నాసిరకం డీపీఆర్‌ల వల్లే రోడ్డు ప్రమాదాలు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
రోడ్డు ప్రమాద మృతుల్లో 66 శాతం యువతే
రోడ్డు భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేదు
రోడ్డు అనుసంధానంలో మన దేశమే నంబర్ వన్
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్లు పనులు జరగాలి
తెలంగాణ రోడ్డు ప్రాజెక్టులకు సహకరిస్తా
ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సులో ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా సుమారు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. 1.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల్లో 66 శాతం మంది 18–34 ఏళ్ల వయసువారే ఉంటుండటం మరింత ఆవేదన కలిగిస్తోందన్నారు. నాసిరకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు రూపొందించడం వల్లనే ఇలాంటి దారుణ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు.
ఇలాంటి ప్రణాళికలతోనే ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్‌స్పాట్‌లు) ఏర్పడుతున్నాయని చెప్పారు. రోడ్డు నిర్మాణానికి ముందు శాస్త్రీయంగా ప్రణాళికలు రూపొందించి, డీపీఆర్‌లను లోపరహితంగా తయారు చేస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణంలో ఇంజనీర్లు, కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు నాణ్యత, భద్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
ఇక నుంచి రోడ్ల నిర్మాణంలో లోపాలకు కారణమయ్యే కాంట్రాక్టు సంస్థలు, అధికారులను విడిచిపెట్టబోనని హెచ్చరించారు. గురువారం హైటెక్స్‌లో ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 85వ వార్షిక సదస్సును సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రోడ్డు ప్రాజెక్టులపై దృష్టి సారించి, తెలంగాణకు లబ్ధి కలిగేందుకు వీలుగా గణనీయ స్థాయిలో వాటి మంజూరుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
డీపీఆర్ దశలోనే లోపాలను గుర్తించి సరిదిద్దాలి..
భారీ రోడ్డు ప్రాజెక్టుల డీపీఆర్‌ల తయారీ బాధ్యతలను తక్కువ మొత్తం కోట్ చేసిన సంస్థలకు అప్పగించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. కీలకమైన శస్త్రచికిత్స కోసం వైద్యుడిని ఎంపిక చేసుకునేటప్పుడు కేవలం ఫీజు తక్కువగా ఉందని నిర్ణయం తీసుకోలేమని, రోడ్ల ప్రాజెక్టుల కన్సల్టెంట్ల ఎంపికలోనూ అదే సూత్రాన్ని అనుసరించాలని సూచించారు.
రోడ్డు ప్రణాళికల రూపకల్పనలో కూడళ్ల వద్ద తగిన ఏర్పాట్లు లేకపోవడం, అవసరమైన చోట ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించకపోవడం, మలుపులు, జంక్షన్లను శాస్త్రీయంగా రూపొందించకపోవడం వంటి లోపాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని వివరించారు. నిర్మాణం పూర్తయ్యాక ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో సవరణలు చేపట్టడం కంటే.. డీపీఆర్ దశలోనే లోపాలను గుర్తించి సరిదిద్దడం అత్యంత కీలకమన్నారు.
ప్రస్తుతం రోడ్డు అనుసంధానంలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిందని, దీనితో సంతృప్తి చెందకుండా అంతర్జాతీయంగా రోడ్ల నిర్మాణ విధానాల్లో వస్తున్న ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఇంజనీర్లు, పరిశోధకులకు సూచించారు. మౌలిక వసతులపై పెట్టే ప్రతి రూ.100 పెట్టుబడికి జీడీపీ రూపంలో రూ.350 మేర ఆర్థిక ప్రయోజనం లభిస్తుందన్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, వాణిజ్యం, పర్యాటక రంగాల అభివృద్ధికి మెరుగైన రహదారులు వెన్నెముకగా నిలుస్తాయని పేర్కొన్నారు.
వ్యర్థాలతో రోడ్లు.. రైతులకు ఆదాయం
రోడ్ల నిర్మాణంలో సంప్రదాయ బిటుమెన్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ సామగ్రిని విçస్తృతంగా వినియోగించాలని గడ్కరీ సూచించారు. వరి గడ్డి వంటి వ్యవసాయ వ్యర్థాలతో బయోబిటుమెన్ తయారీ, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఫ్లైయా‹Ù, పారిశ్రామిక స్లాగ్, మున్సిపల్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో వినియోగించే అవకాశాలను ప్రస్తావించారు.
వ్యర్థాలను వనరులుగా మార్చడం ద్వారా రూ.5 లక్షల కోట్ల స్థాయిలో వ్యర్థ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడంతోపాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రపంచస్థాయి రహదారి మౌలిక వసతులు అవసరమని పేర్కొన్నారు.
ప్రమాదంతో రెండేళ్లు ఇంటికే పరిమితమయ్యా...
మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జరిగిన ప్రమాదంలో తన కాలికి నాలుగు చోట్ల ఎముకలు విరిగాయని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. అప్పుడు రెండేళ్లపాటు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చిందని తెలిపారు. ప్రమాదం వల్ల కలిగే శారీరక బాధ, కుటుంబంపై పడే ప్రభావం తనకు తెలుసన్నారు. అందువల్ల రోడ్డు భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు.
400 ఎగ్జిబిషన్లు.. 19 టెక్నికల్ సెషన్లు
రాజధాని నగరంలోని హైటెక్స్‌లో ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 86వ వార్షిక సదస్సు గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. సదస్సుకు ప్రముఖ ఇంజనీర్లు, కంపెనీల ప్రతినిధులు, పరిశోధకులు, రహదారుల మౌలిక సదుపాయాల రంగ నిపుణులు, అధికారులు సుమారు 3 వేల మంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా వివిధ కంపెనీలు రోడ్డు అనుబంధ రంగాలకు సంబంధించి సుమారు 400 ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాయి. బేరింగ్‌లు, స్టీల్, సిమెంట్ మొదలుకొని.. పెద్ద పెద్ద బ్రిడ్జీల నిర్మాణం కోసం ఉపయోగించే ఉపకరణాల ప్రదర్శన ఆకట్టుకుంది. శుక్రవారం నుంచి ఈ నెల 22 వరకు 19 సాంకేతిక అంశాలపై సెషన్లు జరగనున్నాయి. ఇందులో పరిశోధనలు, అనుభవాలు, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడంతోపాటు సాంకేతిక అభివృద్ధి, నిర్మాణ పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలు, రహదారి భద్రత, సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధిలాంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, డీకే అరుణ, ఎమ్మెల్యే గాంధీ


