డిజిటల్‌ ‘తెర’ దించి.. పుస్తకం తెరిచి.. | Digital Education Back To Books Schools | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ ‘తెర’ దించి.. పుస్తకం తెరిచి..

Nov 20 2026 5:22 AM | Updated on Nov 20 2026 5:22 AM

Digital Education Back To Books Schools

పాత పద్ధతుల వైపు అభివృద్ధి చెందిన దేశాల అడుగులు

పుస్తకాలను విద్యార్థులకు నేస్తాలుగా పరిచయం చేస్తున్న వైనం

స్క్రీన్‌ అతి వినియోగంతో పిల్లల్లో తగ్గుతున్న ఏకాగ్రత, నిద్ర

సాక్షి, హైదరాబాద్‌: డిజిటల్‌ విద్య పేరుతో తరగతి గదుల్లోకి, చిన్నారుల చేతుల్లోకి వచ్చిన ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు విద్యార్థుల ఆలోచనా శక్తికే సవాలుగా మారుతున్నాయి. అందరికంటే ముందుగా డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ను విస్తరించిన అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడే అంతే వేగంగా పాత పద్ధతుల వైపు పయనిస్తున్నాయి. పేపర్‌ పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నుతో రాసే విధానానికి మొగ్గు చూపుతున్నాయి. దీంతో కరోనా తర్వాత డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యమిస్తున్న భారత్‌ వంటి దేశాలు కూడా మళ్లీ పునరాలోచన చేయాల్సిన అవసరం వచ్చింది.

మార్పులు చేస్తున్న దేశాలివే..

  • స్వీడన్‌: డిజిటల్‌ విద్యను అత్యంత వేగంగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు అదే వేగంతో వెనక్కి తగ్గుతోంది. ‘స్క్రీన్‌ నుంచి పుస్తకం వైపు’అనే నినాదంతో పాఠశాలల్లో ట్యాబ్లెట్‌ పీసీల స్థానంలో మళ్లీ పాఠ్యపుస్తకాలను తీసుకురావడానికి ప్రభుత్వం దాదాపు 200 మిలియన్‌ డాలర్ల నిధులను కేటాయించింది. ప్రీ–సూ్కల్స్‌లో డిజిటల్‌ పరికరాలను పూర్తిగా నిలిపివేసింది.

  • ఫిన్లాండ్‌: ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ కలిగిన దేశం. తరగతి గదుల్లో ఫోన్ల వాడకాన్ని కట్టడి చేస్తూ మళ్లీ పుస్తకాలు, నోట్‌బుక్స్, చేతిరాతకు ప్రాధాన్యమిస్తోంది.

  • నెదర్లాండ్స్, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ: ఈ దేశాలన్నీ పాఠశాలల్లో డిజిటల్‌ పరికరాల వాడకంపై ఆంక్షలు విధించాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడానికి పుస్తకాలను ప్రోత్సహిస్తున్నాయి.

  • ఆ్రస్టేలియా: న్యూ సౌత్‌ వేల్స్‌ రాష్ట్రం 2027 నుంచి పాఠశాలల్లో స్క్రీన్‌ సమయాన్ని తగ్గించి, చేతిరాత, పుస్తక పఠనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియాను నిషేధించిన తొలి దేశంగా నిలిచింది. 
     

పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

  • అవగాహన శక్తి: డిజిటల్‌ తెరలపై చదివిన విద్యార్థుల కంటే కాగితంపై (పుస్తకాల్లో) చదివిన విద్యార్థులు విషయాన్ని లోతుగా అర్థం చేసుకుని, పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించారు.

  • మెదడు పనితీరు: డిజిటల్‌ పరికరాలు తరగతి గదుల్లో విద్యార్థుల ఏకాగ్రతకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. పుస్తకాలు చదివే పిల్లల మెదడులో భాష, ఆలోచనా సామర్థ్యానికి సంబంధించిన నాడీ కణాలు బలంగా ఉంటాయి.

  • చేతిరాత, జ్ఞాపకశక్తి: కీబోర్డుపై టైప్‌ చేయడం కంటే కాగితంపై పెన్నుతో రాయడం వల్ల మెదడు ఎక్కువగా చురుగ్గా పనిచేస్తుంది. విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి.

  • నిద్ర: డిజిటల్‌ స్క్రీన్‌కు అలవాటు పడటం వల్ల నిద్రలేమి, కంటి చూపు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పుస్తక పఠనం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

  • తల్లిదండ్రులు–పిల్లల అనుబంధం: తల్లిదండ్రులు పిల్లలతో కలిసి పుస్తకాలు చదివినప్పుడు వారి మధ్య సంభాషణ, అనుబంధం పెరుగుతాయి.

భారత్‌లో ఈ విధానం అమలైతే.. 
కరోనా మహమ్మారి తర్వాత భారత్‌లో ఆన్‌లైన్‌ క్లాసులు, స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. పుస్తక ఆధారిత విద్యకు తిరిగి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పేద, ధనిక తేడా లేకుండా అందరికీ సమానమైన, నాణ్యమైన విద్య అందుతుంది. పాఠశాలల్లో నో–ఫోన్‌ పాలసీ, గ్రంథాలయాల వినియోగం పెంచితే విద్యార్థుల్లో లోతుగా ఆలోచించే శక్తి, సృజనాత్మకత పెరుగుతాయి. చిన్న వయసులోనే కళ్లద్దాలు రావడం, ఊబకాయం, ఒత్తిడి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

రెండు అవసరమే.. 
నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఏఐ వంటి నైపుణ్యాలు కూడా విద్యార్థులకు అవసరమే. అందువల్ల సాంకేతికతను పూర్తిగా పక్కన పెట్టడం కూడా సరికాదు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విద్యను సమపాళ్లలో అనుసరించడం వల్ల మేలు కలుగుతుంది.

ఇదీ చదవండి: వేతనం కంటే వెసులుబాటుకే ఓటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement