తిరువనంతపురం: కేరళలో ప్రస్తుతం ఓణం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తిరువోణం నాడు ఓణం విందు(ఓణసద్య) పేరుతో తొమ్మిది రకాలతో కూడిన వంటకాలను సిద్ధం చేస్తారు. వీటిని తయారు చేయడం ఎంత ముఖ్యమో, సంప్రదాయబద్ధంగా అరిటాకుపై వడ్డించే విధానం, క్రమాన్ని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని భావిస్తారు.
ప్రాచీన నియమాల ప్రకారం ఓణసద్యను వడ్డించడం ఒక విశిష్టమైన కళ. రుచులతో పాటు మర్యాద, సరైన సమయపాలన పాటించినప్పుడే విందు సంపూర్ణమవుతుంది. ఈ భోజనంలో సత్వ, రజో గుణాలను ప్రతిబింబించే వంటకాలతో పాటు తీపి పదార్థాల సమతుల్యత కూడా ఉంటుంది. అతిథులు కూర్చోవడానికి ముందే ఇంటిలోని కన్నిమూల (నైరుతి మూల)లో నిలవిళక్కు (ఇత్తడి దీపం) వెలిగించి, ధూపం వేస్తారు. కుటుంబ సభ్యులు భోజనానికి కూర్చోవడానికి ముందు మొదటి వడ్డనను అరిటాకుపై పెట్టి వినాయకుడికి, బలి చక్రవర్తికి లేదా పితృదేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు.
సద్యను ఎల్లప్పుడూ 'తూశనిల' (అరిటాకు కొన భాగం)పైనే వడ్డిస్తారు. ఆకు సన్నని కొన భాగం భోజనం చేసే వ్యక్తికి ఎడమవైపున, వెడల్పాటి భాగం కుడివైపున ఉండేలా వేయాలి.
ఎడమ వైపు: ఆకు ఎడమవైపు కింది భాగంలో కరకరలాడే కాయ ఉప్పేరి (అరటి చిప్స్), శర్కర ఉప్పేరి (బెల్లం ముక్కలు) వడ్డిస్తారు. ప్రాంతాన్ని బట్టి ఉప్పు, వేయించిన కర్రపెండలం, నువ్వుల ఉండలు లేదా బియ్యం లడ్డూలు, అప్పడాలు, అరటిపండు (దక్షిణ ప్రాంతంలో న్జాళిపూవన్ రకం) పెడతారు. ఆకు పైభాగం ఎడమ అంచున అల్లం-చింతపండు చట్నీ, ఊరగాయలు, కిచిడి, పచ్చడి, అవియల్, తోరన్, కూట్టుకరి, ఎరిస్సేరి, ఓలన్ వడ్డిస్తారు.
కుడి వైపు: ఆకు కుడివైపు చివరన కాళన్ వడ్డిస్తారు.
మధ్య భాగం: ఆకు కింది మధ్య భాగంలో అన్నం వడ్డిస్తారు. అన్నం కుడి భాగంలో నెయ్యి, వండిన పప్పు (పరిప్పు) వేస్తారు. వీటిని అప్పడంతో కలిపి మొదటి ముద్దగా తింటారు. అనంతరం సాంబారు, పులిస్సేరి వడ్డిస్తారు.
ముఖ్య వంటకాలు పూర్తయ్యాక పాయసం వడ్డిస్తారు. అడ ప్రధమన్‌తో తీపి ప్రారంభమవుతుంది (దక్షిణ కేరళలో ఇందులో అరటిపండును పిసికి తినే ఆచారం ఉంది). ఆ తర్వాత పాలడ, సేమియా పాయసం, పోళి లేదా లడ్డూలు వడ్డిస్తారు. చివరగా జీర్ణక్రియ కోసం అన్నంలో మజ్జిగ (మోరు), రసం వేసి భోజనాన్ని ముగిస్తారు.
ఇది కూడా చదవండి: వినాయక ఆగమన్‌లో విషాదం.. ఇద్దరు మృతి!


