దేశంలో బెంగళూరు తర్వాత రెండో అతిపెద్ద హబ్ హైదరాబాద్
54 శాతం ఏఐ ఉద్యోగాల వృద్ధి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పోటీ పెరుగుతున్న వేళ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అమెరికా 6,900, చైనా 1600, భారత్ 710 ఏఐ స్టార్టప్‌లతో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న నేపథ్యంలో, దేశంలో బెంగళూరు తర్వాత రెండో అతిపెద్ద ఏఐ కేంద్రంగా హైదరాబాద్ ఎదుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ మద్దతు, టాలెంట్ పూల్, పెట్టుబడులతో నగరం గ్లోబల్ ఏఐ హబ్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 500కు పైగా ఏఐ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి.
2015–25 మధ్య 160 స్టార్టప్‌లు 5 శాతం సంయుక్త వార్షిక వృద్ధిరేటుతో పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 900కు పైగా ఏఐ కంపెనీలు, 2 లక్షల మంది ఏఐ ఇంజనీర్లు ఉన్నారు. టీ–డేటా ప్లాట్‌ఫామ్‌లో 2026 జూలై నాటికి 3,000 ఏఐ సంస్థలు నమోదయ్యాయి. ఉద్యోగాల వెబ్‌సైట్ నివేదిక 2025 ప్రకారం ఏఐ/ఎంఎల్ ఉద్యోగాల్లో హైదరాబాద్‌లో 54 శాతం వృద్ధి నమోదైంది. ఢిల్లీ, ముంబైతో పోలిస్తే ఇక్కడ జీవన వ్యయం తక్కువ, పాలసీలు బలంగా ఉండటంతో స్టార్టప్‌లు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని చెబుతున్నారు.
గూగుల్, టీహబ్ కలిసి ‘ఏఐ–ఫస్ట్ స్టార్టప్ యాక్సిలరేటర్’ ప్రారంభించాయి. ఏటా పదివేల మంది విద్యార్థులకు శిక్షణ, బూట్‌క్యాంప్‌లు నిర్వహిస్తారు. వచ్చే ఏడాదిలో 200 కొత్త స్టార్టప్‌లు, రూ.50 కోట్ల ఫండింగ్ వచ్చే అవకాశం ఉంది.టీ – హబ్‌లో100 ఏఐ స్టార్టప్‌లు ఏకకాలంలో ఇంక్యుబేట్ అవుతున్నాయి. తెలంగాణ ఏఐ మిషన్ (టీ–ఏఐఎం), ఏఐ సిటీ, గూగుల్ హబ్ వంటి ప్రాజెక్ట్‌లతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ భారత్‌కు ఏఐ రాజధానిగా, గ్లోబల్ టాప్ 20 డెస్టినేషన్‌గా అవతరించనుందని అంటున్నారు.


