ధాన్యం రైతులకు కొత్త తిప్పలు | Andhra Pradesh Farmers Face Difficulties Due to APAIMS 2. 0 App | Sakshi
Sakshi News home page

ధాన్యం రైతులకు కొత్త తిప్పలు

Nov 11 2026 4:52 AM | Updated on Nov 11 2026 4:52 AM

Andhra Pradesh Farmers Face Difficulties Due to APAIMS 2. 0 App

అమ్మే తేదీ, టైమ్‌ బుక్‌ చేసుకునే బాధ్యత రైతులదే  

ఏపీఏఐఎంఎస్‌ 2.0 యాప్‌లో వెసులుబాటు పేరుతో ఏర్పాటు  

స్మార్ట్‌ఫోన్‌ లేని అన్నదాతల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న?

సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త షెడ్యూలింగ్‌ విధానం అన్నదాతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇప్పటివరకు రైతు సేవాకేంద్రాన్ని సంప్రదించి ఈ–పంట నమోదు ఆధారంగా సాగు, దిగుబడి, అమ్మకానికి సంబంధించిన వివరాలు సమర్పించారు. కోతలు పూర్తయి, ధాన్యాన్ని అమ్మకానికి సిద్ధం చేసే సమయానికి అనుగుణంగా సిబ్బంది కొనుగోలు తేదీ, సమయం (షెడ్యూల్‌) నిర్ణయించి మెస్సేజ్‌ రూపంలో సమాచారం ఇస్తున్నారు.

ఇక నుంచి ఆ బాధ్యతల నుంచి కూడా తప్పించుకునేలా ప్రభుత్వం కొత్త ఎత్తు వేస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీఏఐఎంఎస్‌ 2.0 ఫార్మర్‌ యాప్‌ ద్వారా రైతే స్వయంగా షెడ్యూలింగ్‌ నిర్ణయించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ధాన్యం అమ్మే తేదీ, సమయం రైతులే నిర్ణయించాలన్న ఈ ఆదేశాలు చిన్న, సన్నకారు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి.  

70 శాతం మంది రైతులు స్మార్ట్‌ఫోన్లకు దూరం  
ప్రభుత్వం ఖరీఫ్‌–2026 సీజన్‌ నుంచి ధాన్యం కొనుగోళ్లలో ఫార్మర్‌ ఐడీ (విశిష్టసంఖ్య) తప్పనిసరి చేసింది. నేటికీ 12.65 లక్షల మంది రైతులకు ఫార్మర్‌ ఐడీలు లేవు. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఉన్న కౌలురైతుల్లో ఒక్కరికి కూడా ఫార్మర్‌ ఐడీ లేదు. మరోవైపు ధాన్యం సేకరణ సేవలను పూర్తిగా ఏపీఏఐఎంఎస్‌ 2.0 ఫార్మర్‌ యాప్‌ ద్వారానే వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రైతు తన మొబైల్‌లో యాప్‌ తెరిచి ధాన్యం విక్రయించే తేదీ, సమయం నిర్దేశించుకోవాలి.

ధాన్యాన్ని ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి విడతల వారీగా కొనుగోలు కేంద్రాలకు తరలించేలా తేదీలు, సమయాన్ని స్వయంగా నిర్దేశిస్తూ బుక్‌ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. 70 శాతానికి పైగా రైతులు స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉన్నారు. స్మార్ట్‌ఫోన్లు ఉన్న వారిలో 90 శాతం మందికి పైగా ఈ యాప్‌లను ఎలా వినియోగించుకోవాలో తెలియదు.

చిన్న, సన్నకారు రైతులు, కౌలురైతుల చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. ఒకవేళ ఉన్నా.. యాప్‌ డౌన్‌లోడ్‌ చేయడం, లాగిన్‌ కావడం, ఫార్మర్‌ ఐడీ, ధాన్యం పరిమాణం నమోదు చేయడం, తేదీ–సమయం ఎంపిక చేయడం వంటి ప్రక్రియలు అందరికీ సులభంకాదు. వయసు పైబడిన రైతులకు డిజిటల్‌ ప్రక్రియలు మరింత భారంగా మారే అవకాశం ఉంది. ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప విత్తనాలు, ఎరువులతో సహా ఏ ఒక్కటి బుక్‌ చేసుకోలేని పరిస్థితి.  

