వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్‌లు సంయుక్తగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణించారనే ప్రచారం అప్పట్లో జోరందుకుంది. తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు గైర్హాజరు కావడంతో ఆ ప్రచారానికి ఊతం ఇచ్చినట్లైంది.
ఈ క్రమంలో మోజ్తాబా తన అనుచరులతో మాట మంతి నిర్వహించడం, ఆయనే స్వయంగా మాట్లాడిన వీడియోలను ఇరాన్ విడుదల చేసింది. దీంతో మోజ్తాబా మరణంపై కొనసాగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడినట్లైంది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఖమేనీ ఆచూకీపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు గ్లెన్ బెక్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. గత కొన్ని నెలలుగా ఖమేనీ కనిపించకపోవడంపై వస్తున్న వార్తలను ఆయన ప్రస్తావించారు. ‘ఖమేనీ చనిపోయాడని నేను అనుకోవడం లేదు. కానీ వైమానిక దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఆయన ఎడమ వైపు శరీరం, చేయి, కాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆయన పరిస్థితి విషమంగానే ఉంది.. కానీ ప్రాణాలతోనే ఉన్నారు’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
ఒకవేళ మొజ్తాబా ఖమేనీ పూర్తిగా అచేతన స్థితిలోకి వెళ్ళినా, మరణించినా.. ఇరాన్ ప్రభుత్వం ఆ నిజాన్ని దాచిపెడుతోందని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచాన్ని, ఇరాన్ ప్రజలను నమ్మించడానికి ఇరాన్ రహస్య నాటకం ఆడుతోందన్నారు.
గత కొన్ని నెలలుగా మొజ్తాబా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడం వెనుక ఇస్రాయెల్ క్షిపణి దాడుల ప్రభావం ఉందనే అనుమానాలకు ట్రంప్ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇరాన్ తన దేశాధినేత పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని చూపిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఆ దేశ నాయకత్వం ఎంతటి బలహీన స్థితిలో ఉందో ట్రంప్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.
అవన్నీ పాత వీడియోలేనా
ఇరాన్ అత్యున్నత నాయకుడికి సంబంధించిన పాత వీడియో దృశ్యాలను ఇరాన్‌కు చెందిన ‘ఫార్స్ న్యూస్’ విడుదల చేసిందని ‘అల్ అరబియా’ నివేదించింది. అల్ అరబియా కథనం ప్రకారం, ఆయన అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టకముందే ఈ దృశ్యాలు చిత్రీకరించినట్లు ఆరోపించింది
ఎవరి మాటలు నమ్మాలి
ప్రపంచానికి తమ సుప్రీం లీడర్ ఆరోగ్యంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చేందుకు ఇరాన్ మీడియా ఈ వీడియోలను విడుదల చేసింది. ఆగస్టు నెలలో ఇరాన్ మీడియా ఈ వీడియోను విడుదల చేయడానికి ముందు, ఇరాన్ అత్యున్నత నాయకుడి ఆరోగ్యం విషమంగా ఉందని, ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఆ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'మెహర్ న్యూస్' ఒక వీడియోను విడుదల చేసింది. తేదీ లేని ఆ వీడియోలో సుప్రీం లీడర్ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు.
అంతకుముందు, ఖమేనీ అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నారని ఇజ్రాయెల్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్ అంతర్గత వర్గాలు, అలాగే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ యంత్రాంగానికి సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ‘ది జెరూసలేం పోస్ట్’ ప్రచురించిన కథనాల ప్రకారం, ఇరాన్ నాయకత్వంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
అవన్నీ ఊహాగానాలే
ఆ తర్వాత కొద్దిసేపటికే, అత్యున్నత నాయకుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పేర్కొన్నారు. ఆయన శారీరక పరిస్థితికి సంబంధించిన ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. ఏడు నుండి ఎనిమిది గంటల పాటు కూర్చుని చర్చించగలిగే వ్యక్తికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు అని అధ్యక్షుడు అన్నారు. ఆగస్టు ప్రారంభంలో తాను ఆయనతో మంచి సమావేశాన్ని నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడులలో తన తండ్రి, మాజీ సర్వోన్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, మొజ్తాబా ఖమేనీ ఆ పదవిని చేపట్టారు. ఆ పదవిని చేపట్టినప్పటి నుండి, మొజ్తాబా ఖమేనీ ఎక్కడా బహిరంగంగా కనిపించకుండా కేవలం లిఖితపూర్వక ప్రకటనల ద్వారా మాత్రమే వ్యవహరిస్తున్నారు.
👉ఇదీ చదవండి: ‘యుద్ధంతో జీవించలేం’.. ఇరాన్‌లో వినిపిస్తున్న కొత్త స్వరం


