సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యల వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్ వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం గమనిస్తోందని, ఈ అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. క్రమశిక్షణ విషయంలో అందరికీ ఒకే విధమైన నిబంధనలు ఉంటాయని స్పష్టం చేశారు. తమది ప్రజాస్వామ్య పార్టీ అని, ఏ విషయానికైనా సమయం రావాలని వ్యాఖ్యానించారు.
అలాగే, గతంలో కొండా సురేఖ విషయంలో చర్యలు తీసుకునే ముందు పలుమార్లు అవకాశం ఇచ్చామని గుర్తుచేశారు. కొత్త పార్టీ ఇన్‌ఛార్జి సందీప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని అంశాలను పరిశీలిస్తారని, పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై హైకమాండ్ దృష్టి సారించిందని వెల్లడించారు.
కేటీఆర్‌కు కౌంటర్..
ఇదే సమయంలో నాగార్జునసాగర్ జలవివాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపైనా మహేశ్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. సాగర్ డ్యామ్‌పై అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున పోలీసు బలగాలను ఎందుకు మోహరించారని కేటీఆర్‌ను ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందని ఆరోపించారు. నాడు కేసీఆర్ 36 శాతం నీటి వాటాకు అంగీకరించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 70 శాతం వాటా కోసం పోరాడుతోందని చెప్పారు. తెలంగాణ నీటి వాటా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు అభ్యంతరం లేదని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే చెప్పిందని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి లేఖలు రాశామని, తెలంగాణ అభ్యంతరాల కారణంగానే ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిలిచిపోయాయని తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని వెల్లడించారు.
డ్యామ్‌పై కేంద్ర బలగాలు, కేఆర్‌ఎంబీ నియంత్రణ కేంద్రం చేతుల్లో ఉన్నప్పటికీ బీజేపీని ప్రశ్నించకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే బద్నాం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను పక్కనపెట్టారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాలేకపోయారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.1.84 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ లోపాలు ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్, షాదీముబారక్ పథకాల పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ఎన్ని విమర్శలు చేసినా ప్రయోజనం ఉండదని, తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: కోమటిరెడ్డి వ్యాఖ్యల ఎఫెక్ట్.. రేవంత్‌కు రాజాసింగ్ సవాల్


