ఇమ్రాన్‌ఖాన్‌కు బిలావల్‌ మద్దతు! | Bilawal Bhutto slams govt in Pakistan for keeping Imran Khan in jail | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ఖాన్‌కు బిలావల్‌ మద్దతు!

Nov 19 2026 7:06 AM | Updated on Nov 19 2026 7:12 AM

Bilawal Bhutto slams govt in Pakistan for keeping Imran Khan in jail

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైల్లో ఉంచడంపై అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) అధ్యక్షుడు బిలావల్‌ భుట్టో జర్దారీ తన ప్రభుత్వాన్నే ప్రశ్నించారు. ఇమ్రాన్‌ఖాన్‌ను రాజకీయ ఖైదీగా అభివర్ణిస్తూ.. దేశంలో రాజకీయ కక్షసాధింపు ఆపాలని డిమాండ్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.

కరాచీ ప్రెస్‌ క్లబ్‌లో మంగళవారం మాట్లాడిన బిలావల్‌.. ఇమ్రాన్‌ఖాన్‌ అంటే మనకు ఇష్టం ఉన్నా లేకున్నా దేశంలో ఆయనను రాజకీయ భాగస్వామిగా గుర్తించాల్సిందేనన్నారు. పాకిస్థాన్‌ రాజకీయ వ్యవస్థ ముందుకు సాగాలంటే పీటీఐ విశ్వాసం పొందాలని స్పష్టం చేశారు. 1947 నుంచి ప్రధానులుగా పనిచేసినవారంతా జైలుకు వెళ్తున్నారని, జైలు నుంచి బయటకు వచ్చినవారు తిరిగి ప్రధాని నివాసానికి చేరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

2018-22 మధ్య ప్రధానిగా పనిచేసిన ఇమ్రాన్‌ఖాన్‌ 2023 ఆగస్టు నుంచి అవినీతి కేసులో జైలులో ఉన్నారు. ఆయన పార్టీ కొన్ని తప్పులు చేసినప్పటికీ రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని బిలావల్‌ పేర్కొన్నారు. షరీఫ్‌ ప్రభుత్వంతో పీపీపీకి ఇటీవల విభేదాలు పెరిగాయి. కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్‌ నఖ్వీ ప్రతిపాదన దీనికి కారణమైంది. సింధ్‌ను బలవంతంగా విభజిస్తే రక్తపాతం తప్పదని బిలావల్‌ హెచ్చరించారు. ఈ ప్రతిపాదనపై తన తండ్రి, అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీతో పాటు పీపీపీని సంప్రదించలేదని ఆరోపించారు.  దీనిపై స్పందించిన సమాచార మంత్రి అత్తావుల్లా తరార్‌ మాట్లాడుతూ బిలావల్‌ కూడా తమ ప్రభుత్వంలో భాగస్వామేనని, ప్రజల ప్రయోజనాల కోసం చర్చలకు రావాలని సూచించారు.

ఇదీ చదవండి: సోనియా పుస్తకంపై శివసేన ఆగ్రహం.. నిషేధానికి డిమాండ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement