హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి రెండు వారాల జైలు శిక్షతో పాటు రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడమే ఈ చర్యకు కారణంగా నిలిచింది.
ఓ భూ వివాదానికి సంబంధించి పిటిషనర్‌కు రక్షణ కల్పించాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఈ పోలీసు అధికారులను ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులను అధికారులు నిర్లక్ష్యం చేసినట్లు న్యాయస్థానం గుర్తించింది. ఈ వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఇద్దరు అధికారులకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. దీంతోపాటు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో వారం రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే ఈ శిక్ష అమలుపై హైకోర్టు వారం రోజుల పాటు తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. ఈ వ్యవధిలో ఉన్నత న్యాయస్థానం నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చుకునేందుకు అవకాశం కల్పించింది. వారం రోజుల్లోగా ఉన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి స్టే ఉత్తర్వులు పొందకపోతే, ఇద్దరు అధికారులు హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం విధించిన జైలు శిక్షను అనుభవించాలని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


