సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి కౌంటరిచ్చారు. కొడంగల్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను ఎన్నోసార్లు వ్యక్తిగతంగా కలిసి చెప్పానని వెల్లడించారు. అహంకారాన్ని పక్కనపెట్టి నిజాయితీతో పాలన సాగించాలని సీఎంకు హితవు పలికారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నారా? అని రేవంత్‌రెడ్డిని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. గుండెపై చేయి వేసుకుని సమాధానం చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రి తన పాలనపై తానే ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. గత మూడేళ్లుగా రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం స్థానంలో కూర్చుని దొంగలకు, పెట్టుబడిదారులకు దోచిపెట్టకూడదని ఘాటుగా విమర్శించారు. అలాగే, తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నిధులు అడుగుతున్నానని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్‌కు నిధులు కేటాయించడంపై తనకు అభ్యంతరం లేదని, అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల అభివృద్ధిని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని గతంలోనూ ఆయన డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా సీఎంను కలిసి విజ్ఞప్తులు చేసినా స్పందన లేకపోవడంతోనే బహిరంగంగా మాట్లాడాల్సి వస్తోందన్నది ఆయన వాదన.
కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య కొంతకాలంగా నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కేటాయింపు అంశంపై విభేదాలు కొనసాగుతున్నాయి. కొడంగల్, మధిర, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, వెనుకబడిన ప్రాంతాలకు కూడా సమానంగా నిధులు కేటాయించాలని రాజగోపాల్‌రెడ్డి గతంలో విమర్శించారు. మునుగోడులో అభివృద్ధి పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయని ఆరోపించారు.
రేవంత్ తీవ్ర విమర్శలు..
ఇదిలా ఉండగా.. అంతకుముందు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న కొందరు నేతలను ఉద్దేశించి పరోక్షంగా స్పందించారు. కొంతమంది మైకుల ముందు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా కలిసినప్పుడు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రశంసిస్తున్నారు. చెడు విషయాలను ఎవరి చెవిలోనైనా చెప్పాలి.. మంచి విషయాలను మైకులో చెప్పాలి. కానీ కొందరు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మనవాళ్లలో కొందరికి పిచ్చికుక్కలు కరిచినట్టుంది. ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తూ.. వ్యక్తిగతంగా మాత్రం మంచిపనులను మెచ్చుకుంటున్నారు. అలాంటి వారిని కాంగ్రెస్ కార్యకర్తలే ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్తారు అంటూ విమర్శలు చేశారు.
ఇదీ చదవండి: తగ్గేదే లేదు.. బదిలీలు కొత్తకాదు


