ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తల అధ్యయనం
లాలాపేట (హైదరాబాద్): పర్యావరణంలోని సీసం ప్రభావానికి గురికావడం వల్ల, ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధికి ప్రధాన కారణమయ్యే అమిలాయిడ్–బీటా పెప్టైడ్స్ శరీరంలో ఉన్నప్పుడు, అది నాడీ కణాల సహజ వ్యర్థాల శుద్ధి వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పర్యావరణంలోని సీసం వల్ల కలిగే నష్టం, అమిలాయిడ్–బీటా వల్ల నాడీ కణాలపై ఒత్తిడిని ఎక్కువ చేస్తుందని, దీనివల్ల నాడీ కణాలు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.
పరిశోధనలో మానవ నాడీ కణాలపై సీసం, రెండు రకాల అమిలాయిడ్–బీటా పెప్టైడ్‌ల ప్రభావాన్ని పరిశీలించారు. ఈ వివరాలు ’జర్నల్ ఆఫ్ అప్లైడ్ టాక్సికాలజీ’లో ప్రచురితమయ్యాయి. సీసం లేదా అమిలాయిడ్–బీటా పెప్టైడ్‌లు విడివిడిగా ఉన్నప్పుడు నాడీ కణాల వ్యర్థాలను శుద్ధి చేసే లైసోజోమ్ వ్యవస్థకు కొంత నష్టం వాటిల్లినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే, ఇవి రెండూ కలిసినప్పుడు మాత్రం నష్టం చాలా తీవ్రంగా ఉన్నట్లు తేలింది.
అమిలాయిడ్–బీటా సమక్షంలో సీసం ప్రభావం లైసోసోమ్‌ల లోపాలను మరింత తీవ్రతరం చేస్తుందనీ సైంటిస్తు డా.సురేష్ చల్లా తెలిపారు. కణ స్థాయి మార్పులను అర్థం చేసుకోవడానికి, పర్యావరణ కాలుష్యం నాడీ ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేయొచ్చన్నారు.
మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పర్యావరణ కాలుష్య కారకాలు, జీవసంబంధిత అంశాల మధ్య జరిగే చర్యలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డా.భారతి కులకర్ణి పేర్కొన్నారు. తద్వారా నరాల క్షీణత వ్యాధుల కారకాలను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు.


