వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ యువతి వర్ధన్నపేటలోని చైర్మన్ ఇంటి ఎదుట సోమవారం కుటుంబీకులు, దళిత సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాంత్ మూడేళ్ల క్రితం దసరా వేడుకల్లో కలిసి తనను ప్రేమిస్తున్నాని చెప్పాడని పేర్కొంది. దీంతో అతడిని నమ్మి సన్నిహితంగా మెలిగానని చెప్పింది. వేములవాడ ఆలయానికి తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని తెలిపింది.
అనంతరం తన కుటుంబీకులకు పరిచయం చేశాడని వివరించింది. ఈక్రమంలో మూడేళ్ల పాటు శ్రీకాంత్‌తో సన్నిహితంగా ఉండగా మూడు సార్లు గర్భం దాల్చానని పేర్కొంది. అయితే అతడి సూచనల మేరకే తొలగించుకున్నానని తెలిపింది. ఈ క్రమంలో శ్రీకాంత్ ఒక్కసారిగా తనను దూరం పెట్టడంతో మోసపోయినట్లు అర్ధం చేసుకున్నానని కన్నీరుమున్నీరైంది. తాను శ్రీకాంత్ నాన్న సారంగపాణిని కలిస్తే ఆయన నమ్మలేదని, దీంతో తన వద్ద ఉన్న ఆధారాలు చూపానని తెలిపింది. ఫలితంగా కొంత సమయం అడిగాడని, తర్వాత ఆయన కూడా ఏమి చెప్పకపోవడంతో ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజును కలిశానని పేర్కొంది.
ఈ సమయంలో పెళ్లి చేసుకుంటానని శ్రీకాంత్ తెలుపగా తండ్రి సారంగపాణి కూడా ఒప్పుకున్నాడని తెలిపింది. తీరా మెఖం చాటేయడంతో ప్రస్తుతం ఆందోళన చేస్తున్నానని వివరించింది. ఆందోళనపై సమాచారం అందుకున్న ఎస్సై రాజు, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సదరు యువతిని సముదాయించి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని తెలిపారు. అయితే తనకు వారిపై కేసు పెట్టే ఉద్దేశం లేదని చెప్పింది. తనకు న్యాయం జరిగే వరకూ ఇంటి ఎదుట ఉంటానని భీష్మించుకుంది. కాగా, సదరు యువతికి న్యాయం చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. యువతి వాంగ్మూలం, సాక్షులను పరిగణనలోకి తీసుకుని శ్రీకాంత్‌తో చట్ట ప్రకారం పెళ్లి జరిపించాలన్నారు.
వంటావార్పుతో నిరసన..
ఇంటి ఎదుట బైఠాయించిన యువతికి మద్దతుగా నిలిచిన దళిత సంఘాల నాయకులు రాత్రి సమయంలో చైర్మన్ ఇంటి ఎదుట వంటావార్పుతో నిరసన తెలిపారు. శ్రీకాంత్‌తో పెళ్లి జరపాలని, అంత వరకు ఇంటి ఎదుట నుంచి కదిలేది లేదని బాధిత యువతి స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.


