తెలంగాణకు అవమానం | CM Revanth Reddy Fires On PM Narendra Modi Govt | Sakshi
Sakshi News home page

తెలంగాణకు అవమానం

Aug 25 2026 2:02 AM | Updated on Aug 25 2026 2:02 AM

CM Revanth Reddy Fires On PM Narendra Modi Govt

సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క తదితరులు

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణపై సీఎం రేవంత్‌ రెడ్డి ధ్వజం

వ్యక్తిగా రేవంత్‌రెడ్డికి అనుమతి నిరాకరించడం కాదు.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే 

మోదీ గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు.. ప్రధానిగా కాదు  

గుజరాత్‌ సీఎం అమెరికా,కెనడా పర్యటనలకు అనుమతిచ్చారు 

తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరిస్తారా? 

రాష్ట్ర బీజేపీ నేతలు గుజరాత్‌కు,మోదీకి బానిసలుగా ఉంటారా? 

కిషన్‌ రెడ్డి జన్మలో సీఎం కాగలడా? 

ప్రధానికి తెలియకుండా అనుమతి నిరాకరించడం జరుగుతుందా? 

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం.. వ్యక్తిగా రేవంత్‌రెడ్డికి అనుమతి నిరాకరించడం కాదు.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం, తిరస్కరణ. దీనికి కారణం గుజరాత్‌ ఆధిపత్యం. దేశ ప్రధాని మోదీ ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప భారత ప్రధాని అన్న విషయ విజ్ఞానంతో వ్యవహరించడం లేదు. ఇది తెలంగాణకు జరిగిన అవమానం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ రావు, సీతక్క, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రేవంత్‌ సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘సీఎం హోదాలో అభివృద్ధి కోసం చేసే పర్యటనను అడ్డుకుని తెలంగాణ పట్ల కేంద్రం స్పష్టమైన వివక్ష ప్రదర్శించింది. ఈ అంశాన్ని మా నాయకులు రాహుల్‌ గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ఇతర నాయకులంతా పార్లమెంటులో లేవనెత్తుతారు. ఇది ఆషామాషిగా తీసుకునే విషయం కాదు’ అని సీఎం మండిపడ్డారు. 

‘తెలంగాణ రైజింగ్‌–2047 లక్ష్యంతో వెళ్తున్నామని గతంలో నేను, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు విదేశాలకు వెళ్లేటప్పుడు పెట్టిన విధానంలోనే దరఖాస్తు పెట్టాం. రాజకీయ కోణంలో అనుమతిని తిరస్కరిస్తున్నట్టు విదేశాంగ శాఖ జవాబు ఇచ్చింది. రాజకీయ కారణం ఏమిటని మోదీని ప్రశ్నిస్తున్నా. మీరు (మోదీ) ఎన్నో దేశాల పర్యటనకు వెళ్లారు. మీ సొంత రాష్ట్రం గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ ఆగస్టు 17 నుంచి 24 వరకు 8 రోజుల పాటు అమెరికా, కెనడాలో పర్యటించి వైబ్రెంట్‌ గుజరాత్‌ అనే పాలసీని ప్రమోట్‌ చేయడానికి, రోడ్‌ షోలు చేసి, పెట్టుబడులు పెట్టాలని కోరడానికి అనుమతిచ్చారు. అదే తెలంగాణ రైజింగ్‌–2047 పాలసీలో భాగంగా విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం సీఎంగా అమెరికా పర్యటనకు వెళ్తానంటే నిరాకరిస్తారు. ఇంగ్లండ్, అమెరికా రెండింటికీ ఒకే విధానం, ఒకే అంశాలతో విదేశీ పర్యటన తలపెట్టాను. నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదనకుంటే ఇంగ్లండ్‌కు అనుమతి ఎందుకు ఇచ్చారు? అమెరికా పర్యటనకు ఎందుకు తిరస్కరించారు?’ అని రేవంత్‌ కేంద్రంపై మండిపడ్డారు.  

మోదీకి బానిసలుగా ఉంటారా? 
‘అమెరికా పర్యటనకు అనుమతి తిరస్కరిస్తూ కేంద్రం రాజకీయ కారణాలను అపాదించడాన్ని తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించాలి. గుజరాత్‌ను సమర్థించి మోదీ, గుజరాత్‌ చేతుల్లో కట్టుబానిసలుగా బతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటదలుచుకున్నారా? అని బీజేపీ తెలంగాణ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నా. తెలంగాణకు పెట్టుబడులు వస్తే గుజరాత్‌కు పోవేమో, గుజరాత్‌ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే కుట్రతో నా పర్యటనను అడ్డుకున్నారు. దీనిపై నేను స్పందించి విదేశీ వేదికపై నుంచి మాట్లాడి ఉంటే.. చూసినవా, దేశ ద్రోహి, విదేశాల్లో భారత దేశ గౌరవానికి భంగం కలిగించిండు అని విమర్శిస్తారనే ఇక్కడికి వచ్చాక ఖండిస్తున్నం. కేంద్రం తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం’ అని సీఎం అన్నారు.  

లక్ష్యాన్ని ఆపలేరు.. 
‘ఇంగ్లండ్‌లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి వెళ్లే వారు ఒక బృందాన్ని హైదరాబాద్‌కు పంపించి ఇక్కడ తమ క్యాంపస్‌ ప్రారంభించడానికి పరిస్థితులను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీకి వెళ్తే ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో స్వల్పకాలిక కోర్సులు, భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఆక్స్‌ఫర్డ్‌ క్యాంపస్‌ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ హైదరాబద్‌లో తమ క్యాంపస్‌ ఏర్పాటుకు అంగీకరించారు.  లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌తో మాట్లాడితే షార్ట్‌ టర్మ్‌ కోర్సులను ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ప్రారంభిస్తామన్నారు. అమెరికాలో సైతం బోస్టన్‌లోని హార్వర్డ్‌ యూనివర్సిటీ క్యాంపస్, ఎంఐటీ క్యాంపస్, నార్త్‌ ఈస్టర్న్‌ క్యాంపస్, వర్జీనియా టెక్‌ యూనివర్సిటీ వెళ్లాల్సి ఉండే. సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఐవీ లీగ్‌లోని టాప్‌ –10 వర్సిటీలను తెలంగాణకు తీసుకురావాలన్నది నా లక్ష్యం. మీరు నా పర్యటనను అడ్డుకున్నారు.. కానీ నా లక్ష్యాన్ని ఆపలేరు. అందుకే అధికారులను అమెరికాకు పంపించా. ఆక్స్‌ఫర్డ్‌తో అధికారులు ఒప్పందం చేసుకోబోతున్నరు. ఇతర వర్సిటీల ముందు మన ప్రతిపాదనలు ముందుపెట్టబోతున్నారు’ అని సీఎం పేర్కొన్నారు. 

ప్రధానికి తెలియకుండా జరగలేదు... 
‘మేం దరఖాస్తులో వివరాలు ఇవ్వలేదని బీజేపీ నేతలు తప్పుదోవ పట్టించారు. ఏ అధికారిక పర్యటనను అయినా భారత రాయబార కార్యాలయ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తారు. విమానాశ్రయంలో మేము దిగే నాటి నుంచి మళ్లీ తిరిగి వెళ్లే వరకు భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఇది చాటుమాటుగా పర్యటన కాదు. గతంలో విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఈ విషయాలన్నీ తెలుసు. తెలంగాణ సీఎం పర్యటనకు అనుమతిని సమీక్షించకుండా, ప్రధాని దృష్టిలో లేకుండా తిరస్కరించడం జరుగుతుందా? తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారిని శిక్షిస్తామని ప్రపంచానికి సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్, మెట్రో రైలు ఇతర విషయాల్లో తెలంగాణకు సహకరించడం లేదు’ అని రేవంత్‌ మండిపడ్డారు. అనుమతి నిరాకరణపై విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బీజేపీలో చేరాలని ఎద్దేవాచేశారు. 

మోదీ అన్ని దేశాలు తిరగొచ్చు.. 
‘న్యూయార్క్‌ మేయర్‌ మమ్దానీ అసాంఘిక శక్తి కాదు. మేయర్, అమెరికా ఉపాధ్యక్షుడి అపాయింట్‌మెంట్‌ అధికారికంగా ఖరారు కాకుంటే ఏ కార్యక్రమం జరగదు. మమ్దానీ ఏమైనా మన గల్లీలో ఉన్న కౌన్సిలరా? పోతాపోతా ఇంట్లోకి వెళ్లికూర్చుని మాట్లాడడానికి? కేటీఆర్‌ అమెరికా, హరీశ్‌ లండన్‌ వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. నాకు అమెరికా నుంచి ఆహ్వానం ఉంది. హార్వర్డ్‌లో విద్యార్థిగా చదివా. గతంలో మోదీపై తీవ్రమైన ఆరోపణలున్నాయని అమెరికాకు రానీయలేదు. మోదీ ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయాణం చేయొచ్చు.. ఆయన చంద్రమండలం కూడా ప్రయాణం చేసేటట్టు ఉండు’ అని సీఎం పేర్కొన్నారు. 

కిషన్‌రెడ్డి జన్మలో సీఎం కాగలడా? 
‘కిషన్‌రెడ్డి ఎప్పుడు సీఎం అయ్యారు? ఆయన జన్మలో సీఎం కాగలరా? దేశంలో పీఎం, సీఎం, డీఎంలకు ఇతరులతో వేరే హోదా కలిగి ఉంటారు. కిషన్‌రెడ్డి ఏ హోదాలో అనుమతి కోరితే ఆయనకు అనుమతి నిరాకరించారో నాకు తెలియదు. సీఎంగా నేను విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం వెళ్తే మార్గమధ్యంలో తిరిగి రమ్మని చెప్పడంలో మతలబు ఏమిటి? ప్రొఫెసర్లు మాయా టుడోర్, దేవ్‌జీ యూకేలో ఉన్నారు. అనుమతి ఇచ్చారుగా? ఇందిరా హయాంలో 1975–76 మధ్య ఎమర్జెన్సీ కాలంలో, ఆ తర్వాత 2014లో మోదీ పీఎం అయ్యాక దేశంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని మాయా ఓ జర్నల్‌కు వ్యాసం రాశారు. 56 ఇంచీల ఛాతీ అని చెప్పుకునే మీరు ఇతర దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంటే ఈ అభిప్రాయాన్ని ఎందుకు మార్చలేరు? మోదీ ప్రధాని అయ్యాక పాకిస్తాన్‌కు ఎవరిని అడిగి వెళ్లారు? మీరు పాక్‌ వెళ్లి వారి ప్రధానిని అలింగనం చేసుకుని బిర్యానీ తినవచ్చు. అధికార పర్యటనకు సీఎం వెళ్లలేడు? అందుకే ఆమె ప్రజాస్వామ్యం క్షీణిస్తుందని రాశారు. నేనూ ఏకీభవిస్తున్నా. ఇది నియంతృత్వ నిర్ణయం’ అని సీఎం రేవంత్‌ అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement