A ఫర్‌ అఫిడవిట్‌.. B ఫర్‌ బెయిల్‌ | Law lessons for school students across the state | Sakshi
Sakshi News home page

A ఫర్‌ అఫిడవిట్‌.. B ఫర్‌ బెయిల్‌

Aug 27 2026 5:55 AM | Updated on Aug 27 2026 5:55 AM

Law lessons for school students across the state

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు ‘న్యాయ’పాఠాలు

పలు చట్టాలతో పాటు సెక్షన్లు, శిక్షలపై అవగాహనకు చర్యలు

అన్ని విద్యా సంస్థల్లో నిర్వహణకు టీజీఎల్‌ఎస్‌ఏ ఏర్పాట్లు 

ఇప్పటికే దాదాపు 3,180పైగా మహిళా ఉపాధ్యాయులకు శిక్షణ

మిషన్‌ బాల్‌ సురక్ష, శిక్ష అండ్‌ న్యాయ్‌–2026 రూపకల్పన

ఏ ఫర్‌ అఫిడవిట్‌.. బీ ఫర్‌ బెయిల్‌.. అంటూ పాఠశాల విద్యార్థులకు ‘న్యాయ’పాఠాలు నేర్పించాలని తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ(టీజీఎల్‌ఎస్‌ఏ), పాఠశాల విద్యా శాఖ నిర్ణయించాయి. వివిధ చట్టాలు, సెక్షన్లతో పాటు శిక్షలకు సంబంధించిన పూర్తి వివరాలపై వారికి అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాయి. దీని కోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమమే ‘మిషన్‌ బాల్‌ సురక్ష, శిక్ష అండ్‌ న్యాయ్‌–2026’. 

పలు చట్టాలపై తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 3,180 మంది మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్లుగా ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. మరిన్ని పాఠశాలలకు వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ, న్యాయ సేవల సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి, అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ శామ్‌కోషి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

పాఠశాల విద్యాశాఖతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో బాలల హక్కులు, బాలలకు సంబంధించిన చట్టాలు, న్యాయ సాయం అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటివరకు 3,180 మంది పాఠశాల ఉపాధ్యాయులకు చట్టాలపై శిక్షణ ఇచ్చాం. ఇందులో ‘గుడ్‌ టచ్‌– బ్యాడ్‌ టచ్‌’తోపాటు పలు కీలక చట్టాలున్నాయి.  – జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, హైకోర్టు సీజే 

ప్రధానంగా ఏఏ చట్టాలపై అవగాహన?
» బాలలపై వేధింపులు, కించపర్చడం
»  బాల్య వివాహాలు, సమస్యలు
»   బాల కార్మిక వ్యవస్థ
»  మాదకద్రవ్యాల వినియోగం, ఇతర వ్యసనాలు
» ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు
»   బాలల హక్కులు, రక్షణ చట్టాలు
»  గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌(‘ధీరా వెల్‌నెస్‌ ప్రోగ్రామ్‌’ద్వారా యోగా సాధన)

ఏమేం చేస్తారు..?
»    రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో న్యాయ అక్షరాస్యత, అవగాహన కార్యక్రమాల నిర్వహణ
»  లీగల్‌ లిటరసీ క్లబ్‌లు, చైల్డ్‌ రైట్స్‌ క్లబ్‌ల ఏర్పాటు 
»  చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్లుగా నియమితులయ్యే ఉపాధ్యాయుల (మహిళ)కు ప్రత్యేక శిక్షణ
»  విద్యార్థులకు వారి హక్కులు, విధులపై పోటీలు, ఇంటరాక్టివ్‌ సెషన్లు 
»   చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలు, పోలీసు శాఖ, ఎన్‌జీవోలతో సమన్వయం
»  అవసరమైన సందర్భాల్లో విద్యార్థులు, వారి కుటుంబాలకు న్యాయ సాయం కల్పించడం

పాఠశాల విద్యార్థుల్లో న్యాయ అవగాహన, రాజ్యాంగ విలువలు, బాలల హక్కులపై చైతన్యం పెంపొందించడంతో పాటు బాలల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. స్కూల్‌ స్థాయి నుంచే విద్యార్థులకు కనీస చట్టాలపై అవగాహన అవసరం ఎంతైనా ఉంది. సబ్జెక్ట్‌ అంశాల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి కూడా న్యాయ అవగాహన ఉండటం లేదు. వారికి సంబంధించిన చట్టాలు తెలియడం లేదు. అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రస్తుతం సమాజంలో విద్యార్థి దశ నుంచే చట్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. – సీహెచ్‌.పంచాక్షరి, సభ్యకార్యదర్శి, టీజీఎల్‌ఎస్‌ఏ 

పర్యవేక్షణ కమిటీ  రాష్ట్ర స్థాయిలో..
»  పాఠశాల విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌
»   విద్యాశాఖ ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌
»   టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ సభ్యకార్యదర్శి/అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌

జిల్లా స్థాయిలో....
»   జిల్లా విద్యాశాఖ అధికారి 
»    జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్‌పర్సన్‌
»  డీఎల్‌ఎస్‌ఏ (జిల్లా న్యాయసేవా సంస్థ) కార్యదర్శి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement