ఆదాయపరంగా మెరుగైన స్థితిలో గిగ్ వర్కర్లు
నగరంలో కొన్ని ఉద్యోగాల కన్నా 1.8 రెట్లు అధిక ఆర్జన
వెల్లడించిన రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక
అనేక రకాల ఉత్పత్తులను మన ముంగిటకు తెస్తూ.. వ్యక్తుల్ని గమ్యాలకు చేరుస్తూ.. ఎన్నో రకాలుగా నగర జీవనంలో భాగమైన డెలివరీ బాయ్స్ సమూహం (గిగ్ వర్కర్స్) ఆదాయపరంగా చాలా మంది కంటే మెరుగైన స్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని గిగ్ ఇంటర్నెట్ వర్క్‌ఫోర్స్ ఇన్ ఇండియా’ పేరుతో రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ విడుదల చేసిన నివేదిక తాజా నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం 2030 నాటికి దేశంలో ఏర్పడాల్సిన వ్యవసాయేతర ఉద్యోగాల లోటులో దాదాపు 70 శాతం వరకు గిగ్ ఇంటర్నెట్ వర్క్ ద్వారా భర్తీ అయ్యే అవకాశం ఉంది.
గంటకు రూ.138..
ఉత్పత్తుల డెలివరీ, రైడ్‌హెయిలింగ్, హోమ్ సరీ్వసెస్ వంటి విభాగాల్లో పని చేస్తున్న గిగ్ వర్కర్లు గంటకు సగటున రూ.138 నికర ఆదాయం పొందుతున్నారని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో సమానమైన సంప్రదాయ ఫార్మల్, ఇన్‌ఫార్మల్ ఉద్యోగాల్లో గంటకు సగటు ఆదాయం సుమారు రూ.54 మాత్రమే. అంటే గిగ్ వర్కర్ల ఆదాయం దాదాపు 2.5 రెట్లు అధికం. మన నగరంలో కనీస వేతన సమానమైన గంటకు రూ.75తో పోలిస్తే గిగ్ వర్కర్లు సుమారు 1.8 రెట్లు అధికంగా సంపాదిస్తున్నారని తెలిపింది.
స్వేచ్ఛగా.. నైపుణ్యాలు మెరుగ్గా..
గిగ్ వర్క్‌లో ఆదాయంతో పాటు పని వేళల విషయంలో లభించే స్వేచ్ఛ కూడా యువతను ఆకర్షిస్తోందని నివేదిక పేర్కొంది. యాక్టివ్‌గా ఉన్న గిగ్ వర్కర్లలో 90 శాతానికి పైగా పార్ట్‌టైమ్‌గా పనిచేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రెగ్యులర్ ఉద్యోగం, చదువు, కుటుంబ బాధ్యతలు లేదా ఇతర కార్యకలాపాలకు ఆటంకం లేకుండానే అదనపు ఆదాయం పొందే అవకాశం వారికి లభిస్తోంది. వారాంతాల్లో అదనపు ఆదాయం పొందడం, చదువులు కొనసాగిస్తూనే ఫీజులు సంపాదించుకోవడం, రెండు ఉద్యోగాల మధ్య ఖాళీ సమయంలో ఆదాయం పొందడం వంటి విభిన్న అవకాశాలు ఉండడం దీనిని ఆకర్షణీయంగా మారుస్తోంది.


