‘నిద్రపోయే ముందు పది నిమిషాల పాటు ఉప్పు కణికల మీద పాదాలను ఆనిచితే మంచి నిద్రపడుతుంది’అంటే మొదట్లో ఇన్‌స్ట్రాగామ్ వైద్య సలహాగానే కొట్టిపారేశాను. కానీ ఓ వారం పాటు ఆచరించిన తర్వాత అనేక విషయాలను సాధికారంగా చెప్పగలుగుతున్నాను– అని వెల్‌నెస్ ఎక్స్‌పర్ట్ అతుల్ రజని చెప్పారు.
ఒక వెడల్పు ట్రేలో నాలుగు గరిటెల ఎప్సమ్‌సాల్ట్ కణికలను పరిచి ఆ ఉప్పు మీద పది నిమిషాలపాటు నిలబడాలి. దేహం బరువును ఒక పాదం నుంచి మరోపాదానికి మారుస్తూ ఉండాలి. నిలబడలేక కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలను ఉప్పు మీద పెట్టి కొద్దిగా అదుముతూ చీలమండలను వలయాకారంగా తిప్పాలి. గులకరాళ్లలో నడుస్తున్న భావన కలుగుతుంది. పదునైన స్ఫటికాలు పాదాల అరికాళ్ళలోకి నొక్కుకోవడం వింతైన, ప్రశాంతమైన అనుభూతినిస్తుంది... అని తన అనుభవాన్ని వివరించారు.
స్క్రీన్ స్క్రోలింగ్ అడిక్షన్‌కు మందు!
ఈ ఎప్సమ్ సాల్ట్ థెరపీ స్మార్ట్‌ఫోన్ స్క్రోలింగ్ అడిక్షన్ నుంచి బయటపడడానికి దోహదం చేస్తోంది. ఈ చిన్న ప్రక్రియ నా దృష్టిని స్మార్ట్‌ఫోన్ నుంచి మరల్చింది. ప్రతి రోజూ పడుకునే ముందు గంటల తరబడి చేసే డిజిటల్ స్క్రోలింగ్‌కు ఇది చెక్ పెట్టింది. ఆ నిశ్శబ్దంలో నా దృష్టి పాదాల కింద ఉన్న చల్లదనం, ఒత్తిడి, శ్వాస లయపైకి మళ్ళింది. వారం గడిచేసరికి స్పష్టమైన మార్పు వచ్చింది. ఫోన్ చూడటం మానేసి, రోజువారీ ఒత్తిడి నుండి ఉపశమనం పొందే మానసిక విరామాన్ని ఆస్వాదించాను. అంతేకాకుండా, ఎప్సమ్ సాల్ట్ వల్లమడమల వద్ద ఉన్న గరుకు చర్మం మృదువుగా మారింది. మన కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌లు , నోటిఫికేషన్‌ల వల్ల మెదడు అప్రమత్తంగానే ఉంటుంది. దీనికి విరుగుడుగా సాల్ట్ థెరపీ పనిచేసింది– అని అతుల్ రజని తన అనుభవాన్ని పంచుకున్నారు.
⇒ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ తులసి రామ్ ప్రకారం, నిద్రకు ఉపక్రమించే సమయంలో చేసే తేలికపాటి సాగదీతలు (స్ట్రెచింగ్స్) రక్త ప్రసరణను మెరుగుపరిచి, నాడీ వ్యవస్థను శాంతపరుస్తాయి. ఎప్సమ్ సాల్ట్ థెరపీని నిద్రలేమికి పూర్తి స్థాయి చికిత్సగా కాకుండా, ఒక నైట్–టైమ్ వెల్నెస్ రొటీన్‌గా చూడటం మంచిది. ఆధునిక సమాజం ఈ వైద్యప్రక్రియను ఇంతవరకు జానపద చిట్కా వైద్యంగానే పరిగణించింది.
మెగ్నీషియం సల్ఫేట్ వల్ల కలిగే ప్రయోజనాల కోణంలో శాస్త్రీయ అధ్యయనాలు నిర్ధారించిన తర్వాత, ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ గుర్తించిన నేపథ్యంలో వెల్‌నెస్ కేంద్రాలు ఈ వైద్యాన్ని అందిపుచ్చుకున్నాయి. శాస్త్రీయ పరిశోధనలు మరింత విస్తృతంగా కొనసాగుతున్న కారణంగా అధికారిక ప్రకటనకు ఇంకా సమయం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.


