యూపీఐకి పదేళ్లు.. మీ అనుభవమేంటో చెప్పండి: మోదీ | 10 Years of UPI: PM Modi Hails Indias Digital Payments Revolution | Sakshi
Sakshi News home page

యూపీఐకి పదేళ్లు.. మీ అనుభవమేంటో చెప్పండి: మోదీ

Aug 25 2026 9:29 AM | Updated on Aug 25 2026 9:34 AM

10 Years of UPI: PM Modi Hails Indias Digital Payments Revolution

న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విప్లవానికి బాటలు వేసిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత డిజిటల్‌ చెల్లింపుల ప్రయాణంలో ఇదొక కీలక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ తరుణంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆసక్తికరమైన పిలుపు ఇచ్చారాయన.

‘‘యూపీఐ ప్రారంభమై పదేళ్లు పూర్తయ్యాయి#10YearsOfUPI. దాని స్థాయి, విస్తృతి ప్రతి భారతీయుడూ గర్వించాల్సిన విషయం’’ అని మోదీ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. యూపీఐతో తమకు ఎదురైన అనుభవాలను, అది తమ జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను పంచుకోవాలని ప్రజలను కోరారు. #10YearsOfUPI హ్యాష్‌ట్యాగ్‌తో తన సందేశాన్ని పంచుకున్నారు.

చిన్నగా మొదలై.. భారీ విప్లవంగా
2016 ఏప్రిల్‌ 11న 21 బ్యాంకులతో యూపీఐ పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. అదే ఏడాది ఆగస్టు 25 నుంచి యూపీఐ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అప్పటినుంచి యూపీఐ వినియోగం అనూహ్యంగా పెరిగింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.78 కోట్ల వార్షిక లావాదేవీలు ఉండగా.. 2025–26లో ఏకంగా 24,162 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. లావాదేవీల విలువ కూడా తొలి ఏడాదిలో రూ.0.07 లక్షల కోట్ల నుంచి 2025–26లో సుమారు రూ.314 లక్షల కోట్లకు చేరింది.

ప్రపంచంలోనే అగ్రస్థానంలో..
యూపీఐ ఇప్పుడు భారతదేశ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థకు వెన్నెముకగా మారింది. 700కు పైగా బ్యాంకులు యూపీఐతో అనుసంధానమై ఉండగా.. ప్రపంచ రియల్‌టైమ్‌ చెల్లింపుల్లో దాదాపు 49 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

టీ దుకాణం నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు.. స్నేహితులకు డబ్బులు పంపడం నుంచి బిల్లులు చెల్లించడం వరకు యూపీఐ రోజువారీ జీవితంలో భాగమైపోయింది. నగదు అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్‌తో క్షణాల్లో చెల్లింపులు చేసే సౌలభ్యం డిజిటల్‌ లావాదేవీలను సామాన్యులకు మరింత చేరువ చేసింది.

‘మీ అనుభవం చెప్పండి’
యూపీఐ పదేళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ మోదీ.. ఈ వ్యవస్థ తమ జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో ప్రజలు చెప్పాలని కోరడం ఆసక్తికరంగా మారింది. యూపీఐ కేవలం చెల్లింపుల విధానాన్ని మార్చడమే కాకుండా.. భారత్‌ డిజిటల్‌ మౌలిక వసతుల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిన విజయగాథగా నిలిచిందని కేంద్రం పేర్కొంటోంది.

పదేళ్లలో 1.78 కోట్ల నుంచి 24 వేల కోట్లకు పైగా లావాదేవీల స్థాయికి చేరిన యూపీఐ.. భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో ఎంతటి మార్పు తీసుకొచ్చిందో ఈ గణాంకాలే చెబుతున్నాయి.

ఇదీ చదవండి: UPI సృష్టికర్త ఎవరో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement