చేపల మార్కెట్‌కు మోదీ పేరు.. రచ్చరచ్చ! | Row in Gujarat as Surat Wholesale Fish Market Named After PM Narendra Modi | Sakshi
Sakshi News home page

చేపల మార్కెట్‌కు మోదీ పేరు.. రచ్చరచ్చ!

Aug 26 2026 8:34 AM | Updated on Aug 26 2026 8:34 AM

Row in Gujarat as Surat Wholesale Fish Market Named After PM Narendra Modi

గాంధీనగర్‌: గుజరాత్‌లోని సూరత్ నగరపాలక సంస్థ (ఎస్‌ఎంసీ) ఆధ్వర్యంలో నిర్మించిన హోల్‌సేల్ చేపల మార్కెట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టడం వివాదానికి దారితీసింది. నాన్‌పురా ప్రాంతంలోని లక్కడ్‌కోట్‌లో నూతనంగా నిర్మించిన ఈ మార్కెట్ ప్రవేశద్వారం వద్ద ‘శ్రీ నరేంద్ర మోదీ హోల్‌సేల్ ఫిష్ మార్కెట్’ అని రాసి ఉన్న భారీ బోర్డును ది సూరత్ ఫిష్ మర్చంట్ అసోసియేషన్ (ఎస్‌ఎఫ్‌ఎంఏ) ఏర్పాటు చేసింది. ఆ బోర్డుపై ప్రధాని చిత్రపటాన్ని కూడా ముద్రించారు.

అయితే ప్రధాని మోదీ పూర్తిగా శాకాహారి అని, జీవితంలో ఎన్నడూ మాంసాహారం ముట్టని ఆయన పేరును చేపల మార్కెట్‌కు పెట్టడం సరికాదని కొందరు వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎస్‌ఎంసీ సెంట్రల్ జోన్ అధికారులు.. ఈ పేరుకు ఇంకా అధికారిక అనుమతి లభించలేదని, ఎలాంటి తీర్మానం లేకుండానే బోర్డు పెట్టారని స్పష్టం చేశారు. ఆ బోర్డును వెంటనే తొలగిస్తామని వ్యాపార సంఘం హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ₹3 కోట్ల నిధులతో మార్కెట్ నిర్మాణం జరిగిందని, అందుకే ప్రధాని పేరు పెట్టామని అసోసియేషన్ తెలిపింది.

దేశ రాజకీయాల్లో చేపల చుట్టూ వివాదాలు చెలరేగడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే శ్రావణ మాసంలో యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ స్వాగత సభలో చేపల వంటకాలు వడ్డించడం వివాదాస్పదమైంది. అంతకుముందు నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా వండే చేప శాకాహారమేనని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నవరాత్రుల వేళ తేజస్వీ యాదవ్ హెలికాప్టర్‌లో చేపలు తింటున్న వీడియో కూడా రాజకీయ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: జపాన్‌లో అద్భుతం: 396 టన్నుల భారీ కోటను కదిలించిన వెయ్యిమంది జనం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement