అమెరికా వర్సిటీల్లో అలజడి
ఏఐ, డేటాసైన్స్ మాస్టర్స్‌కూ కష్టాలు
2025లో 9 వేల మంది ఫ్యాకల్టీలు ఇంటికి
ప్రాక్టికల్స్‌కు ఫుల్‌స్టాప్.. నాణ్యతకు తిలోదకాలు
17 శాతం తగ్గిన విదేశీ విద్యార్థులు
వీసా ఆంక్షలు.. పరిశోధన నిధుల్లో కోత
భారత విద్యార్థుల భవితపై తీవ్ర ప్రభావం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో భారతీయ విద్యార్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. అక్కడి వర్సిటీల్లో రానురాను నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది. విశ్వవిద్యాలయాలు అధ్యాపకులను తగ్గించుకుంటున్నాయి. కోర్సులకూ కోత పెడుతున్నాయి. సిలబస్‌లో మార్పులు చేస్తున్నాయి. భారతీయులు ఎక్కువ ఆసక్తి చూపించే ఏఐ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ మాస్టర్ డిగ్రీలకూ ఇదే ప్రతికూల పరిస్థితి. మౌలిక సదుపాయాలకు వర్సిటీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పరిశోధనల వైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాయి. ప్రాధాన్యతనివ్వాల్సిన ప్రాక్టికల్ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రధాన వర్సిటీలు మినహా... విదేశీ విద్యార్థులు వెళ్లే అన్ని చోట్లా ఇదే పరిస్థితి.
గత ఏడాది 9 వేల మంది తొలగింపు
అమెరికా ఆన్‌లైన్ జర్నల్ ‘ఇన్‌సైడ్ హయ్యర్ ఎడ్యుకేషన్’కథనం ప్రకారం వర్సిటీలు 2025లో 9 వేలకుపైగా అధ్యాపకులను తొలగించాయి. గత ఏప్రిల్‌లో వెయ్యికి పైగా తొలగింపులు జరిగినట్టు పేర్కొంది. ఈ నెల మొదటి వారంలో ఇల్లినాయి టెక్ 160 మందికి ఉద్వాసన పలికింది. ది న్యూస్కూల్‌లో జూన్‌లో 19 మంది ఫ్యాకల్టీ, 68 మంది సిబ్బందిని తొలగించారు. పోర్ట్‌లాండ్ స్టేట్ యూనివర్సిటీ తాజాగా 36 మంది ఫ్యాకల్టీని ఇంటికి పంపింది. మరో 8 మందిని కాలపరిమితి గల ఫ్యాకల్టీగా మార్చింది.
వెస్ట్రన్ మిచ్‌గన్ వర్సిటీ 60 ఏళ్లు నిండిన అధ్యాపకులకు బై అవుట్ ఇచ్చింది. వారికి భారీగా ఆఫర్లు ప్రకటించి, రాజీనామా చేయించింది. అర్సినస్ కాలేజీ 29 పూర్తిస్థాయి ఫ్యాకల్టీ పోస్టులను పార్ట్‌టైమ్‌గా మార్చి వేతనాలు తగ్గించింది. కొలంబియా కాలేజీ ఆఫ్ షికాగో 54 ఫ్యాకల్టీ పోస్టులను రద్దు చేసింది. అనేక వర్సిటీల్లో ఇదే పరిస్థితి. భారత విద్యార్థులు చదివే 80 శాతం వర్సిటీల్లో అధ్యాపకుల కోత కన్పిస్తోంది. పరిశోధనకు పనికిరాని విధంగా కోర్సులు మారుతున్నాయని అక్కడి అధ్యాపకులు అంటున్నారు.
కారణాలేంటి?
ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలుగా పేరు పొందిన అమెరికా వర్సిటీలు ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ వీసా మార్పులు విద్యార్థుల్లో భయం పుట్టిస్తున్నాయి. దీంతో విదేశీ విద్యార్థుల సంఖ్య రెండేళ్లుగా గణనీయంగా తగ్గింది. 2024–25లో అమెరికాకు వచ్చిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 11,77,766. వీరి ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు 55 బిలియన్ డాలర్లు వచ్చాయి. దీనివల్ల 3.55 లక్షల మందికిపైగా ఉద్యోగాలు పొందారని రికార్డులు చెబుతున్నాయి.
గత ఏడాది 14 శాతం విద్యార్థులు తగ్గారు. ఈ ఏడాది 17 శాతానికి చేరినట్టు అంచనా. దీంతో ఈ ఏడాది ఆమెరికా ఆర్థిక వ్యవస్థకు 3.4 బిలియన్ డాలర్ల ఆదాయం తగ్గవచ్చని లెక్కగట్టారు. ఇది 40 వేల మంది ఉద్యోగులపై ప్రభావం చూపవచ్చని జాబ్‌డేటా గుర్తించింది. ఫలితంగా వర్సిటీలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లాయి. సిబ్బంది వేతనాలు, బీమా, ఇతర సంక్షేమం ఖర్చులు పెరగడం, మరోవైపు ఆదాయం తగ్గడం సమస్యగా మారింది. పోర్ట్‌ల్యాండ్ వర్సిటీ 3.6 కోట్ల డాలర్ల లోటులోకి వెళ్లగా, కొలంబియా కాలేజీ 4 కోట్ల డాలర్ల లోటు చూపించింది.
భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం
ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ సబ్జెక్లుల్లో మాస్టర్ డిగ్రీ కోసం భారత్ నుంచి విద్యార్థులు ఎక్కువగా అమెరికా వెళ్తారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుందని, ప్రధాన కంపెనీలు వర్సిటీ భాగస్వామ్యంతో పనిచేస్తాయని విశ్వసిస్తారు. దీనివల్ల ఏఐలో తాజా టెక్నాలజీ నేర్చుకోవడం, కోర్సు పూర్తవ్వగానే స్కిల్ ఉద్యోగాలు పొందే వీలుందని భావిస్తారు. కంపెనీలకు వర్సిటీలు దూరమవ్వడంతో పరిపూర్ణమైన విద్య అందే అవకాశం ఉండదు. దీనివల్ల ఉద్యోగాలు పొందడం కష్టమవుతుంది. పరిశోధనలకు ప్రాధాన్యత తగ్గడం వల్ల ఏఐ, సైబర్ సెక్యూరిటీలో కొత్త చాలెంజ్‌ను ఎదుర్కోవడం విద్యార్థులకు సమస్యగా మారుతుంది. రూ.లక్షలు అప్పుచేసి అమెరికా వెళ్లినా ఉపయోగం లేకపోవడం విద్యార్థులకు ఆర్థికంగా, విద్యాపరంగా నష్టం జరిగే వీలుందని నిపుణులు అంటున్నారు.
ఫ్యాకల్టీ కోతలు పెరుగుతున్నాయి
ఆంక్షల నేపథ్యం, అంతర్జాతీయ పరిణామాల వల్ల అమెరికా వర్సిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. కీలకమైన బ్రాంచీల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందనే ఆందోళనలూ ఉన్నాయి. ఇది నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. –ప్రొ. మాథ్యూ హోలాండ్ (పరూడ్య యూనివర్సిటీ)
ఉపాధికీ దెబ్బే
మాస్టర్ డిగ్రీలో పరిశోధనలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ముఖ్యం. ఏఐ వేగం తర్వాత కొత్త టెక్నాలజీపై పట్టు పెరగాలి. ఫ్యాకల్టీ తగ్గుదల వల్ల ఈ తరహా కృషికి బ్రేకులు పడే ప్రమాదం ఉంది. దీనివల్ల విద్యార్థులు కార్పొరేట్ సంస్థల అవసరాలకు తగ్గట్టు తయారవ్వడం కష్టం. ఇది ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుంది. –ప్రొ. నథానెల్ హన్సూ (యూనివర్సిటీ ఆఫ్ జార్జియా)


