ఖైరతాబాద్‌ జోన్‌లోనూ గచ్చిబౌలి సంఘటనకు ఆస్కారం | Hyderabad: Single Town Planning ACP in Khairatabad Zone | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలపై నిఘా కరువు

Aug 24 2026 8:12 PM | Updated on Aug 24 2026 8:23 PM

Hyderabad: Single Town Planning ACP in Khairatabad Zone

అంజయ్యనగర్‌లో శిథిలాల‌ను తొల‌గించిన అనంత‌రం

పట్టించుకోని బల్దియా ఉన్నతాధికారులు

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో అదుపులేని ఆక్రమణలు 

సాక్షి, హైద‌రాబాద్‌: గచ్చిబౌలి పరిధి అంజయ్యనగర్‌లో 50 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో అధికారులు మాదాపూర్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారి సంతోష్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. ఏడంతస్తుల అక్రమ నిర్మాణం జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లుపోయారు. అయితే గచ్చిబౌలి ఘటనలు జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ పరిధి కిందికి వచ్చే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, బోరబండ సర్కిళ్ల పరిధిలో కూడా కోకొల్లలుగా ఉన్నాయి. గచ్చిబౌలి ఘటనలు ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలో జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

జూబ్లీహిల్స్‌ సర్కిల్‌ వెంకటేశ్వరనగర్‌ కాలనీ డివిజన్‌ పరిధిలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నం:14 వెంకటేశ్వరనగర్‌లో స్టడీ సర్కిల్‌ను ఆనుకుని గల్లీలో అక్రమ నిర్మాణం జరుగుతుందని, ప్రమాదకరంగా ఉందంటూ 8 నెలలుగా స్థానికులు జూబ్లీహిల్స్‌ సర్కిల్‌ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా బిల్డర్‌తో కుమ్మక్కైన ఇక్కడి టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది అటువైపు తొంగిచూడడం లేదు.  

శ్రీనగర్‌కాలనీలోని కమలాపురికాలనీ మార్బుల్‌ షాపు వెనుక సత్యసాయి నిగమాగమం పక్కన మూడు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇక్కడి బిల్డర్లతో కుమ్మక్కైన టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు.

 జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం: 72లోని భారతీయ విద్యాభవన్‌ స్కూల్‌ ఎదురుగా జీహెచ్‌ఎంసీ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపట్టారంటూ స్థానికులు ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తోన్నా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.

వెంకటేశ్వరకాలనీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ డివిజన్ల పరిధిలో ఏడాది కాలంగా ఎనిమిది అక్రమ నిర్మాణాలను సీజ్‌ చేశారు. ఈ నిర్మాణాలన్నీ తిరిగి తెరుచుకోవడమే కాకుండా వ్యాపార కార్యకలాపాలు కూడా సాగిస్తున్నాయి.  

ఐదు సర్కిళ్లకు ఒక్కరే.. 
జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ పరిధి కిందికి వచ్చే యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ ఐదు సర్కిళ్లకు కలిపి రమేష్‌ అనే ఒకేఒక్క టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ ఉన్నాడు. యూసుఫ్‌గూడ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీగా ఉన్న రమేశ్‌కు మిగతా నాలుగు సర్కిళ్ల అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో సర్కిల్‌కు ఒక సెక్షన్‌ అధికారిని, ఇద్దరు మున్షీలను నియమించారు. వీరంతా వసూళ్లకు తప్పితే అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం:36 ప్రధాన రోడ్డులో ఇటీవల ‘మంగళం’ పేరుతో నడిచిన భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో ఒక అంతస్తు మొత్తం అక్రమ నిర్మాణమే. హైడ్రా అధికారులు హడావుడి చేశారు. అయితే ఇంతవరకు ఈ భవనంలో ఆక్రమణలు కూల్చివేయకపోవడంతో బిల్డర్‌ మరమ్మతులు చేసి కిరాయిలకు ఇచ్చేశాడు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదీ చ‌ద‌వండి: సీ బ్లాక్ భ‌ద్ర‌మేనా?

జూబ్లీహిల్స్‌ సర్కిల్‌లోనే అధికం.. 
అక్రమ నిర్మాణాలు జూబ్లీహిల్స్‌ సర్కిల్‌ పరిధిలోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లుగా ఇటీవల ప్రజావాణిలోనూ, జీహెచ్‌ఎంసీ అధికారులకు అందిన ఫిర్యాదులు తెలియజేస్తున్నాయి. ఏడాది కాలంగా ఈ సర్కిల్‌ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఫిలింనగర్‌ డివిజన్ల పరిధిలో 100కు పైగా అక్రమ నిర్మాణాలు ఫిర్యాదులు అందాయి. కొన్ని అక్రమ నిర్మాణాలకు తూతూమంత్రంగా నోటీసులు జారీ చేశారు.
 
ఖైరతాబాద్‌ సర్కిల్‌ పరిధి కిందికి వచ్చే సోమాజిగూడ, ఖైరతాబాద్‌ డివిజన్ల పరిధిలోనూ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

యూసుఫ్‌గూడ సర్కిల్‌ పరిధిలో కూడా అక్రమ నిర్మాణాలకు అంతులేకుండాపోతుంది. 
అమీర్‌పేట సర్కిల్‌ సైతం అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది.

ఇదీ చ‌ద‌వండి: అంజయ్యనగర్‌లో రంగంలోకి దిగిన హైడ్రా

ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి.. 
ఖైరతాబాద్‌ జోనల్‌ పరిధిలోని పలు సర్కిళ్లలో అక్రమ నిర్మాణాల్లో ప్రమాదాలు, ఇతర ఘటనలు చోటుచేసుకున్నప్పుడే జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత అటువైపు తొంగిచూడడం లేదు. జూబ్లీహిల్స్‌ కాలనీలో 70కి పైగా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతుండగా సంబంధిత అధికారులను భవన నిర్మాణ యజమానులు మేనేజ్‌ చేస్తున్నారు. దీంతో నిర్మాణాలు ఎక్కడా ఆగడం లేదు.  

ఉన్నతాధికారులు లేరు.. విజిలెన్స్‌ లేదు 
ఖైరతాబాద్‌ జోనల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్న జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. విజిలెన్స్‌ నిఘా అసలే లేదు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది నిఘా కరువైంది. గతంలో ఏసీబీ దాడులు చేసి కొందరు అధికారులను అరెస్టు చేసినా పరిస్థితిలో మార్పు ఉండడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement