షెన్‌జెన్‌లో ఒకేచోట ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్
నేడు త్రైపాక్షిక సమావేశం
బీజింగ్: చైనాలో మూడు దేశాల మధ్య కీలకమైన త్రైపాక్షిక చర్చలకు సమయం ఆసన్నమైంది. చైనా, అమెరికా, రష్యా అధినేతల అధికారిక చర్చలకు ముందు ఆసక్తికరమైన దౌత్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ బుధవారం సాయంత్రం కలుసుకున్నారు. ముగ్గురూ ఒకేచోట కలిసి కనిపించడం ఇదే మొదటిసారి.
చైనాలోని షెన్‌జెన్‌లో జరిగిన ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార(అపెక్) సదస్సు సందర్భంగా ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. షీ జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ ఆతిథ్యం ఇచ్చిన విందు కార్యక్రమానికి ట్రంప్, పుతిన్ సైతం హాజరయ్యారు. రెడ్ కార్పెట్‌పై ఆ ముగ్గురూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. గ్రూప్ ఫోటో కోసం పోజులివ్వడానికి ముందు.. పుతిన్ రెడ్ కార్పెట్‌పై ట్రంప్, జిన్‌పింగ్‌ల వైపు నడిచారు.
ట్రంప్, పుతిన్ కరచాలనం చేసుకొని, శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అలాగే ఇద్దరూ ఒకరి భుజాన్ని మరొకరు తట్టారు. అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన ఈ సంభాషణ అందరి దృష్టిని ఆకర్షించింది. ముగ్గురు దేశాధినేతల త్రైపాక్షిక సమావేశం గురువారం జరుగనుంది. ఈ భేటీని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. 2025 ఆగస్టులో అలాస్కాలో జరిగిన రష్యా–అమెరికా శిఖరాగ్ర సమావేశం తర్వాత ట్రంప్, పుతిన్ ప్రత్యక్షంగా కలుసుకోలేదు.
షెన్‌జెన్‌లో వారి సంభాషణ స్నేహపూర్వకంగానే కనిపించింది. అయితే, అది కొద్దిసేపు మాత్రమే కొనసాగింది. ట్రంప్ కంటే కొన్ని గంటల ముందే పుతిన్ షెన్‌జెన్‌కు చేరుకుని షీ జిన్‌పింగ్‌తో సమావేశమై చర్చలు జరిపారు. మాస్కో, బీజింగ్‌లు అనుసరిస్తున్న విదేశాంగ విధాన వ్యూహం మంచి ఫలితాలు ఇస్తోందని పుతిన్ అన్నారు.
చైనాలో ట్రంప్‌కు అపూర్వ స్వాగతం
త్రైపాక్షిక సమావేశం కోసం బుధవారం ఫిలిప్పైన్స్‌లోని మనీలా నుంచి షెన్‌జెన్‌కు చేరుకున్న డొనాల్డ్ ట్రంప్‌కు అపూర్వ స్వాగతం లభించింది. విమానాశ్రయం రన్‌వేపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. ఆతీ్మయంగా ఆలింగనం చేసుకున్నారు. చైనా అధినేత మరో దేశాధినేతను వ్యక్తిగతంగా ఈ స్థాయిలో స్వాగతించడం చాలా అరుదు. ట్రంప్, జిన్‌పింగ్ సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు.
అమెరికా అధ్యక్షుడికి లాంఛనంగా స్వాగతం పలుకుతూ చైనాకు చెందిన జె–10సీ యుద్ధ విమానాలు పలు విన్యాసాలు నిర్వహించాయి. దాదాపు ఏడు దశాబ్దాల క్రితం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వ్యవస్థాపకుడైన మావో జెడాంగ్ అప్పటి సోవియట్ నాయకుడు నికితా కృశ్చేవ్‌కు ఇలాగే స్వాగతం పలికారు. ఈ తర్వాత ఒక చైనా అధ్యక్షుడు మరో దేశాధినేతను ఈ విధంగా స్వాగతం పలకడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వాషింగ్టన్ పర్యటన సందర్భంగా జిన్‌పింగ్‌ను విమానాశ్రయంలో ట్రంప్ స్వయంగా స్వాగతించిన సంగతి తెలిసిందే.


