సీపీఎస్‌ రద్దు చేయండి.. మళ్లీ సీఎంను చేస్తాం | CPS employees guarantee to CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దు చేయండి.. మళ్లీ సీఎంను చేస్తాం

Aug 24 2026 4:21 AM | Updated on Aug 24 2026 4:21 AM

CPS employees guarantee to CM Revanth Reddy

సీపీఎస్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఆదివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జనజాగరణ సభలో వర్షంలోనూ భారీగా పాల్గొన్న ఉద్యోగులు. వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ

రాష్ట్రంలోని 2.6 లక్షల సీపీఎస్‌ ఉద్యోగులు ఇస్తున్న హామీ ఇది 

పాత పెన్షన్‌ విధానమే మేలు 

నవంబర్‌ 17న సీపీఎస్‌ ఉద్యోగుల సామూహిక సెలవు 

జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు నిర్వహిస్తాం 

ఎల్బీ స్టేడియంలో జనజాగరణయాత్ర సభలో రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ

సాక్షి, హైదరాబాద్‌: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఉద్యోగుల యూనియన్‌ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ వ్యాఖ్యానించారు. ఇది తన ఒక్కడి మాట కాదని..రాష్ట్రంలోని 2.6 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగుల హామీ అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

జూలై 11న ప్రారంభమైన సీపీఎస్‌ ఉద్యోగుల జనజాగరణ యాత్ర రాష్ట్రంలోని 33 జిల్లాలో కొనసాగింది. ఆదివారం ఎల్బీస్టేడియంలో జనజాగరణ యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత కరువైందని, ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ఇప్పటికే 5 వేలకు పైగా ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందారు. కానీ ఏ ఒక్కరికీ కూడా కనీసం రూ.5వేల పెన్షన్‌ కూడా రాలేదు. ఎక్కడో యుద్ధం జరిగితే తెలంగాణలోని సీపీఎస్‌ ఉద్యోగి ప్రాన్‌ అకౌంట్‌లో సొమ్ము ఆవిరి అవుతోంది. ఈ ఏడాది మార్చి నెలలో ఉద్యోగులతోపాటు ప్రభుత్వ సొమ్ము రూ.1,800 కోట్లు అవిరైంది. పాత పెన్షన్‌ విధానంలో ఉన్న మాదిరిగా కనీస పెన్షన్‌ హామీ కూడా లేకపోవడం దురదృష్ట్టకరం’అని అన్నారు. 

మన పోరాటంతోనే డీసీఆర్జీ... 
‘టీఎస్‌సీపీఎస్‌ఈయూ 12 ఏళ్లుగా పోరాటం చేసినందుకే ఇప్పుడు సీపీఎస్‌ ఉద్యోగులకు డెత్‌ కమ్‌ రిటైర్‌మెంట్‌ గ్రాడ్యుటీ (డీసీఆర్జీ) అమలవుతోంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌లలో పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించారు. ఆయా రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ ఓపీఎస్‌ అమలు చేయాలి. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో డే అయిన నవంబర్‌ 17 నాటికి ప్రభుత్వం స్పందించి సీపీఎస్‌ రద్దుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ స్పందించకుంటే నవంబర్‌ 17న రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ సామూహిక సెలవులు పెట్టాలి. జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలతో తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలి’అని స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు.  

– సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల వృద్ధాప్య భవిష్యత్‌ షేర్‌ మార్కెట్‌ పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవితకాలం ప్రభుత్వానికి సేవ చేస్తే, చివరకు ఉద్యోగుల పెన్షన్‌ నిధులను కార్పొరేట్‌ షేర్‌ మార్కెట్‌ దయాదాక్షిణ్యాలపై వదిలేయడం న్యాయం కాదన్నారు.  

ప్రజాప్రతినిధులకు వినతులు... 
41 రోజుల పాటు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనజాగరణ యాత్ర జరగ్గా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతులు సమర్పించారు. ఆదివారం నాటి సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలివచ్చారు. సభ జరిగినంత సేపు వర్షం కురుస్తున్నా, ఉద్యోగులు సీపీఎస్‌ రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ సభను ఉత్సాహంగా సాగించారు. ఈ సమావేశంలో సంఘ కోశాధికారి నరేష్‌ గౌడ్, ఉపాధ్యక్షులు కూరకుల శ్రీనివాస్, మ్యాన పవన్, మల్లికార్జున్, పోల శ్రీనివాస్, కిరణ్‌ ,లింగమూర్తి, నరేందర్‌ రావు, శ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement