హాలీవుడ్‌ స్టైల్‌లో రష్యా, అమెరికా సీక్రెట్‌ చర్చలు | US-Russia relations just mirrored a Hollywood spy thriller | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ స్టైల్‌లో రష్యా, అమెరికా సీక్రెట్‌ చర్చలు

Aug 27 2026 5:43 AM | Updated on Aug 27 2026 5:43 AM

US-Russia relations just mirrored a Hollywood spy thriller

మాస్కోకు వచ్చిన సీఐఏ డైరెక్టర్‌ 

దాడులు ఆపాలని ఉక్రెయిన్‌కు అమెరికా హుకుం! 

చర్చలు జరిగాయన్న క్రెమ్లిన్‌ ప్రతినిధి. 

వివరాలు గోప్యం!

ఉప్పు నిప్పుగా ఉండే అమెరికా రష్యాల మధ్య తాజా పరిణామాలు హాలీవుడ్‌ సినిమాను తలపిస్తున్నాయి. వేర్వేరు వార్తా సంస్థలు, అధికార వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అమెరికా గూఢచార సంస్థ సీఐఏ చీఫ్‌ తాజాగా మాస్కో వెళ్లి రష్యన్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం క్రెమ్లిన్‌ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా ఇటీవలి కాలంలో అమెరికా – రష్యా దౌత్య సంబంధాలు కనిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ పర్యటన చోటు చేసుకోవడం.. అది కూడా అత్యంత రహస్యంగా జరగడం ఆసక్తి రేకెత్తిస్తోంది. 

సీఐఏ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌ క్లిఫ్‌ రష్యా వచ్చారని, అధ్యక్షుడు పుతిన్‌ను కలవకపోయినప్పటికీ చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించామని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ ప్రకటించారు. ఏ ఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం చెప్పలేదు. మరోవైపు ఈ చర్చలపై కానీ, డైరెక్టర్‌ రష్యా పర్యటనపై కానీ సీఐఏ కూడా నోరు మెదపడం లేదు. వైట్‌హౌస్‌ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. అమెరికా మిలిటరీ విమానం మాస్కోలోని వ్నూకోవో విమానాశ్రయంలో మంగళవారం ల్యాండ్‌ అయిందని, అదే రోజు తిరిగి వెళ్లిపోయిందని రష్యా అధికార వార్తా సంస్థలు తెలిపాయి. 

ఇవన్నీ ఇలా ఉంటే.. ‘‘ప్రతినిధి బృందం ఒకటి రష్య రాజధానికి వెళుతోంది. ఆ బృందం రష్యా నుంచి వెళ్లిపోయేదాకా దాడులకు విరామం ఇవ్వాలి’’అంటూ వాషింగ్టన్‌ నుంచి ఉక్రెయిన్‌కు ఆదేశాలు వెళ్లినట్లు ఉక్రెయిన్‌ అధికారి ఒకరు అసోసియేటెడ్‌ ప్రెస్‌కు తెలిపారని సమాచారం. రష్యా మొత్తమ్మీద దాడులు ఆపాల్సిందిగా చెప్పలేదని, మాస్కో, సెయింట్‌ పీటర్స్‌బెర్గ్, రష్యా ఉత్తర ప్రాంతాల్లో మాత్రం జరక్కూడదని అమెరికా స్పష్టంగా చెప్పిందని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆ అధికారి తెలిపారు. సీఐఏ డైరెక్టర్‌ రష్యా పర్యటన వివరాలను మొట్టమొదట సీబీఎస్‌ ఛానెల్‌ బయటపెట్టింది. 

సంక్షోభంలోనే దౌత్య సంబంధాలు... 
నిఘా వర్గాల స్థాయిలో ఇరు దేశాల మధ్య కొన్ని సంబంధాలు ఉన్నప్పటికీ రష్యా, అమెరికా మధ్య దౌత్య సంబంధాల్లో మాత్రం సంక్షోభం కొనసాగుతోందని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి పెస్కోవ్‌ చెబుతున్నారు. సీఐఏ డైరెక్టర్‌ పర్యటన ప్రభావం ఇరుదేశాల సంబంధాలపై ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. అయితే సీఐఏ డైరెక్టర్‌ రష్యా రావడం చాలా అరుదైన విషయమని రష్యా భద్రతాదళాల విషయంలో నిపుణుడైన అండ్రే సోల్డటోవ్‌ చెబుతున్నారు. సాధారణంగా ఈ స్థాయి సమావేశాలు అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఏదైనా దెబ్బ తగులుతోందన్న సందర్భంలోనే జరుగుతాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement