అరవై ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పెద్దవారిలో రక్తహీనత (అనీమియా) ఉంటే ‘డిమెన్షియా’ అనే ఒకరకం ‘మతిమరపు’ వచ్చే ముప్పు కూడా ఎక్కువేనంటూ ఇటీవలి ఓ అధ్యయనం పేర్కొంటోంది. జామా నెట్‌వర్క్ ఓపెన్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో... 60 ఏళ్లు పైబడి... అధ్యయన ప్రారంభ సమయానికి డిమెన్షియా లేని 2,282 మంది స్వీడన్ వాసులను పరిశోధకులు పరిశీలించారు.
అధ్యయనం మొదట్లో వీళ్లలో సుమారు 15 శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. 10 ఏళ్ల పాటు పరిశీలించగా వాళ్లలో మొత్తం 362 మందికి డిమెన్షియా వచ్చింది. అధ్యయనం మొదట్లో రక్తహీనత లేనివారితో పోల్చినప్పుడు... ప్రారంభంలో రక్తహీనత ఉన్నవారికి డిమెన్షియా వచ్చే అవకాశం 46 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ఈ ధోరణి మహిళలతో పోలిస్తే పురుషుల్లో స్పష్టంగా కనిపించింది. దీనికి ఒక కారణం ఏమిటంటే... రక్తహీనత వల్ల కాలక్రమంలో మెదడుకు చేరే ఆక్సిజన్ మోతాదు తగ్గిపోవచ్చు. ఇదే దీర్ఘకాలం కొనసాగితే మెదడు కణాలు, రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. దాంతో న్యూరాన్లు దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. రక్తహీనత ఉన్నవారి మెదడు స్కాన్లలో కూడా మెదడు సైజు తగ్గడం, కణజాలం దెబ్బతినడం వంటి మార్పులనూ కొన్ని అధ్యయనాలు గుర్తించాయి.
వైద్యపరంగా చూస్తే డిమెన్షియాకు రక్తహీనత వచ్చే ముప్పునకు ఒక కారణం కావచ్చని ఈ పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. అంతేకాదు, రక్తహీనతను గుర్తించి తగిన విధంగా చికిత్స చేయడం ద్వారా భవిష్యత్తులో అల్జీమర్స్ వ్యాధి నివారణకు ఇది కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
(చదవండి: కళ్లకింద క్యారీబ్యాగులు ఉండకూడదంటే..!)


