బ్రిటిష్ కొలంబియా: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల భారతీయుడు తుషార్ శర్మ కారులో విగతజీవిగా కనిపించాడు. అక్టోబర్ 29న లాంగ్లీలో ఈ ఘటన జరగగా, అతనిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సర్రే నివాసి అయిన తుషార్ శర్మ మృతదేహాన్ని లాంగ్లీలోని రావ్లిసన్ క్రెసెంట్ ప్రాంతంలో దగ్ధమవుతున్న కారులో గుర్తించారు. రాత్రి 10.30 గంటల సమయంలో కారు మంటల్లో ఉన్నట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పుతున్న సమయంలో కారులో మృతదేహాన్ని గుర్తించారు.
ఈ కేసును కెనడా ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్‌ఐటీ) దర్యాప్తు చేస్తోంది. తుషార్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదని, కెనడాలో అతడికి పరిమిత పరిచయాలే ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అతడి జీవనశైలి, మరణానికి ముందు కార్యకలాపాలపై కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో అనుమానాస్పద కదలికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, డ్యాష్‌క్యామ్ వీడియోలు ఉంటే అందించాలని పోలీసులు ప్రజలను కోరారు. తుషార్ మరణానికి ముందు అతడితో మాట్లాడినవారు తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఒకరినొకరు తిట్టుకుంటే ఏమొస్తుంది?: ప్రధాని మోదీ


