ఎన్నారై న్యూస్: అమెరికా స్టేట్ ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్లని సమాచారం. మృతుల్లో ఓ యువకుడు నిజామాబాద్ వాసిగా నిర్ధారణ అయ్యింది. మిగతా ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.
ఫ్లోరిడా హైవే పెట్రోల్ అందించిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున వాళ్లు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి కుటుంబ సభ్యులకు అక్కడి అధికారులు సమాచారం చేరవేశారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్.. మూడు నెలల కిందట ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ప్రమాదంలో అతనూ మరణించినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ వార్తతో ముగ్గురి స్వస్థలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాల్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: నేపాల్‌లో ప్రకృతి విలయ తాండవం


