బీఆర్‌ఎస్‌కు గతమే.. భవిష్యత్తు లేదు | Telangana CM Revanth Reddy launches Indiramma Family Insurance scheme | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు గతమే.. భవిష్యత్తు లేదు

Nov 20 2026 5:25 AM | Updated on Nov 20 2026 5:25 AM

Telangana CM Revanth Reddy launches Indiramma Family Insurance scheme

2029లోనూ రెండోసారి ఇందిరమ్మ రాజ్యం తెస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్‌ ఇచ్చిన పథకాలేవీ రద్దు చేయకుండా కొత్త పథకాలు అమలు చేస్తున్నాం 

సాగర్‌ నుంచి ఏపీకి నీళ్లు వదులుతున్నామంటూ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం చేస్తోంది 

మన హక్కుల కోసమే చంద్రబాబుతో సంబంధాలు తెంచుకొని వచ్చా.. 

నమ్మిన వారిని మోసం చేసే గుణం కేసీఆర్‌ రక్తంలోనే ఉంది 

బీజేపీతో హరీశ్‌ మంతనాలుఅబద్ధమైతే ఎల్లమ్మపై ప్రమాణం చేయాలి 

ప్రభుత్వంపై, తనపై విమర్శలు చేస్తున్న సొంత పార్టీ నేతలకూ వార్నింగ్‌ 

సిద్దిపేటలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి శ్రీకారం 

సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేది ప్రజాప్రభుత్వమేనని.. బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్‌ లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 2034 వరకు ఇందిరమ్మ రాజ్యమే కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. గురువారం సిద్దిపేటలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంబోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సహా కేటీఆర్, హరీశ్‌రావుపై పదునైన విమర్శలు చేస్తూనే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులు, యువత సహా వివిధ వర్గాల ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, అందుకోసం చేస్తున్న ఖర్చును గణాంకాలతో సహా వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1994 నుంచి 2004 వరకు టీడీపీ.. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉందని.. 2023 నుంచి 2034 వరకు ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుందని సీఎం చెప్పారు.

నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలు ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్‌ ప్రారంభించిన పథకాలేవీ రద్దు చేయకుండా కొత్త పథకాలను అమలు చేస్తున్నాని స్పష్టం చేశారు. సుమారు గంటా 10 నిమిషాలు ప్రసంగించిన సీఎం.. తెలంగాణ ప్రజలను బానిసల్లా చూసిన గత పాలకుల పాలన కావాలో.. ఇందిరమ్మ రాజ్యంలో అందిస్తున్న ప్రజాపాలన కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఈ అంశంపై బజార్లలో చర్చలు పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. 

నేను తెలంగాణ బిడ్డను.. 
నాగార్జున సాగర్‌ నుంచి ఏపీకి నీళ్లు వదులుతున్నారంటూ తమ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను తెలంగాణ బిడ్డను. రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఏపీకి నీళ్లు వదులుతానా? తెలంగాణ హక్కుల కోసమే చంద్రబాబుతో సంబంధాలు తెంచుకొని వచ్చా. నన్ను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణకు నేనెలా అన్యాయం చేస్తా? అలాంటి ఆలోచన వస్తే నేను తెలంగాణ బిడ్డను అవుతానా?’అని రేవంత్‌ అన్నారు.

కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ 2015లో కేసీఆర్, హరీశ్‌రావు సంతకాలు పెట్టారని.. దక్షిణ తెలంగాణ రైతుల జీవితాలపై మామ, అలుళ్లు మరణశాసనం రాశారని సీఎం దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు పెట్టిన సంతకాల కాపీలు, ఫైల్స్‌ అన్నీ ఉన్నాయని.. దీనిపై అసెంబ్లీకి వస్తే చర్చిద్దామన్నారు. 

కాంగ్రెస్, టీడీపీకి కేసీఆర్‌ వెన్నుపోటు 
రాజకీయ భిక్ష పెట్టిన మదన్‌ మోహన్‌పైనే 1983 ఎన్నికల్లో కేసీఆర్‌ పోటీ చేసి ఓడిపోయారని సీఎం రేవంత్‌ చెప్పారు. ఎమ్మెల్యేను చేసిన ఎన్టీఆర్, మంత్రిని చేసిన చంద్రబాబును వెన్నుపోటు పొడిచి కొత్త దుకాణం పెట్టారని విమర్శించారు. నమ్మిన వారిని మోసం చేసే గుణం కేసీఆర్‌ రక్తంలోనే ఉందని దుయ్యబట్టారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కకు పెట్టి.. పార్టీ మారిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ కుటుంబం మాత్రం భారీగా అక్రమాస్తులు సంపాదించిందని.. కొడుకు, బిడ్డ, అల్లుడికి పదవులు కట్టబెట్టిందని దుయ్యబట్టారు. కేసీఆర్, హరీశ్‌రావుకు అండగా నిలిచిన సొలిపేట రామలింగారెడ్డి కుటుంబంతోపాటు తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి కుటుంబం, సిరిసిల్లలో పాపారావు, మహేందర్‌రెడ్డి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో చూడాలన్నారు.

తెలంగాణ కోసం శ్రీకాంతాచారి ప్రాణ త్యాగం చేస్తే కేసీఆర్‌ పట్టించుకోలేదని, కానీ తాము అధికారంలోకి రాగానే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను మహిళా కమిషన్‌ సభ్యురాలిని చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. సిద్దిపేట మెడికల్‌ కళాశాలకు మదన్‌ మోహన్‌ పేరు పెట్టాలనిమంత్రి దామోదర రాజనర్సింహను ఆదేశించారు. 

బీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు.. 
‘ప్రజాపాలన పోవాలి.. పాపాల బైరవుడు కేసీఆర్‌ మళ్లీ రావాలి’అని బీఆర్‌ఎస్‌ వాళ్లు అంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘2023లో చెప్పినట్లే తెలంగాణలో కాంగ్రెస్‌ జెండా ఎగరేశాం.. 2029లోనూ రాష్ట్రంలో రెండోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తాం’అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

కేటీఆర్, హరీశ్‌రావు అబద్ధాలు చెబుతూ ఊరూవాడ తిరుగుతుంటే.. మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారని సీఎం ఆరోపించారు. ప్రజలు ఈ విషయాలను గమనించాలని సూచించారు. బీజేపీతో హరీశ్‌రావు రహస్య మంతనాలు చేస్తున్నా రని రేవంత్‌ ఆరోపించారు. ఆ విషయం అబద్ధమైతే సిద్దిపేట ఎల్లమ్మ దేవతపై ఓట్టేసి చెప్పాలన్నారు. 

మూడేళ్లుగా అసెంబ్లీకి రాకుండానే కేసీఆర్‌ జీతం 
మూడేళ్లుగా అసెంబ్లీకి రాకుండా కేసీఆర్‌ రూ. కోటిన్నర జీతం తీసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీకి వస్తే నీళ్లు, భూములు, లిక్కర్‌ దోపిడీని బయటపెడతానని సవాల్‌ విసిరారు. సిరిసిల్ల, నేరెళ్ల ఇసుక దోపిడీకి కేటీఆర్, సంతోశ్‌రావు పాల్పడ్డారని ఆరోపించారు. కానీ తాను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నానని రేవంత్‌రెడ్డి అన్నారు.  

సొంత పార్టీ నేతలపై మాస్‌ వార్నింగ్‌ 
‘పారీ్టలో కొంత మంది నేతలకు ఏమైందో అర్థం కావట్లేదు. పిచ్చి కుక్క కరిచిందో ఏమో.. పారీ్టలోని చెడంతా మైకుల ముందు చెబుతున్నారు. మంచి విషయాలను చెవిలో చెబుతున్నారు. ఇలాగే వ్యవహరించే నేతలను కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపిస్తారు’అని సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా ఎమ్మెల్యేలు అనురుధ్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిని హెచ్చరించారు. 

సభాస్థలి వరకు 2 కి.మీ. పాదయాత్ర 
సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేటలో తొలుత ఇందిరమ్మ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి సభాస్థలి వరకు 2.1 కి.మీ. మేర ర్యాలీగా నడుచుకుంటూ, ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. సభలో మంత్రులు పొంగులేటి, దామోదర, సీతక్క, పొన్నం, వాకిటి శ్రీహరి, వివేక్, కృష్ణారావు, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

కోటలకు నూకలు చెల్లాయి: మహేశ్‌గౌడ్‌
కాళేశ్వరం పేరుతో కేసీఆర్, హరీశ్‌రావు రూ. వేల కోట్లు కొల్లగొట్టారని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ ఆరోపించారు. సిద్దిపేటలో మార్పు మొదలైందని.. కోటలకు నూకలు చెల్లా యని.. కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో మొదలైన కాంగ్రెస్‌ జైత్ర యాత్ర.. సిద్దిపేటకు చేరిందన్నారు. ‘లేఖలు రాసే గ్రీకు వీరుడు కావాలా? అభివృద్ధి చేసే నాయకుడు కావాలా సిద్దిపేట ప్రజలు తేల్చుకోవాలి. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల కన్నీళ్లకు ఎవరు సమాధానం చెబుతారు? రంగనాయక సాగర్‌ భూములపై ప్రజలకు ఎన్నో ప్రశ్నలు న్నాయి. భూములపై సమాధానం చెప్పాకే హరీశ్‌రావు ఓట్లు అడగాలి’ అని మహేశ్‌గౌడ్‌ సవాల్‌ విసిరారు.  

అసమ్మతి నేతలపై సీఎం, పీసీసీ చీఫ్‌ ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వాన్ని, తన నాయకత్వాన్ని సొంత పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరు«ద్‌రెడ్డి లక్ష్యంగా చేసుకొని బహిరంగ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సిద్దిపేట బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఘాటైన కౌంటర్‌ ఇచ్చారు. ‘పిచ్చి కుక్క కరిచిన ఎర్రోళ్లను కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఎర్రగడ్డకు తీసుకుపోతారనుకో’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ పనితీరుపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని.. కొడంగల్, మధిర, హుజూర్‌నగర్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీఎం పదవిలో మరో రెండేళ్లే ఉంటారంటూ వ్యాఖ్యానించడంతో వివాదం మరింత ముదిరింది.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సైతం నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు, అధికారుల అవినీతిపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట సభలో సీఎం చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ అసమ్మతి నేతలకు ఇచ్చిన హెచ్చరికగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

అధిష్టానానికి నివేదిక 
మరోవైపు ఎమ్మెల్యేల బహిరంగ విమర్శలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందిస్తూ.. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమేనని స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి, అనిరు«ద్‌రెడ్డి వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని.. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కొత్త పార్టీ ఇన్‌చార్జి వచ్చాక ఈ అంశాలపై సమీక్ష ఉంటుందని చెప్పారు. పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement