్రామీణ ఇళ్ల విషయంలో గందరగోళం 

గృహప్రవేశం జరిగినా పెండింగ్‌లో చివరి విడత బిల్లుల విడుదల 

స్పందించని కేంద్రప్రభుత్వం... పీఎంఏవై గ్రామీణ ఇళ్ల మంజూరులో తీవ్ర జాప్యం 

అక్కడి నుంచి నిధులు వస్తే వాటితో కలిపి బిల్లుల సర్దుబాటుకు రాష్ట్రం ఎదురుచూపు 

ఏడాది గడచినా రాని స్పష్టత... తాత్కాలికంగా తుది బిల్లు నిలుపుదల 

గత్యంతరం లేక రాష్ట్రప్రభుత్వమే సొంతగా భరించాలని నిర్ణయం 

గురువారం కొందరు లబ్దిదారుల ఖాతాల్లో జమ 

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్లు పూర్తయి గృహప్రవేశాలు జరిగినా చివరి విడత ఆర్థిక సాయానికి సంబంధించిన బిల్లులు విడుదల కాలేదు. ఇళ్లు పూర్తయి నెలలు గడుస్తున్నా చివరి బిల్లు కోసం లబ్దిదారులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద మంజూరు చేయాల్సిన యూనిట్ల విషయంలో దోబూచులాడటమే కారణం కావడం విశేషం. ఇందిరమ్మ పట్టణ యూనిట్లను మంజూరు చేసిన కేంద్రప్రభుత్వం, గ్రామీణ యూనిట్ల విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. అసలు మంజూరు చేస్తుందా? లేదా? అన్న విషయాన్ని కూడా తేల్చకుండా పెండింగ్‌లో పెట్టింది. ఏకంగా లక్ష ఇళ్ల చుట్టూ నెలకొన్న అయోమయమిది. 

ఎందుకీ గందరగోళం? 
రాష్ట్రప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద తొలి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో గ్రామీణ ఇళ్లలో దాదాపు లక్ష ఇళ్లు పూర్తయ్యాయి. ఈ పథకం కింద రాష్ట్రప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద రాష్ట్రానికి కొన్ని ఇళ్లను మంజూరు చేస్తుంది. పట్టణ ప్రాంత ఇంటికి రూ.లక్షన్నర, గ్రామీణ ప్రాంత ఇంటికి రూ.72 వేలు అందిస్తుంది. పట్టణ ప్రాంతానికి సంబంధించి రూ.1.13 వేల ఇళ్లను మంజూరు చేయడంతో ఆ ఇళ్ల విషయంలో స్పష్టత వచ్చింది.

కానీ గ్రామీణ ఇళ్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మంజూరు లేదు. ఆ రూపంలో కేంద్రం ఇచ్చే సాయం నేరుగా లబ్దిదారు ఖాతాలోకే జమ అవుతుంది. గతంలో లాగా ఆ మొత్తం నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి అందదు. రాష్ట్రప్రభుత్వం తనవంతు సాయంగా ఇచ్చే విడతలవారీ బిల్లులను ఇందుకు తగ్గట్టుగా సర్దుబాటు చేస్తుంది. కేంద్రం ఒక్కో ఇంటికి ఇచ్చే రూ.72 వేలను తన వంతు వాటాతో కలిపి లబ్దిదారు ఖాతాకు ఆ విడత కోటా కింద అందిస్తుంది. ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్లకు మూడు విడతల బిల్లులు చెల్లించినందున, ఇక చివరి విడత ఒక్కటే మిగిలి ఉంది. అది చెల్లించాలంటే కేంద్రం సాయంలో స్పష్టత రావాల్సి ఉంది.  

రీయింబర్స్‌మెంట్‌ విధానం లేకపోవడంతో... 
ఇలాంటి పరిస్థితిలో ముందు రాష్ట్రప్రభుత్వం మొత్తం సాయాన్ని లబ్దిదారుకు అందిస్తే కేంద్రం తర్వాత తన వంతు మొత్తాన్ని రీయింబర్స్‌ చేసే పద్ధతి ఉంటుంది. కానీ, ఈ పథకంలో రీయింబర్స్‌మెంట్‌ బదులు కేంద్రం నేరుగా లబ్దిదారు ఖాతాకే జమ చేసే విధానం ఉన్నందున, రాష్ట్రప్రభుత్వానికి ఆ మొత్తం తిరిగి అందదు. కేంద్రం నుంచి స్పష్టత వచ్చాకే చివరి విడత బిల్లు చెల్లించాలని నిర్ణయించి నెలలుగా పెండింగులో పెట్టింది. చివరి విడత బిల్లు అందనందున లబ్దిదారులు ఇంటి ఫినిషింగ్‌కు సొంత డబ్బులు వ్యయం చేయాల్సి వస్తోంది. కేంద్రం నుంచి నిధులు రాని విషయంపై అవగాహన లేని లబ్దిదారులు, చివరి విడత బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. 

ఆచితూచి చివరి బిల్లు విడుదలపై నిర్ణయం... 
కేంద్రం నిధులు ఇవ్వని పేరుతో చివరి బిల్లు విడుదలను ఎక్కువ కాలం నిలిపేయటం ఇక కుదరదని రాష్ట్రప్రభుత్వం తేల్చుకుని, చివరి విడత బిల్లు విడుదలకు సిద్ధమైంది. మొత్తం ఒకేసారి చెల్లిస్తే... భవిష్యత్తులో కేంద్రం నుంచి వచ్చే సాయం చేతికందదన్న ఆందోళన కూడా వెంటాడుతోంది. దీంతో, మార్చి నాటికి పూర్తయి ఇళ్లకు ముందు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 15,475 ఇళ్లకు సంబంధించి రూ.185 కోట్లను విడుదల చేసింది. ఆ మొత్తం గురువారం లబ్దిదారుల ఖాతాలకు జమ కానుంది. మరికొద్ది రోజులు కేంద్రం సాయం కోసం ఎదురుచూసి మరికొన్ని ఇళ్లకు తదుపరి విడత విడుదల చేయాలని భావిస్తోంది.  

ఇంకెంతకాలం చూస్తూ ఊరుకుంటాం: పొంగులేటి
ఇందిరమ్మ గ్రామీణ ఇళ్లకు కేంద్రం రూపాయి కూడా సాయం చేయలేదు. ఏడాదిగా ఆ సాయం కోసం ఎదురుచూస్తూ చివరివిడత బిల్లు నిలిపివేశాం. ఇంకా ఎంతకాలం బిల్లు ఇవ్వకుండా ఉండగలం. పేదల ఇబ్బందులు చూస్తూ ఉండగలమా, అందుకే కేంద్రం సాయం చేయకున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా రాష్ట్రప్రభుత్వమే సాయం చేయాలని నిర్ణయించింది. తొలివిడతగా రూ.185 కోట్లు విడుదల చేశాం. మిగతావారికీ తదుపరి విడతల్లో ఇస్తాం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement