సాక్షి,సిద్ధిపేట్: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. సిద్ధిపేట బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. చెడు చెవిలో చెప్పాలి.. మంచి మైక్‌లో చెప్పాలి.మా వాళ్లకి కొంతమందికి పిచ్చికుక్క కరిచినట్లుంది. ఏదేదో మాట్లాడుతున్నారు. చెడు మైక్‌లో చెబుతున్నారు. మంచి నా ఇంటికొచ్చి చెవిలో చెబుతున్నారని దుయ్యబట్టారు.
‘నన్ను పండబెట్టి తొక్కుతా’
బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో కొడంగల్, మధిర, హుజూర్నగర్ నియోజకవర్గాలు మాత్రమే లేవని, వాటితో పాటు మరో 116 నియోజకవర్గాలు ఉన్నాయని, వాటన్నింటికీ అవసరమైన నిధులు సమానంగా సీఎం రేవంత్‌రెడ్డి పెద్దన్న పాత్ర పోషించి మంజూరు చేయాలని కోరారు. ఒకేసారి కొడంగల్‌కు రూ.1,000 కోట్లు ఎలా మంజూరు చేస్తావని ప్రశ్నిస్తే.. ‘నన్ను పండబెట్టి తొక్కుతా’ అంటాడా?, సీఎం పదవిలో ఉన్న ఆయన ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.
నా నియోజకవర్గానికి, పేద ప్రజలకు అన్యాయం జరిగేతే నేను చూస్తూ ఊరుకోలేనని, అవసరమైతే మునుగోడులో మరో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభిస్తానని హెచ్చరించారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడులో ఎమ్మెల్సీ సత్యంతో కలిసి పింఛన్ల మంజూరు పత్రాలను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. గత బీఆర్ఎస్ ఏ తప్పులైతే చేసిందో అవే తప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని, దీంతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌పై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ రెండేళ్ల కాలంలోనైనా ప్రజలు మెచ్చే పాలన కొనసాగిస్తే అధికారం లోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
వైఎస్ పాలన కొనసాగించాలి
నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకించేది కేవలం పేదలకు మేలు జరగడం లేదని తప్ప మంత్రి పదవి రావాలని కాదు. నాకు కావాల్సింది కేవలం మునుగోడు అభివృద్ధి, పేదరిక నిర్మూలనే. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ. దివంగత వైఎస్సార్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశారు. అలాంటి పాలన నేటి పాలకులు కొనసాగించాలి. మునుగోడుకు నిధులు ఇవ్వకపోయినా.. రాష్ట్ర బడ్జెట్ వృథా చేసి దోచుకున్నా అస్సలు ఊరుకునే ప్రసక్తిలేదు. రాజగోపాల్ రెడ్డి సైన్యం రాష్ట్రం మొత్తం తిరిగి నిలదీస్తుంది..' అని రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు.
హైదరబాద్ ఉన్న సిటీకి దిక్కులేకుండా ఉందని, ఈ సమయంలో ప్యూచర్ సిటీ దేనికని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు పునరాలోచన చేసుకుని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా చూసుకోవాలని హితవు పలికారు. ఒకవేళ తాను తప్పుగా మాట్లాడితే క్షమించాలని, అయ్యప్ప ఆశీస్సులతో రేవంత్‌రెడ్డి మరో రెండేళ్లు సీఎంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలో రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.


