సమయం ఉదయం 10 గంటలు. స్థలం ఉప్పల్ రింగ్‌రోడ్డు బస్టాపు.. ఉప్పల్ నుచి నాగోల్, ఎల్‌బీనగర్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల మీదుగా మెహిదీపట్నం వెళ్లే రూట్ నంబర్ 300 బస్సు వచ్చి ఆగింది. క్షణాల్లోనే ప్రయాణికులతో బస్సు నిండిపోయింది. ఆ తర్వాత 10 నిమిషాలకు వచ్చిన మరో బస్సు కూడా కిక్కిరిసిపోయింది. ఈ రెండు బస్సుల తర్వాత వరుసగా ప్రతి 2 నిమిషాలకో బస్సు వచ్చి చాలా వరకు ఖాళీగానే వెళ్లాయి.
ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి బయలుదేరిన 39 బస్సుల్లో ఇలా సగానికి పైగా ఖాళీగా బయల్దేరినవే ఉన్నాయి. కొన్ని మాత్రం సగం ప్రయాణికులతో కదిలాయి. ఈ ఒక్క రూట్ మాత్రమే కాదు. నగరంలోని ప్రధాన మార్గాల్లో ఇదే పరిస్థితి. బస్సుకు మరో బస్సుకు మధ్య కనీస వ్యవధి లేకుండా బయలుదేరుతున్నాయి. ఐదారు బస్సులు ఒకేసారి వరుసగా వస్తున్నాయి. కొన్నిసార్లు గంట గడిచినా ఒక్క బస్సు కూడా అందుబాటులో ఉండదు. మరోవైపు ఒకేరూట్‌లో నగరంలోని వివిధ డిపోల నుంచి బయలుదేరే బస్సుల మధ్య నిర్దిష్టమైన సమయపాలన అమలు కావడం లేదు.
కొరవడిన సమయ పాలన..
బోరబండ మీదుగా సికింద్రాబాద్ వరకు రాకపోకలు సాగించే ‘10 వై/ఎఫ్’ రూట్‌లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో వరుసగా 5 బస్సులు బయలుదేరాయి. మొదటి రెండు బస్సుల్లో మాత్రమే ప్రయాణికులు కనిపించారు. ఆ తరువాత అన్నీ ఖాళీయే. కానీ.. ఈ ఐదు బస్సులు వెళ్లిపోయిన తర్వాత గంటకు పైగా ఒక్క బస్సు కూడా రాలేదు. దీంతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సివచి్చంది. నగరంలోని సుమారు 1,050 రూట్‌లలో సిటీ బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రధాన రూట్‌లలో వివిధ డిపోల నుంచి బస్సులను నడుపుతున్నారు. నాలుగైదు డిపోల బస్సులు ఒకేసారి రావడంతో బంచింగ్ సమస్య తలెత్తుతోంది. కొన్ని రూట్‌లలో నిమిషానికి ఒకటి చొప్పున నడిస్తే మరికొన్ని రూట్‌లలో అరగంట నుంచి గంట గడిచినా బస్సులు లభించడం లేదు. నగరంలోని 25 డిపోల నుంచి ప్రతిరోజూ సుమారు 1,950 బస్సులు రోజుకు 24 వేల ట్రిప్పులకు పైగా తిరుగుతున్నట్లు అంచనా. బస్సుల మధ్య సమయపాలనను రేషనలైజ్ చేయకపోవడంతోనే బంచింగ్ సమస్య ఉత్పన్నమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. కొన్ని డిపోల్లో కండక్టర్‌లు, డ్రైవర్లు సకాలంలో విధులకు హాజరు కాకపోవడంతోనూ బస్సులు ఆలస్యంగా బయలుదేరుతున్నట్లు ఆరోపణలున్నాయి.
మొదటి రెండింట్లోనే రద్దీ..
పటాన్‌చెరు నుంచి సికింద్రాబాద్‌కు 219, 226 రూట్ బస్సులు ఎక్కువగా నడుస్తాయి. ఒకేసారి నాలుగైదు బస్సులు వస్తున్నాయి. మొదట వచ్చే రెండింటిలో మాత్రమే రద్దీ ఉంటుంది. మిగతావి ఖాళీగా ఉంటాయి.
– జ్యోతి, ప్రయాణికురాలు, కూకట్‌పల్లి
ట్రాఫిక్ సమస్యల వల్లే..
హై ప్రీక్వెన్సీ రూట్లలోనే ఈ బంచింగ్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్‌లలో ప్రతి 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు, 10 నిమిషాల వ్యవధితో బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు ఎక్కడో ఒకచోట ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో చివరకు అన్నీ కలిసి ఒకే బస్టాప్‌లో ఒకే సమయానికి చేరుకుంటున్నాయి.
– శ్రీధర్, ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ
చదవండి: భారీగా పెరిగిన చాయ్ ధర!


