వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బైడెన్ సహా అగ్రనేతలను హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో పాకిస్తానీకి 27 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించింది. పాకిస్తాన్ జాతీయుడైన ఆసిఫ్ మర్చంట్ ఇరాన్ ఆదేశాల మేరకు అమెరికా నాయకులను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు అమెరికా ఫెడరల్ కోర్టు నిర్ధారించింది.
ఉగ్రవాద చర్యకు ప్రయత్నించడం, కిరాయి హత్యలకు కుట్ర పన్నడం వంటి అభియోగాల్లో దోషిగా నిర్ధారించిన బ్రూక్లిన్‌లోని ఫెడరట్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. 2020లో ట్రంప్ హయాంలో అమెరికా డ్రోన్ దాడి చేసి, ఇరాన్ కమాండర్ ఖాసీం సులేమా నీని హతమార్చింది. దీనికి ప్రతీకారంగా ఒక అమెరికా రాజకీయ నాయకుడిని హత్య చేసేందుకు ఐఆర్‌జీసీ కుట్ర పన్నినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
ఇందులో భాగంగా పాక్‌కు చెందిన ఆసిఫ్ మర్చంట్ (48) 2024లో అమెరికాకు వచ్చి, హత్య కోసం కిరాయి హంతకులను నియమించుకోవడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ సంవత్సరం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ర్యాలీలు జరిగే ప్రాంతాలను పరిశోధించాడని కూడా తేలింది. అండర్‌కవర్ ఏజెంట్లకు న్యూయార్క్‌లో 5,000 డాలర్లు అడ్వాన్స్‌గా చెల్లించాడు. అయితే, ఆసిఫ్ సంప్రదించిన వ్యక్తులు ఎఫ్‌బీఐకి చెందిన అండర్‌కవర్ ఏజెంట్లు కావడంతో కుట్ర కోణం బయటపడింది.


