‘బిష్ణోయ్ గ్యాంగ్‌ సభ్యుడు అరెస్ట్‌.. బయటపడిన ‘బైడెన్‌’ నిర్లక్ష్యం | Harry Boxer Lawrence Bishnoi gang aide was caught and released by US Border Patrol | Sakshi
Sakshi News home page

‘బిష్ణోయ్ గ్యాంగ్‌ సభ్యుడు అరెస్ట్‌.. బయటపడిన ‘బైడెన్‌’ నిర్లక్ష్యం

Nov 19 2026 10:16 AM | Updated on Nov 19 2026 10:16 AM

Harry Boxer Lawrence Bishnoi gang aide was caught and released by US Border Patrol

వాషింగ్టన్‌: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు విదేశాలలో పనిచేస్తున్న కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్‌ను అమెరికా అధికారులు అరెస్ట్‌ చేశారు. అయితే గతంలోనే ఇతడిని పట్టుకున్నా విడిచిపెట్టినట్లు వెల్లడైంది. 2024 అక్టోబర్‌లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన ఆరోపణలపై సరిహద్దు భద్రతా దళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అయితే సరైన విచారణ, పరిశీలన లేకుండానే విడుదల చేశారని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌)తాజాగా ఆరోపించింది. ఇందుకు అప్పటి బైడెన్‌ ప్రభుత్వమే కారణమని విమర్శించింది.

హరించంద్ జాట్ అలియాస్ హ్యారీ బాక్సర్‌ను 2026 నవంబర్ 6న కాలిఫోర్నియాలోని కాన్‌కార్డ్‌లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు మరోసారి అరెస్టు చేశారు. భారత దర్యాప్తు సంస్థలు అందించిన నిఘా సమాచారంతో ఈ చర్యలు చేపట్టారు. భారత్‌లో వ్యాపారవేత్తలను బెదిరించడం, బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకోవడం, వసూళ్లకు పాల్పడటం వంటి కార్యకలాపాలను విదేశాల నుంచి సమన్వయం చేస్తున్నాడని భారత అధికారులు అనుమానిస్తున్నారు.

రాజస్థాన్ పోలీసుల దర్యాప్తు ప్రకారం.. 2023 ఏప్రిల్‌లో భారత్ విడిచిపెట్టిన హ్యారీ బాక్సర్ దుబాయ్, డొమినికన్ రిపబ్లిక్, గయానా, మెక్సికో మీదుగా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడు. 2024 అక్టోబర్‌లో సరిహద్దు దళాలకు చిక్కినా విడుదల కావడంతో అక్కడే ఉ‍న్నాడు. అతడిపై 2024 నవంబర్‌లో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. రాజస్థాన్ యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ కూడా విదేశీ సంస్థలకు సమాచారాన్ని అందించింది.

బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధించిన పలు బెదిరింపులు, దాడుల కేసుల్లో హ్యారీ బాక్సర్ పేరు తెరపైకి వచ్చింది. వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం, సీనీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకోవడం వంటి వ్యవహారాలను సమన్వయం చేసినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్, ఇంటర్నెట్ కాల్స్, వీపీఎన్‌ సేవల ద్వారా గ్యాంగ్ సభ్యులు సమాచారాన్ని చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయుధాల సరఫరాలోనూ అతడికి సంబంధాలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కాలిఫోర్నియాలో హ్యారీ బాక్సర్‌పై జరిగినట్లు భావిస్తున్న మరో దాడి ప్రయత్నంపైనా హర్యానా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు చేసింది. ఈ ఘటనలో కర్నాల్‌లో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం హ్యారీ బాక్సర్ ఐసీఈ కస్టడీలో ఉండటంతో అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు భారత అధికారులు అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇదీ చదవండి: అఖిలేష్‌ ర్యాలీలో విషాదం.. బుల్డోజర్‌కు బాలుడు బలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement