వైఎస్సార్‌సీపీ నేత పురుషోత్తమరెడ్డి అక్రమ అరెస్ట్‌ | YSRCP Leader Purushottama Reddy Illegal Arrest | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత పురుషోత్తమరెడ్డి అక్రమ అరెస్ట్‌

Nov 11 2026 5:57 AM | Updated on Nov 11 2026 5:57 AM

 YSRCP Leader Purushottama Reddy Illegal Arrest

కోర్టు నుంచి బయటకు వస్తున్న పురుషోత్తమరెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లాలో గొడవలకు కారణమైన పచ్చమూకలను వదిలేసి వైఎస్సార్‌సీపీ నేతలపైనే తప్పుడు కేసులు

హిందూపురం కోర్టు ఆవరణలో న్యాయవాది నుంచి బెయిల్‌ పేపర్లు లాక్కుని దాడి చేసిన లేపాక్షి ఎస్‌ఐ నరేంద్ర

హిందూపురం (చిలమత్తూరు): స్థానిక సంస్థల ఎన్ని­కల్లో అక్రమ మార్గాలలో గెలిచిన అధికార పార్టీ.. ఇప్పుడు ఎదురొడ్డి పోరాడిన వైఎస్సార్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రధానంగా శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల ఆదేశాలతో స్థానిక పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.

గొడవలకు ప్రేరేపించిన వారిని వదిలేసి.. కేవలం వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు మోపి వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ నెల ఐదున పోలింగ్‌ సందర్భంగా చిలమత్తూరులో గొడవ చేశారంటూ వైఎ­స్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి పురుషోత్తమరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఆయనను అరెస్ట్‌ చేశారు.

పోలీసుల ‘పచ్చ’పాతం
ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో గత గురువా­రం వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, అభ్యర్థులను చిలమత్తూ­రు పోలింగ్‌ కేంద్రంలోకి పోలీసులు అనుమతించలేదు. చివరకు మధ్యాహ్నం దాటిన అనంతరం కొందరిని మాత్రమే లోపలకు అనుమతించారు. స్థా­నికుడు కాని చిలకలూరిపేటకు చెందిన టీడీపీ ఎమ్మె­ల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావును పోలింగ్‌ కేంద్రంలోకి పోలీసులు యథేచ్ఛగా అనుమతించా­రు.

మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు శ్రీనివాసరావు, సురేంద్ర, బాలా­జీ పోలింగ్‌ కేంద్రంలో హల్‌చల్‌ చేశారు. గొడవలను సృష్టించి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను, ఏజెంట్లను బయటకు గెంటేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీనికి నిరసన తెలుపుతూ ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ నే­తలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.

పచ్చ మూకల చర్యలను నిలువరించడంతో..
ఇక శనివారం వీరాపురం ఎంపీటీసీ సెగ్మెంట్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపొందారు. ఈ ఫలితాన్ని తారుమారు చేయాలని చూడగా.. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పురుషోత్తమరెడ్డి, ఏజెంట్‌గా ఉన్న రామకృష్ణారెడ్డి గట్టిగా నిలువరించడంతో అధికారులు డిక్లరేషన్‌ ఫారం ఇవ్వక తప్పలేదు. దీన్ని జీర్ణించుకోలేని పచ్చమూకలు అదేరోజు కౌంటింగ్‌ కేంద్రం వద్ద దాడులకు సిద్ధమయ్యారు.

ఏఎస్పీ అంకిత సురానా వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పురుషోత్తమరెడ్డి,  పార్టీ మండల కన్వీనర్‌ రామకృష్ణారెడ్డిలకు ఎస్కార్ట్‌ ఇచ్చి రాష్ట్రం దాటే వరకు భద్రత కల్పించారు. అయినా వారిపై కేసులు నమోదు చేయాలని బాలకృష్ణ పీఏలు పోలీసులపై ఒత్తిడి తేవడంతో హిందూపురం వన్‌టౌన్‌ స్టేషన్‌లో 223, 132, 351(2) రెడ్‌ విత్‌ 3(5) బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం సీఐ జనార్దన్, లేపాక్షి పోలీసులు రాష్ట్ర సరిహద్దులోని ఎల్లోడు వద్ద పురుషోత్తమరెడ్డిని అరెస్టు చేసి సాయంత్రానికి హిందూపురం తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు.

కోర్టు ఆవరణలో న్యాయవాదిపై ఎస్‌ఐ దాడి
పురుషోత్తమరెడ్డి అరెస్ట్‌లో అత్యుత్సాహం ప్రదర్శించిన లేపాక్షి ఎస్‌ఐ నరేంద్ర హిందూపురం కోర్టు ఆవరణలో కూడా అతిగా వ్యవహరించారు. పురుషోత్తమరెడ్డి బెయిల్‌ పేపర్లు కోర్టుకు తీసుకువచ్చిన న్యాయవాది వెంకటరెడ్డి చేతుల్లోంచి వాటిని లాక్కొని కింద పడేసి న్యాయవాదిపై దాడి చేశాడు. ప్రశ్నించిన న్యాయవాదిని నానా దుర్భాషలాడుతూ అవమాన పరిచాడు. దీంతో ఆగ్రహించిన న్యాయవాదులు తిరగబడ్డారు. ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని జడ్జికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement