నదియా: పశ్చిమ బెంగాల్‌లో మరోమారు రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా ప్రయాణిస్తున్న కారు, కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలు రాళ్లు, గుడ్లు విసిరారని ఆమె ఆరోపించారు. గురువారం నదియా జిల్లాలోని కల్యాణి ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. తనకు భద్రత కల్పించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులు రక్షణ కల్పించలేదని విమర్శించారు.
కృష్ణానగర్ ఎంపీ అయిన మహువా మొయిత్రా.. గోబ్రా గ్రామ పంచాయతీ పరిధిలో 80 నుంచి 90 మంది బీజేపీ మద్దతుదారులు తనపై దాడికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. ఈ విషయం పోలీసులకు ముందే తెలుసని, అయినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం తన భద్రత బాధ్యత పోలీసులదేనని పేర్కొన్న ఆమె.. పోలీసులే బీజేపీ మద్దతుదారులతో కుమ్మక్కై దాడికి అవకాశం కల్పించారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని కోర్టు ధిక్కరణగా అభివర్ణించారు. తన భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై తీవ్రంగా స్పందించారు.
Attention @WBPolice @DGPWestBengal @KrishnanagarPD my safety under the order of Hon’ble HC Kolkata is your responsibility. 80-90 BJP goons waiting at Gobra GP Kaliganj to attack me. All info with you https://t.co/1eql98DCkK
— Mahua Moitra (@MahuaMoitra) November 19, 2026
తన కార్యక్రమాన్ని అడ్డుకోవడంతోపాటు, పోలీసుల రక్షణలో ఉన్న తన కాన్వాయ్‌పై కూడా దాడికి పాల్పడ్డారని మరో పోస్టులో పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాల్లో నిరసనకారులు నల్లజెండాలు ప్రదర్శిస్తూ, ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేయడం కనిపించింది. అయితే మహువా మొయిత్రా చేసిన ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ పోలీసులు, బీజేపీ నుంచి ఇంకా స్పందన రాలేదు.
ఇదిలా ఉండగా గత సెప్టెంబర్‌లో టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ కారుపైనా గుడ్లు విసిరిన ఘటన చోటుచేసుకుంది. హుగ్లీ జిల్లాలోని సెరంపూర్‌లో ర్యాలీకి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. దీంతో ఆయన ర్యాలీకి వెళ్లకుండా కోల్‌కతాకు తిరిగి వచ్చారు. ఈ ఘటనలో కారు వెనుక అద్దం ధ్వంసమైంది. దీనికి బీజేపీనే కారణమని కునాల్ ఘోష్ ఆరోపించారు.
ఇదీ చదవండి: Canada: భారతీయుడి హత్య.. తగలబడుతున్న కారులో మృతదేహం!


