‘ఈగల్’లోని ఇంటి దొంగల విచారణలో వెలుగులోకి
టీజీఎస్పీ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన స్వామి, నరహరి
వీరికి ఈ నెల 4న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో దొరికిన మెథ్ డ్రగ్
రిమాండ్‌కు తరలింపు.. కస్టడీకి తీసుకోవాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యమైన మెథాంఫెటమైన్ (మెథ్) తమకు ఎలా దొరికిందో... అలానే డెడ్‌డ్రాప్ విధానంలో విక్రయించడానికి ప్రయత్నించిన ‘ఈగల్’ఇంటి దొంగలు పులకరం స్వామి, సుగూరి నరహరి గౌడ్ పోలీసులకు చిక్కారు. తెలంగాణ స్పెషల్ పోలీసు (టీజీఎస్పీ) విభాగంలో కానిస్టేబుళ్లయిన ఈ ద్వయం గత ఏడాది జనవరి నుంచి మాదకద్రవ్యాల వ్యతిరేక విభాగం ఈగల్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇద్దరినీ అరెస్టు చేసిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం...
కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో డెడ్‌డ్రాప్ ద్వారా...
ఇటీవల కాలంలో డ్రగ్ సప్లయర్స్ మాదకద్రవ్యాల సరఫరా పంథాను పూర్తిగా మార్చేశారు. ఒకప్పుడు నేరుగా వచ్చి, ఆపై కొరియర్ లేదా పార్సిల్ ద్వారా డ్రగ్స్ పంపేవాళ్లు. ఇలా చేస్తుంటే పోలీసుల నిఘాకు చిక్కుతున్నామనే ఉద్దేశంతో కొన్నాళ్లుగా డెడ్‌డ్రాప్ విధానంలో పార్సిల్ చేయడం ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ పెడ్లర్ ఇచ్చిన ఆర్డర్ ఆధారంగా పొరుగు రాష్ట్రానికి చెందిన సప్లయర్ రూ.1.5 కోట్ల విలువైన మెథ్‌ను ఈ నెల 3న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో డెడ్‌డ్రాప్ చేశాడు. దీన్ని పార్సిల్ చేసి జనరల్ బోగీలో నిర్దేశిత ప్రాంతంలో ఉంచాడు. ఆ వివరాలు, ఫొటోను ఇక్కడి పెడ్లర్‌కు వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. రైలు నగరానికి చేరుకున్నాక పెడ్లర్ వెళ్లి ఆ పార్సిల్ తీసుకోవాల్సి ఉంది.
ఈగల్‌లో అంతర్భాగమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని రీజినల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్‌లో పని చేస్తున్న కానిస్టేబుళ్లు పులకరం స్వామి, సుగూరి నరహరి గౌడ్‌లకు ఈ నెల 4న ఆ రైలులో ఈ పార్సిల్ దొరికింది. బహిరంగ మార్కెట్‌లో రూ.1.5 కోట్ల విలువైన మెథ్‌ను విక్రయించి సొమ్ము చేసుకోవాలని కుట్ర పన్నారు. డ్రగ్ పెడ్లర్స్‌పై నిఘా ఉంచడానికి అధికారులు ఇప్పటివరకు రికార్డుల్లోకి ఎక్కిన వారి వివరాలను వీరికి అందించారు.
అందులోని ఫోన్ నంబర్ల ఆధారంగా వీరిని సంప్రదించి విక్రయించాలని పథకం వేశారు. దీనికోసం జగదీష్ మార్కెట్ నుంచి సెకండ్ హ్యాండ్ ఫోన్ ఖరీదు చేశారు. స్వామి తన వద్ద ఉన్న ఓ నేరగాడి సిమ్‌కార్డును ఇందులో వేశారు. ఆపై ఈ ద్వయం తమ వద్ద ఉన్న జాబితాలోని ఫోన్ నంబర్ ఆధారంగా పక్షం రోజుల క్రితం లూథిఫర్ అనే పెడ్లర్‌ను సంప్రదించారు. అతడికి ఐదు గ్రాముల మెథ్ విక్రయించిన ఇద్దరు కానిస్టేబుళ్లు డెడ్‌డ్రాప్ విధానంలో అందించారు. మరో పెడ్లర్‌తో 100 గ్రాములకు బేరం కుదుర్చుకుని, దాన్ని కూడా పార్సిల్ చేసి ఏదో ఒకచోట డ్రాప్ చేయాలని నిర్ణయించుకున్నారు.
నాంపల్లికి వచ్చి చిక్కి..
ఈ పార్సిల్ తీసుకుని ఈ ద్వయం నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ సమీపంలో ఉన్న యూని గ్యాస్ ఆటో ఎల్పీజీ పంప్ పక్కన ఉన్న సందులో డెడ్ డ్రాప్ చేయడానికి సిద్ధమయ్యారు. స్వామికి చెందిన ద్విచక్ర వాహనంపై సోమవారం అక్కడకు వచ్చారు. అప్పటికే దీనిపై సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, ద్విచక్ర వాహనంతోపాటు మెథ్ స్వాధీనం చేసుకున్నారు.
నల్లగొండ జిల్లా చందూర్ మండలం ఉదాతలపల్లికి చెందిన పులకరం స్వామి ప్రస్తుతం 3వ బెటాలియన్‌లో పనిచేస్తూ కుంట్లూరు రత్న కాలనీలో ఉంటున్నాడు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాలకు చెందిన నరహరి గౌడ్ 12వ బెటాలియన్‌లో పనిచేస్తూ మన్నెగూడ బృందావన్ కాలనీలో నివసిస్తున్నాడు. వీరిని రిమాండ్‌కు తరలించిన సీసీఎస్ పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. పరారీలో ఉన్న లూథిఫర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.


