ఎల్‌బీనగర్‌ ఏసీపీపై వేటు | LB Nagar ACP removed from post | Sakshi
Sakshi News home page

ఎల్‌బీనగర్‌ ఏసీపీపై వేటు

Oct 6 2026 7:14 AM | Updated on Oct 6 2026 7:14 AM

LB Nagar ACP removed from post

మేడ్చల్ జిల్లా: ఎల్‌బీనగర్‌ ఏసీపీ కృష్ణయ్యను సోమవారం పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. అవినీతి ఆరోపణలు, పలు కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆయనపై వేటు వేశారని తెలిసింది. కృష్ణయ్యపై పలు ఫిర్యాదులు అందడంతో ప్రాథమికంగా విచారణ జరిపినట్లు తెలిసింది. 2024, ఫిబ్రవరి 14న కృష్ణయ్య ఎల్‌బీనగర్‌ ఏసీపీగా బాధ్యతలు చేపట్టాడు.   

కృష్ణయ్య లీలలెన్నో... 
కృష్ణయ్య మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోని కీలక ప్రాంతంలో పలు భూ వివాదాలు సెటిల్‌ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. రాక్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన ఓ న్యాయవాదితో సొంతంగా ఓ బృందాన్నే ఏర్పాటు చేసుకుని.. కార్యాలయాన్నే అడ్డాగా చేసుకుని సెటిల్మెంట్లు చేసినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.  

గతంలో చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌లో ఓ కేసు విషయంలో ప్రత్యేకంగా తలదూర్చిన కృష్ణయ్య బాధితులు డబ్బులు ఇవ్వకపోవడంతో..వారి వద్ద క్రెడిట్‌ కార్డులు తీసుకుని..స్వైపింగ్‌ యంత్రాలను తెప్పించి మరీ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితులు ఏకంగా ఎల్‌బీనగర్‌ డీసీపీకి ఫిర్యాదు చేశారు. 

ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ రియల్‌ ఎస్టేట్‌ కేసుకు సబంధించిన ఫైల్‌ విషయంలో అప్పటి అడ్మిన్‌ ఎస్‌ఐతో గొడవపడడం చర్చనీయాంశమై ఉన్నతాధికారుల దృష్టికివెళ్లింది. 

సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలో వరకట్న వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా..ఈ కేసులో నిందితులు అరెçస్టు కాకుండా ఉండేందుకు భారీగా లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.  

కోర్టు ధిక్కరణ కేసులో ఏసీపీ కృష్ణయ్యకు గత సెపె్టంబర్‌ 20న హైకోర్టు నెల రోజుల జైలు, రూ.2వేల జరిమానా విధించగా.. శిక్షను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.  

సస్పెన్షన్‌ ఉత్తర్వులు తీసుకోకుండా.. 
వాస్తవంగా గత జూలైలో కృష్ణయ్యను అవినీతి ఆరోపణలపై ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఈమేరకు మల్కాజిగిరి కార్యాలయానికి ఆయన్ను పిలిపించగా..అనారోగ్యానికి గురై కింద పడిపోయారు. దీంతో ఆయన్ను ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి్పంచారు. ఈ క్రమంలో అధికారులు సస్పెన్షన్‌ ఉత్తర్వులను ఆస్పత్రికి పంపగా..ఆయన తీసుకోకుండా వెనక్కు పంపారు. సిక్‌లీవ్‌ పెట్టి వెళ్లిపోయారు. కొంత కాలం వనస్ధలిపురం ఏసీపీకీ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఎస్‌బీ అడ్మిన్‌ ఏసీపీగా ఉన్న రవీందర్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో కృష్ణయ్య తన పలుకుబడి ఉపయోగించి ఆదివారం మళ్లీ విధుల్లో చేరాడు. కానీ సోమవారం ఉన్నతాధికారులు సీపీ కార్యాలయానికి పిలిపించి సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఇచి్చనట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement