లీగలాటా
మీ సంతోషాన్ని, విషాదాన్ని, ప్రతి చిన్న విషయాన్నీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తున్నారా? ఫొటోలు పెట్టి క్యాప్షన్లు పెడుతున్నారా?... అయితే తస్మాత్ జాగ్రత్త! మీరు పెట్టేవి ఒక్కోసారి అపార్థాలకు దారితీయొచ్చు; మిమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పొచ్చు. అలాంటిదే ఓ సంఘటన తమిళనాడులో జరిగింది. ఓ వ్యక్తి ఎఫ్‌బీలో చేసిన పోస్టు పెద్ద దుమారమే రేపింది. చివరికి కుట్ర కేసు వరకు వెళ్లింది. ఆ కేసు ఏమిటో, దాని కథా కమామిషు ఏమిటో తెలుసుకుందాం..
తమిళనాడుకు చెందిన మథివనన్ ఓ రాజకీయపార్టీకి చెందిన నాయకుడు. అతడు తన కుమార్తె, అల్లుడితో కలిసి 2021 సెప్టెంబరులో సిరుమలై కొండ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లాడు. ఆ జ్ఞాపకాలను పదిలపరచుకునేందుకు ఫొటోలు తీసుకున్నాడు. వాటిలో ఓ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి, ‘షూటింగ్ ప్రాక్టీస్ కోసం సిరుమలై ప్రయాణం’ అనే అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ పెట్టాడు. ఎఫ్‌బీలో అది చూసి కొంతమంది లైక్ కొట్టారు. సన్నిహితులు కామెంట్ పెట్టారు. పోలీసులు మాత్రం కేసు పెట్టారు.
‘జిహ్వకో రుచి... పుర్రెకో బుద్ధి’ అంటారు. పోలీసుల బుర్రకు ఆ క్యాప్షన్ మరోలా తోచింది. షూటింగ్ ప్రాక్టీస్ అంటే వేరేలా అర్థం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 120(బి), సెక్షన్ 122, సెక్షన్ 505(1)(బి), సెక్షన్ 507 కింద ఎడాపెడా కేసులు నమోదు చేశారు. హడావుడిగా మథివనన్‌ను అరెస్ట్ చేసి, వాడిపట్టి కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. రిమాండ్ ఇవ్వాలని కోరారు. మేజిస్ట్రేట్ తిరస్కరించారు.
హైకోర్టులో ఆసక్తికర వాదనలు
కేసు హైకోర్టు మధురై బెంచ్‌కి చేరింది. వాడిపట్టి మేజిస్ట్రేట్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తినీ యాంత్రికంగా రిమాండ్‌కు పంపడం కుదరదని తేల్చింది. రిమాండ్ అవసరమా, లేదా? అన్నది మేజిస్ట్రేట్ పరిశీలిస్తారని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నవ్వడం కూడా పౌరుల విధుల్లో ఒకటిగా ఉండాలేమో!’ అంటూ వ్యాఖ్యానించింది. హాస్యం, ఎగతాళి రెండూ వేర్వేరు అంశాలని పేర్కొంది.
సెక్షన్ల వారీగా వివరణ
‘ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం అవడానికి కేవలం ఒక క్యాప్షన్ సరిపోదు. వ్యక్తులను సమీకరించడం, ఆయుధాలను సేకరించడం, ఇతర సన్నాహాలు’ ఉండాలి. ఆ ఫొటోల్లో ప్రకృతి, కూతురు, అల్లుడు తప్ప అలాంటి చర్యలేవీ కనపడడం లేదు. పోలీసులు ఎలాంటి ఆయుధాలనూ స్వాధీనం చేసుకున్నట్టు రిపోర్టులో రాయలేదు. కాబట్టి సెక్షన్ 122 వర్తించదని కోర్టు స్పష్టం చేసింది.
సెక్షన్ 505(1)(బి) వర్తించాలంటే, ఒక ప్రకటనతో ప్రజల్లో భయం కలగాలి; అలజడి రేగాలి. ప్రభుత్వానికి/ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రజలను ప్రేరేపించాలి. కానీ ఆ క్యాప్షన్ చూస్తే నవ్వు వస్తుంది తప్ప పైన పేర్కొన్నవేవీ కలగడం లేదు. కాబట్టి ఈ సెక్షన్ అసంబద్ధమైంది.
అజ్ఞాతంలో ఉండి బెదిరింపులకు పాల్పడే వారికి సంబంధించింది సెక్షన్ 507. అతను సామాజిక మాధ్యమంలో బహిరంగంగా క్యాప్షన్ పెట్టాడు. ఇక్కడ అజ్ఞాత కమ్యూనికేషన్ ఏం ఉంది? ఇదీ చెల్లదని పేర్కొంది. మథివనన్ ఒక్కడ్నే నిందితుడిగా చేర్చారు. కుట్ర అంటే కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక నేరం చేయడానికి కలవాలి. ఒక వ్యక్తి తనతో తానే కుట్ర చేయలేడని వ్యాఖ్యానించింది. కుట్రకు ఆధారమైన ఇతర ఆరోపణలూ నిలవలేదు. ఇక ఈ సెక్షన్ కూడా వర్తించదని స్పష్టం చేసింది.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ అసంబద్ధమైనది, న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసేదిగా ఉందని పేర్కొంటూ ఆ ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టేసింది. ఒక క్యాప్షన్ తెచ్చిన తంటా చివరికి హైకోర్టు జోక్యంతో ప్రశాంతంగా ముగిసింది. ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో!
- దిలీప్ మాదిరెడ్డి