ఒక్కరోజు ఆలస్యమైనా అపారనష్టం  
గ్రామీణ ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్‌ కోతలు, నెట్‌వర్క్‌ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాప్‌ పనిచేయకపోవడం, ఓటీపీ రాకపోవడం, సర్వర్‌ బిజీగా ఉండటం, మొబైల్‌ డేటా అందుబాటులో లేకపోవడం వంటి సాంకేతిక సమస్యలు నిత్యం వెంటాడుతుంటాయి. ఇప్పటివరకు రైతు సేవాకేంద్రానికి వెళ్లి సిబ్బందికి వివరాలు చెబితే షెడ్యూలింగ్‌ జరిగేది. కానీ ఇకనుంచి రైతులే స్వయంగా బుక్‌ చేసుకోవాలంటే వారు పడేపాట్లు వర్ణనాతీతమనే చెప్పాలి.

యాప్‌లో ఈ వెసులుబాటు ఉందనే సాకుతో కార్యాలయాలకు వెళ్తే షెడ్యూలింగ్‌ మీరే చేసుకోవచ్చు కదా అంటూ ఉచిత సలహాలిచ్చి బాధ్యతల నుంచి సిబ్బంది తప్పించుకునే అవకాశాలున్నాయి. ధాన్యం కోతకు వచ్చిన సమయంలో ఒక్కరోజు ఆలస్యమైనా రైతులకు అపారనష్టం వాటిల్లుతుంది. పొలంలో కోసిన ధాన్యాన్ని ఎక్కువకాలం ఆరబెట్టడం, నిల్వచేయడం, రవాణా కోసం వాహనం సిద్ధంచేయడం అన్నీ ఖర్చుతో కూడుకున్నవే.

వాతావరణ పరిస్థితులు, తేమశాతం, కూలీల లభ్యత, రవాణా సౌకర్యం వంటి అంశాలను బట్టి కోతతేదీలు మారుతుంటాయి. షెడ్యూల్‌ కాలేదనే కారణంతో ధాన్యం ఇంటి దగ్గరే నిల్వచేసుకోవాల్సి వస్తే ఆ రైతుల పరిస్థితి అగమ్యగోచరం. అమ్మకానికి పంట సిద్ధంగా ఉన్నా, షెడ్యూల్‌ తేదీ దూరంగా ఉంటే.. ఆ ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలి? తేమ పెరిగి నాణ్యత తగ్గితే బాధ్యత ఎవరిది? వర్షం వస్తే తడిసిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారు? అన్న ప్రశ్నలు రైతులను వేధిస్తున్నాయి.  

విడతల వారీ విధానం చిన్న, సన్నకారు రైతులకు భారం  
ధాన్యాన్ని మొత్తంగా లేదా పాక్షికంగా, విడతల వారీగా షెడ్యూల్‌ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇది అవసరాన్ని బట్టి అమ్ముకునే రైతులకు ఉపయోగపడొచ్చు కానీ చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడదు. ప్రతిసారీ షెడ్యూలింగ్, రవాణా, తూకం, కొనుగోలు కేంద్రానికి తరలింపు వంటి ప్రక్రియలు పునరావృతమైతే రైతుకు అదనపు ఖర్చే.

షెడ్యూలింగ్‌ ఆలస్యం, యాప్‌ సమస్యలు, కొనుగోలు కేంద్రం వద్ద రద్దీ, తేమ నిబంధనలు, రవాణా ఖర్చులు వంటి అంశాల మధ్య రైతు చివరకు దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఫలితంగా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కంటే తక్కువ ధరకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఈ విధానం ముమ్మాటికి దళారీలకు మేలు చేకూరుస్తుందే తప్ప రైతులకు ఏమాత్రం మేలు కలగదని రైతుసంఘాలు మండిపడుతున్నాయి.

కొత్తగా చేర్చాం... 
ఖరీఫ్‌–2026 సీజన్‌ నుంచి ఏపీఏఐఎంఎస్‌ ఫార్మర్‌ యాప్‌లో ధాన్యం సేకరణ సేవలను కొత్తగా చేర్చాం. ధాన్యం అమ్మకానికి సంబంధించి తేదీ, సమయం నిర్దేశించుకునేందుకు రైతులు స్వీయ షెడ్యూలింగ్‌కు వెసులుబాటు కల్పించాం. దీంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదు. వ్యక్తిగత పనులు మానుకొని అధికారులను సంప్రదించాల్సిన పనిలేదు. వారికి సమయం, శ్రమ ఆదా అవుతాయి. ఈ విధానంపై రైతులకు మరింత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం.   
– మనజీర్‌ జిలానీ సమూన్, డైరెక్టర్, వ్యవసాయశాఖ   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement