రోస్టర్ ప్రకటించకుండా పోస్టుల ప్రకటన
ఏ సామాజిక వర్గానికి ఎన్ని పోస్టులో స్పష్టత కరవు
షార్ట్ నోటిఫికేషన్, తాజా నోటిఫికేషన్‌లోనూ ఇదే పరిస్థితి
అసలు పోస్టులున్నాయో, లేదో తెలియక అభ్యర్థులు తికమక
నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. స్పోర్ట్స్ కోటాలో భారీగా మార్పులు.. తద్వారా గత డీఎస్సీ అక్రమాలు ఒప్పుకోలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మరోసారి అయోమయంలోకి నెట్టింది. డీఎస్సీ–2026 నోటిఫికేషన్ జారీ ప్రక్రియలో పాఠశాల విద్యాశాఖ అనుసరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం విడుదల కావాల్సిన రోస్టర్ వివరాలపై స్పష్టత లేకపోవడం అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. బుధవారం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
రోస్టర్ ప్రకారం ఏ సామాజిక వర్గానికి పోస్టులు ఉన్నాయో.. అసలు ఉన్నాయో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. గత నెల 13న 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ ప్రాథమిక (బ్రీఫ్) నోటిఫికేషన్ ఇచ్చింది. 2,721 పోస్టులతో అక్టోబర్ 13న షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయో ప్రకటించారు. ఈ క్రమంలో సమగ్ర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఈనెల 4వ తేదీన విడుదల చేసింది. ఇందులో మొత్తం పోస్టులలో 2,111 రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, 350 స్పెషల్ టీచర్ పోస్టులు, వివిధ సొసైటీల పరిధిలో 260 ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ పోస్టులు ప్రకటించారు.
అలాగే, ఏయే జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా చెప్పారు. కానీ, ఇందులో కేవలం పోస్టుల సంఖ్య, జిల్లాల వారీ ఖాళీలను మాత్రమే ప్రకటించారు తప్ప, అసలైన రిజర్వేషన్లు, కేటగిరీల వారీ రోస్టర్ పాయింట్లను చేర్చలేదు. రోస్టర్ పాయింట్లు లేకుండా కేవలం ఖాళీల సంఖ్యను ప్రకటించడం డీఎస్సీ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఇది నిరుద్యోగ వర్గాల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించారో తెలియకుండా ఒక ప్రకటనను విడుదల చేయడం ద్వారా డీఎస్సీ–2026 నిజంగా పూర్తి చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అభ్యర్థుల్లో అనిశ్చితి, గందరగోళం
సాధారణంగా నోటిఫికేషన్ వెలువడగానే ఏ సామాజిక వర్గానికి, ఏ రిజర్వేషన్ పరిధిలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకుని అభ్యర్థులు ప్రిపరేషన్, దరఖాస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కానీ, కీలకమైన రోస్టర్ వివరాలను ప్రకటించక పోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. గత ఏడాది 100 రోజుల్లో డీఎస్సీ అని సీఎం, విద్యా శాఖ మంత్రి ప్రకటించగానే అభ్యర్థులు శిక్షణ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజా డీఎస్సీ–2026 నోటిఫికేషన్‌లో 5 జిల్లాలకు ఒక్క పోస్టు కూడా లేదు.
మరో 12 జిల్లాలకు 9 లోపే పోస్టులు ఉన్నాయి. ఇది ఇంత కాలం శిక్షణ పొందుతున్న వారిపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపింది. ఇప్పుడు రోస్టర్ కూడా ప్రకటించక పోవడంతో తమ సామాజిక వర్గానికి పోస్టులు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి చాలా మంది అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. పోస్టుల భర్తీ ప్రక్రియను ముందస్తు స్పష్టతతో ప్రారంభించాల్సి ఉండగా, అసంపూర్తి సమాచారంతో ప్రకటనలు జారీ చేయడం ఉద్యోగార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. అటు బ్రీఫ్ నోటిఫికేషన్, ఇటు పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ అంతా లోపాలమయం. కాగా, దరఖాస్తు ఫీజును రూ.750 నుంచి రూ.వెయ్యికి పెంచింది.
తప్పు ఒప్పుకోలు.. డీఎస్సీ సోర్ట్స్ కోటాలో కీలక మార్పులు
మెగా డీఎస్సీ–2025లో విచ్చలవిడిగా ఉపాధ్యాయ పోస్టులు అమ్మకానికి పెట్టేందుకు నిబంధనలను ఉల్లంఘించిన ప్రభుత్వం.. తాము అనుకున్న పని పూర్తికాగానే క్రీడా కోటా పాలసీని మార్చేసింది. డీఎస్సీ నియామకాలకు సంబంధించి క్రీడా కోటా, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాలకు సంబంధించి ప్రభుత్వం పలు కీలక మార్పులు తీసుకొచి్చంది. ప్రభుత్వ క్రీడా విధానం 2024–29లో ప్రభుత్వ శాఖలు అన్నింటిలో 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ ద్వారా ప్రతిభగల క్రీడాకారులకు వారి సర్టిఫికెట్ల ఆధారంగా నేరుగా ప్రభుత్వ శాఖల్లో కొలువు కల్పించే అంశాన్ని చేర్చింది.
దీని ప్రకారం మెగా డీఎస్సీ–2025 నిర్వహణలో 421 పోస్టుల్లో 97 శాతం పోస్టులను ఎటువంటి రాత పరీక్ష లేకుండా క్రీడాకారులు సాధించిన పతకాలు, సర్టిఫికెట్ల ఆధారంగా నియామకాలు చేపట్టింది. ఈ క్రమంలో పోస్టుకో రేటు ఫిక్స్ చేసి, భారీగా ముడుపులు దండుకుని నిజమైన అర్హులకు పోస్టులు దక్కకుండా చేసి ప్రభుత్వంలో ఉన్న వారు లబ్ధి పొందారు. డీఎస్సీ పూర్తయిన తర్వాత క్రీడా పాలసీ 2024–29ను సవరించారు. ఇప్పుడు, 3 శాతం హారిజంటల్ రిజర్వేషన్‌లో అభ్యర్థి కచ్చితంగా రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే క్రీడా కోటాలో సర్టిఫికెట్లు పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో స్పోర్ట్స్ కోటాలో కనీస కటాఫ్ మార్కుల నిబంధన లేదు.
అర్హులైన స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు అతి తక్కువ మార్కులు వచ్చినా సరే ఎంపిక చేశారు. కొత్త నిబంధనల ప్రకారం రాత పరీక్షలో తమ కేటగిరీకి నిర్దేశించిన కనీస అర్హత మార్కులు తప్పనిసరి చేశారు. ఓసీ/ ఈడబ్ల్యూఎస్ 40%, బీసీ 35%, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు 30% ఉండాలి. స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ అధికారిక పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ ఐడీ పొందాలి.
అలాగే, శాప్ రిజిస్ట్రేషన్ ఐడీని డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తులో తప్పనిసరిగా నమోదు చేయాలి. అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన క్రీడా ధ్రువపత్రాల్లో అత్యుత్తమమైన 3 సర్టిఫికెట్లను మాత్రమే ఎంపిక చేసి, వాటి వాస్తవికతను శాప్/సంబంధిత స్పోర్ట్స్ అసోసియేషన్ల ద్వారా నేరుగా పరిశీలిస్తారు. స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), పీఈటీ, పీడీ వంటి వ్యాయామ విద్యా పోస్టులకు 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. దీనిని బట్టి మెగా డీఎస్సీ–2025 అంతా అక్రమాల మయమేనని చంద్రబాబు ప్రభుత్వం స్పష్టంగా అంగీకరించిందని స్పష్టమవుతోంది.


