‘ఈగల్‌’లో ఇంటి దొంగలు! | H New arrested two TSSP constables | Sakshi
Sakshi News home page

‘ఈగల్‌’లో ఇంటి దొంగలు!

Aug 24 2026 5:36 AM | Updated on Aug 24 2026 5:36 AM

H New arrested two TSSP constables

రైలులో దొరికిన మెథ్‌ పక్కదారిలోకి.. ఇంట్లో ఉంచి విక్రయిస్తున్న ఇద్దరు

అరెస్టు చేసిన హెచ్‌–న్యూ అధికారులు.. 

వెనుక ఉన్న ఉన్నతాధికారులపై ఆరా

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ మహమ్మారిని పారద్రోలడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమైన ఈగల్‌లో ఇంటి దొంగలు ఉన్నారు. ఓ రైలులో దొరికిన మెథ్‌ను (మెథాంఫెటమైన్‌) దారి మళ్లించారు. తన ఇంట్లో ఉంచుకొని ‘నెట్‌వర్క్‌’ద్వారా విక్రయిస్తున్నారు. యాధృచ్ఛికంగా వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) ఇద్దరు టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లను అరెస్టు చేసింది.

పొరుగు రాష్ట్రం నుంచి డెడ్‌డ్రాప్‌లో...: ఇటీవల కాలంలో డ్రగ్‌ సప్లయర్స్‌ మాదక ద్రవ్యాల సరఫరా పంథాను పూర్తిగా మార్చేశారు. డెడ్‌డ్రాప్‌ విధానంలో పార్శిల్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ పెడ్లర్‌ ఇచ్చిన ఆర్డర్‌ ఆధారంగా పొరుగు రాష్ట్రానికి చెందిన సప్లయర్‌ గత నెలలో రూ.1.5 కోట్ల విలువైన మెథ్‌ను రైలులో డెడ్‌డ్రాప్‌ చేశాడు. ఈ మాదక ద్రవ్యాన్ని పార్శిల్‌ చేసి, రైలు జనరల్‌ బోగీలో నిర్దేశిత ప్రాంతంలో ఉంచాడు. ఆ వివరాలు, ఫొటోను ఇక్కడి పెడ్లర్‌కు వాట్సాప్‌ ద్వారా షేర్‌ చేశాడు. వీరి పథకం ప్రకారం... రైలు నగరానికి చేరుకున్నాక పెడ్లర్‌ వెళ్లి ఆ పార్శిల్‌ తీసుకోవాలి.

సమాచారం ఉంది.. రంగంలోకి
ఈగల్‌లో అంతర్భాగమైన రీజనల్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ సెల్‌ (ఆర్‌ఎన్‌సీసీ) సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కూ ఒకటి ఉంది. ఇందులో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు స్వామి, మరొకరు తమ రోటీన్‌ తనిఖీల్లో డెడ్‌ డ్రాప్‌ పార్శిల్‌ను ఆ రైలు జనరల్‌ బోగీలో గుర్తించారు. ఈ రూ.1.5 కోట్ల విలువైన మెథ్‌ పార్శిల్‌ స్వాధీనం చేసుకున్న ఈ ద్వయం ఈగల్‌ పోలీస్‌స్టేషన్‌కు చేర్చలేదు. సరుకును ఓ కానిస్టేబుల్‌ తన ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచాడు. చాలాకాలంగా ఈగల్‌ విభాగంలో పనిచేస్తున్న ఇతడికి నగరంలో ఉన్న డ్రగ్‌ పెడ్లర్స్, వినియోగదారుల వివరాలు తెలుసు. వాటిని వినియోగించుకొని మెథ్‌ మొత్తాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలని కుట్ర పన్నాడు. 

వినియోగదారుల్ని సంప్రదించగా, ఇది ట్రాప్‌గా భావించిన పలువురు విముఖత చూపారు. అయినా, కానిస్టేబుల్‌ స్వామి తన ప్రయత్నాలు ముమ్మురం చేసి, కొందరికి ఆ మెథ్‌ను విక్రయించాడు. ఈగల్, హెచ్‌–న్యూ విభాగాల వద్ద ఉన్న డ్రగ్‌ పెడ్లర్స్, వినియోగదారుల జాబితాలో కొందరు ఉమ్మడిగా ఉంటారు. నిత్యం ఈ వినియోగదారులపై నిఘా ఉంచుతున్న హెచ్‌–న్యూ అనుమానితులను అదుపులోకి తీసుకొని, పరీక్షలు చేయిస్తోంది. 

ఇందులో భాగంగా ఇటీవల ఓ వినియోగదారుడికి పరీక్షలు చేయించగా, మెథ్‌ వినియోగించినట్టు తేలింది. ఆ డ్రగ్‌ ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో అతడిని విచారించగా, కానిస్టేబుల్‌ స్వామి చేస్తున్న మెథ్‌ దందా వెలుగులోకి రాగా, అతడిని అరెస్టు చేసింది. తదుపరి విచారణలో మరో కానిస్టేబుల్‌ పాత్ర బయటపడటంతో ఆదివారం అతడినీ అదుపులోకి తీసుకుంది. ఈ ‘ఈగల్‌ డ్రగ్స్‌ దందా’ను నగర పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కేవలం కానిస్టేబుల్‌ స్థాయి అధికారులతో కాదని హెచ్‌–న్యూ అనుమానిస్తోంది. ఈ దందా వెనుక మరికొందరు అధికారుల పాత్రను తేల్చడానికి లోతుగా ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement