‘బాహుబలి’తో నిర్మాణం కూల్చివేత షురూ | Bahubali JCB tears down Anjaiah Nagar illegal structure | Sakshi
Sakshi News home page

‘బాహుబలి’తో నిర్మాణం కూల్చివేత షురూ

Aug 24 2026 7:26 AM | Updated on Aug 24 2026 7:26 AM

Bahubali JCB tears down Anjaiah Nagar illegal structure

హైదరాబాద్‌: అంజయ్యనగర్‌లో 50 చదరపు గజాల విస్తీర్ణంలో చేపట్టిన జీ ప్లస్‌ 6 అంతస్తుల నిర్మాణం కుప్పకూలడంతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు హైడ్రా చర్యలు చేపట్టింది. శనివారం అంజయ్యనగర్‌లో నాలాపై నిర్మించిన బహుళ అంతస్తుల నిర్మాణం కుప్పకూలి పక్కనున్న జయదర్శిని రెసిడెన్సీపై పడ్డ విషయం తెలిసిందే. ఘటనను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్, సీఎంసీ కమిషనర్‌ సృజన అక్రమ నిర్మాణాల తొలగింపును చేపడతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం బాహుబలి (బ్రొంటో) యంత్రంలో భవనం కూల్చివేత చేపట్టారు. 

సీఎంసీకి అందని లేఖ.. 
బిల్డర్‌ ఎం.డీ సాజిద్‌ చేపట్టిన నిర్మాణం కూలడంతో పక్కనే ఉన్న నిర్మలా రామన్‌కు చెందిన మణిదీప్‌ పీజీ హాస్టల్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రమాదం పొంచి ఉందని భావించి ఆ భవనాన్ని తొలగించాలని హైడ్రా అధికారులు భావించారు. తొలుత హైడ్రా అధికారులు తొలగించాలని నిర్ణయించినప్పటికీ ఆదివారం సీఎంసీకి టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల నుంచి ఎలాంటి లేఖ రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం తొలగిస్తున్న భవనాన్ని ఆనుకొని ఉన్న మహ్మద్‌ ఇస్మాయిల్‌ ఖురేషీ కి చెందిన అక్రమ నిర్మాణానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని హైడ్రా అధికారులు పేర్కొంటున్నారు. ఆ భవనాన్ని కూల్చివేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఇటాచీలతో జయదర్శిని రెసిడెన్సీలో ఉన్న శిథిలాలను కొద్ది మేరకు తొలగించారు. అధికారుల పేరు చెబుతూ సీఎంసీకి లేఖ ఇచ్చేందుకు జాప్యం చేస్తున్నారని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
నాలాపై సర్వే.. అక్రమ నిర్మాణాల గుర్తింపు 
కూలిన భవనంతో పాటు మరికొన్ని భవనాలు నాలాపై ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఖురేషీకి చెందిన భవనంతో పాటు మరో నాలుగైదు భవనాలు నాలాపై ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిని తొలగించాలంటే సీఎంసీ నుంచి నివేదిక ఇస్తేనే చర్యలు తీసుకునేందుకు వీలుందని హైడ్రా అధికారులు అభిప్రాయపడుతున్నారు. సీఎంసీ అధికారుల నివేధిక ఆధారంగా మరిన్ని అక్రమ నిర్మాణాలను కూలి్చవేసే అవకాశం ఉంది. రికార్డులలో ఉన్న నాలా మచ్చుకు కూడా కనిపించకపోవడం గమనార్హం.  
 
ఆరు హాస్టళ్లు ఖాళీ.. 
భవనం కూలండంతో దాదాపు ఆరు హాస్టళ్లను రాయదుర్గం పోలీసులు ఖాళీ చేయించారు. ఇప్పటికే ఐటీ ఉద్యోగులు వెళ్లిపోయారు. అంజయ్యనగర్‌లోని రెండు రోడ్లలో, జయదర్శిని సీ బ్లాక్‌ వైపు ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు.  

టీపీబీఓ సంతోష్‌పై వేటు 
అక్రమ భవనం కూలిన ఘటనలో మాదాపూర్‌ సర్కిల్‌–50 టీపీబీఓ యు.సంతోష్‌ కుమార్‌పై సీఎంసీ కమిషనర్‌ సృజన సస్పెన్షన్‌ వేటు వేశారు. జీ ప్లస్‌ 6 అంతస్తులు, పెంట్‌ హౌస్‌ నిర్మాణం చేపట్టడం, భవనం కూలిన ఘటనలో ఇద్దరు 
కారి్మకులు మృతి చెందడం, పక్కనున్న జయదర్శిని రెసిడెన్సీకి నష్టం వాటిల్లడాన్ని కమిషనర్‌ తీవ్రంగా పరిగణించారు. అనధికార నిర్మాణాన్ని నిలిపివేయడంతో టీపీబీఓ విఫలమయ్యారని, ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లిందని ఆమె పేర్కొన్నారు. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అనధికార నిర్మాణాలపై సమగ్ర తనిఖీ చేయాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆమె ఆదేశించారు.      

బిల్డర్‌ సాజిద్‌ అరెస్ట్‌ 
∙ కాంట్రాక్టర్‌ కోసం గాలింపు 
∙ మరొకరిపై కేసు నమోదు 
నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, నిబంధనలకు విరుద్ధంగా 50 చదరపు గజాల స్థలంలో జీ ప్లస్‌ 6, పెంట్‌ హౌస్‌ నిర్మాణం చేపట్టిన ఎం.డి.సాజిద్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు. భవనం కుప్పకూలడంతో ఇద్దరు వలస కూలీలు మృతి చెందడం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడం, పక్క ఇంటికి తీవ్ర నష్టం కలగడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలోనే భవన స్థలం డాక్యుమెంట్‌పై పేరున్న ఫరీన్‌ సిద్ధిఖీపై, బిల్డర్‌ ఎం.డి.సాజిద్, కాంటాక్టర్‌ ఖాజా మొయినుద్దీన్‌పై బీఎన్‌ఎస్‌ 105 (బి) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సాజిద్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న కాంట్రాక్టర్‌ ఖాజామొయినుద్దీన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

అక్రమ నిర్మాణాలపై ఆరా..  
సాజిద్‌ చేపట్టిన అక్రమ నిర్మాణాలపై సీఎంసీ అధికారులు, అటు పోలీసులు ఆరా తీస్తున్నారు. శనివారం భవనం కుప్పకూలినప్పటికీ అంజయ్యనగర్‌లో మరో వైపు ఓ భవనంపై స్లాబ్‌ వేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు. గత రెండేళ్లుగా అంజయ్యనగర్,  సిద్ధిఖీనగర్‌లో దాదాపు 8 భవనాలు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. ఓ మాజీ ప్రజా ప్రతినిధి అండతో అధికారులను మభ్యపెట్టి అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేపట్టినట్లు ఆరోపణలున్నాయి.   

పోస్టుమార్టం పూర్తి  
భవనం కుప్పకూలిన దుర్ఘటనలో టైల్స్‌ పని చేస్తున్న మధ్య ప్రదేశ్‌కు చెందిన ఉమేష్‌ ఖరే (34), మోపత్‌(42)లు శిథిలాల కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement