వ్యక్తిగత సమాచారం..సైబర్ నేరగాళ్లకు ఆయుధం
వివరాలు షేర్ చేసే ముందు ఆలోచించండి.. క్లిక్ చేసే ముందు ధ్రువీకరించుకోండి
బలమైన పాస్‌వర్డ్‌లు, 2 ఎఫ్‌ఏతో ఖాతాలకు రక్షణ.. ఓటీపీ, పిన్, సీవీవీ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచారం అత్యంత విలువైన ఆస్తిగా మారింది. ఒకప్పుడు సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతా నంబర్, కార్డు వివరాలు మాత్రమే అవసరమయ్యేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. బాధితుడి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్, సోషల్ మీడియా ప్రొఫైల్, ఉద్యోగం, కుటుంబ సభ్యుల వివరాలు, ప్రయాణ వివరాలు, ఫొటోలు, లొకేషన్, ఆన్‌లైన్ కొనుగోళ్ల సమాచారం వంటి చిన్నచిన్న వివరాలను సేకరించి.. వాటిని ఆధారంగా చేసుకుని మరింత నమ్మదగిన మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే మీ భద్రత మీ చేతుల్లోనే.. అని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా సైబర్ భద్రతపై కనీస అవగాహన తప్పనిసరని వారు హెచ్చరిస్తున్నారు. బ్యాంకు అధికారులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, కస్టమర్ కేర్ ప్రతినిధులమని చెప్పినా.. ఓటీపీ, యూపీఐ పిన్, ఏటీఎం పిన్, సీవీవీ, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ వంటి గోప్య వివరాలను ఎవరికీ చెప్పకూడదని పేర్కొంటున్నారు.
మనం ఇచ్చే వివరాలే పెట్టుబడి..
సోషల్ మీడియాలో మనం సరదాగా పెట్టే ప్రతి సమాచారం సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోంది. పుట్టిన తేదీ, కుటుంబ సభ్యుల పేర్లు, పిల్లల పాఠశాల, ఉద్యోగ సంస్థ, ఇంటి ప్రాంతం, సెలవుల కోసం ఎక్కడికి వెళ్తున్నామనే వివరాలు కూడా నేరగాళ్లు సేకరించే ప్రమాదం ఉందని మనం గ్రహించాలి. ఈ సమాచారాన్ని ఉపయోగించి బాధితుడికి తెలిసిన వ్యక్తిలా ఫోన్ చేయడం, బ్యాంకు లేదా ప్రభుత్వ సంస్థ పేరుతో సందేశాలు పంపడం, నకిలీ పెట్టుబడి ఆఫర్లు ఇవ్వడం, బంధువు అత్యవసర పరిస్థితిలో ఉన్నాడంటూ డబ్బులు అడగడం వంటి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది.
బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం మరవొద్దు..
ఈ–మెయిల్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ బ్యాంకింగ్, క్లౌడ్ స్టోరేజ్ తదితర ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్ ఉపయోగించడం ప్రమాదకరం. ఒక ఖాతా పాస్‌వర్డ్ లీక్ అయితే మిగిలిన ఖాతాలన్నింటికీ ముప్పు ఏర్పడుతుంది. ప్రతి ముఖ్యమైన ఖాతాకు ప్రత్యేకమైన పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, 123456, p్చటటఠీౌటఛీ వంటి సులభంగా ఊహించగలిగే పాస్‌వర్డ్‌లు అస్సలు వద్దని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక చిహ్నాలతో పొడవైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలని వారు సూచిస్తున్నారు. పాస్‌వర్డ్‌ను కాగితాలపై, ఫోన్ నోట్స్‌లో బహిరంగంగా రాసి ఉంచకూడదని, అవసరమైన చోట మల్టీ–ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేదా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్‌ఏ, 2ఎఫ్‌ఏ)ను యాక్టివేట్ చేయాలని సూచిస్తున్నారు. డబ్బు పంపడానికి యూపీఐ పిన్ అవసరం. డబ్బు స్వీకరించడానికి యూపీఐ పిన్ అవసరం లేదని గుర్తుంచుకోవాలి.
ఆగండి.. ఆలోచించండి.. ధ్రువీకరించండి..
» అధికారిక వెబ్‌సైట్ లేదా సంస్థకు చెందిన అధికారిక యాప్ ద్వారా మాత్రమే సేవలను ఉపయోగించాలి. మెసేజ్‌లో ఉన్న లింక్‌ను ఉపయోగించకుండా సంస్థ అధికారిక నంబర్ లేదా వెబ్‌సైట్ ద్వారా వివరాలను నిర్ధారించుకోవాలి.
» సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం అవసరానికి మించి పంచుకోవద్దు.
» సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని పంచుకోవడం అలవాటుగా మారింది. అయితే అది వ్యక్తిగత భద్రతకు ముప్పుగా మారవచ్చు.
» ఇంటి పూర్తి చిరునామా, వ్యక్తిగత ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, కుటుంబ సభ్యు ల వివరాలు, ప్రయాణానికి సంబంధించిన కచ్చితమైన తేదీలు సోషల్ మీడియాలో పంచుకోవద్దు.
» లొకేషన్ షేరింగ్‌ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి.
» పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ వంటి సున్నితమైన లావాదేవీలను వీలైనంత వరకు నివారించాలి.
»అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదు.


