‘వయబిలిటీ’ పేరుతో తిష్ట దోపిడీలో పరాకాష్ట | Chandrababu Govt Continues to Favor Private Organizations in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘వయబిలిటీ’ పేరుతో తిష్ట దోపిడీలో పరాకాష్ట

Nov 11 2026 2:11 AM | Updated on Nov 11 2026 2:11 AM

Chandrababu Govt Continues to Favor Private Organizations in Andhra Pradesh

గత ప్రభుత్వం ఇలాంటి మెడికల్‌ కాలేజీలను నిర్మించి... వాటిలో పోస్టులను కూడా భర్తీ చేస్తే... ఇప్పుడు చంద్రబాబు సర్కారు పప్పు బెల్లాలకు ఆ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేస్తోంది

ప్రభుత్వ సంపద ప్రైవేట్‌కు కట్టబెట్టడంలో బరితెగిస్తున్న చంద్రబాబు సర్కారు

ఇప్పటికే పీపీపీ మెడికల్‌ కాలేజీల కోసం ప్రైవేట్‌కు మేలు చేసేలా అనేక నిర్ణయాలు

రూ.100కే ఎకరం లీజు.. వైద్య సేవలకు ఫీజులు.. సగం సీట్లు అమ్ముకునే సౌలభ్యం 

వీటన్నింటితో పాటు ఏకంగా 66 ఏళ్లపాటు ఆస్పత్రులు, కాలేజీలపై వారికే గుత్తాధిపత్యం

ఇది చాలదన్నట్లు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ అంటూ నిధులు దోచిపెట్టేలా స్కెచ్‌

ఈ దిశగా త్వరలో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పాలకొల్లు, పెనుకొండ కాలేజీలకు టెండర్లు 

ఈ కాలేజీలు దక్కించుకునే వారికి వీజీఎఫ్‌ నిధులు రూ.1,200 కోట్లు 

ఎవరూ ముందుకు రాలేదనే సాకుతో ఆదోని, మదనపల్లె, మార్కాపురం కాలేజీలకు రూ.430 కోట్లు

మొత్తంగా రూ.1,630 కోట్లు అప్పనంగా కట్టబెట్టనున్న వైనం

ఇన్ని ఇచ్చినా తక్కువేనంటూ రెండేళ్లు డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందికి జీతాలు సైతం ఇస్తామని వెల్లడి

ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లు వెచ్చిస్తే ప్రభుత్వ నిర్వహణలోనే అన్ని కాలేజీలు

సాక్షి, అమరావతి: ప్రజా సంపదను అస్మదీయులకు దోచి పెట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం బరితెగింపు తారస్థాయికి చేరింది. పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) ముసుగులో రూ.వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా ప్రైవేట్‌కు కట్టబెట్టడం, ప్రభుత్వ ఆస్తులు ధారాదత్తం చేయడమే కాకుండా వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) పేరుతో రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కావాల్సిన వారికి దోచి పెట్టేస్తున్నారు. ఈ బరితెగింపు చర్యల్లో భాగంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టే క్రమంలో వీజీఎఫ్‌ రూపంలో ప్రైవేట్‌ సంస్థలకు బాబు సర్కార్‌ మరింత మేలు తలపెట్టబోతోంది.

బాపట్ల, పాలకొల్లు, నర్సీపట్నం, అమలాపురం, పెనుకొండ వైద్య కళాశాలలకు వీజీఎఫ్‌ కింద రూ.1,200 కోట్లకు పైగా మళ్లించబోతున్నారు. 2024 నాటికే వివిధ దశల్లో ఉన్న ఈ కాలేజీల మిగిలిన నిర్మాణం పూర్తి చేయడానికి రూ.3,300 కోట్లు అవసరం అవుతుంది. ఈ మొత్తాన్ని కూడా భరించే పని లేకుండా రూ.1,200 కోట్లపైనే ప్రభుత్వమే సమకూర్చడం ద్వారా ప్రభుత్వ పెద్దలు అస్మదీయులకు భారీ మేలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.

టెండర్లలో ఎవరూ ముందుకు రాలేదన్న సాకుతో ఆదోని, మదనపల్లె, మార్కాపురం కాలేజీలకు రూ.430 కోట్లపైనే వీజీఎఫ్‌ రూపంలో ప్రైవేట్‌కు మళ్లించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలా మొత్తంగా రూ.1,630 కోట్లపైనే ప్రజాధనాన్ని కావాల్సిన వారికి ముట్టజెప్పడానికి చంద్రబాబు సర్కార్‌ చురుగ్గా అడుగులు వేస్తోంది.   

పప్పు బెల్లాలుగా విలువైన భూములు 
గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. 2024లో చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. 17 కాలేజీల్లో 10 పీపీపీకి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రతి వైద్య కళాశాలకు చెందిన దాదాపు 50 ఎకరాల చొప్పున విలువైన భూములను పప్పు బెల్లాలుగా ప్రైవేట్‌కు ఇచ్చేలా ఇప్పటికే పీపీపీ పాలసీని బాబు సర్కార్‌ రూపొందించింది.

ఎకరం భూమికి ఏడాదికి రూ.100 లీజు చెల్లిస్తే చాలు.. బోధనాస్పత్రుల్లో 70 శాతం ఐపీ పడకలకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు సమకూరుస్తుంది. మిగిలిన 30 శాతం పడకల్లో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాదిరిగా ఫీజులు గుంజుకునే వీలు కల్పిస్తుంది. సగం ఎంబీబీఎస్, మెడికల్‌ పీజీ సీట్లకు యాజమాన్య కోటా కింద ఫీజులు వసూలు చేసుకునే అధికారం ఇవ్వనుంది. వైద్య కళాశాల, బోధనాస్పత్రిపై 66 ఏళ్ల పాటు యాజమాన్య హక్కులూ కల్పిస్తుంది.

ఇలా ప్రైవేట్‌ వ్యక్తులకు అంతిమ లబ్ధి కల్పించేలా అనేక దగాకోరు నిర్ణయాలు తీసుకుంది. ఇది చాలదన్నట్టుగా ఈ కాలేజీలకు వీజీఎఫ్‌ కింద రూ.1,600 కోట్లకు పైగా ప్రభుత్వమే ఇవ్వడానికి సిద్ధమైంది. 17 వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో నిర్మాణాలు పూర్తి చేయడానికి గత ప్రభుత్వం రూ.8,500 కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా అప్పట్లో నిధులను సైతం సమీకరించి నిర్మాణాలు ప్రారంభించింది. 2024 నాటికి రూ.3 వేల కోట్ల విలువైన నిర్మాణ పనులు పూర్తి చేసింది.

2023–24లో ఐదు వైద్య కళాశాలలు ప్రారంభించి, 750 ఎంబీబీఎస్‌ సీట్లను ఒకే ఏడాది రాష్ట్రానికి సమకూర్చింది. 2024–25లో మరో ఐదు, 2025–26లో మిగిలిన ఏడు ప్రారంభించేలా ప్రణాళికలు వేసింది. ఈ క్రమంలో 2024–29 మధ్య ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున రూ.5 వేల కోట్ల మేర ఖర్చు చేస్తే కాలేజీలన్ని ప్రభుత్వ రంగంలోనే అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఇలా చేయకుండా ఈ కాలేజీలను కారుచౌకగా ప్రైవేట్‌కు కట్టబెట్టడమే కాకుండా, వీజీఎఫ్‌ కింద రూ.1,600 కోట్లకు పైగా నిధులను ప్రైవేట్‌కు మళ్లిస్తోంది.   

ఎవరూ ముందుకు రాలేదని సాకు 
ఇప్పటికే టెండర్లు పిలిచిన మదనపల్లె, మార్కాపురం, ఆదోని కాలేజీలను దక్కించుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదన్న సాకుతో వీటికి వీజీఎఫ్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మూడు కాలేజీలకు రూ.430 కోట్ల పైనే వీజీఎఫ్‌ సాయం అందించాలని ఇప్పటికే కేంద్రానికి బాబు సర్కార్‌ ప్రతిపాదనలు కూడా పంపింది. వాస్తవానికి ఈ మూడింటితో పాటు పులివెందుల కాలేజీని 2024–25 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాల్సి ఉంది.

గత ప్రభుత్వంలోనే అనుమతుల కోసం నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ)కి దరఖాస్తులు కూడా చేశారు. మొదటి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో 2024 ఎన్నికల నాటికే కాలేజీలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే పులివెందుల కళాశాలకు ఎన్‌ఎంసీ సైతం పచ్చజెండా ఊపింది. అయితే కుట్రపూరితంగా చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసి.. ఆ కళాశాల అనుమతులు రద్దు చేయించింది. తొలి విడతలో ఈ నాలుగు కాలేజీలను పీపీపీలో ప్రైవేట్‌కు ఇవ్వడం కోసం గతేడాది టెండర్లు కూడా పిలిచింది. అయితే ఆ టెండర్‌లలో ఎవరూ ముందుకు రాలేదు.

ఈ సాకుతో ప్రోత్సాహకాలు ఇస్తే ఎవరైనా ముందుకు వస్తారని వీజీఎఫ్‌ కింద రూ.430 కోట్లు మళ్లించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. గత వారంలో వైద్య శాఖ.. ప్రైవేట్‌ వైద్య కళాశాలల యాజమాన్యాలతో భాగస్వామ్య సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పీపీపీ కాలేజీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, వీటి ద్వారా వచ్చే ఆదాయ మార్గాలను అధికారులు యాజమాన్యాలకు వివరించి త్వరలో పిలిచే టెండర్లలో పాల్గొనాలని కోరినట్టు వెల్లడైంది. త్వరలో అమలాపురం, నర్సీపట్నం, పాలకొల్లు, బాపట్ల, పెనుకొండ కాలేజీలకు టెండర్లు పిలవడానికి వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. 

ఇంతగా దోచిపెడుతున్నా, తక్కువేనని భావిస్తూ ఏకంగా రెండేళ్ల పాటు వైద్యులు, ప్రొఫెసర్లు, సిబ్బందికి ప్రభుత్వమే వేతనం ఇస్తుందని చెప్పడం విస్తుగొలుపుతోంది.‘ఈ దోపిడీని ఏమనాలి? కొత్త పుంతలు తొక్కింది. కొత్త శిఖరాలను ఆధిరోహించింది అనడం కూడా తక్కువే. ఇంతటి అరాచకం ఎక్కడా లేదు. ప్రజా ధనాన్ని యథేచ్ఛగా దోచిపెట్టి, అందులో మీకింత–మాకింత అని కమీషన్లు పంచుకోవడం తప్ప మరొకటి కాదు’ అని విద్యా రంగ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    

ప్రభుత్వ నిధులు దోచిపెట్టే కుట్ర 
వాస్తవానికి ప్రైవేట్‌ సంస్థలు భారీగా సొంత పెట్టుబడి పెట్టి రోడ్లు, బ్రిడ్జిలు వంటి మౌలిక కట్టడాలు నిర్మిస్తున్నప్పుడు, వారికి ఆశించిన లాభాలు రాకపోతే ప్రభుత్వం ఇచ్చే ఆరి్థక మద్దతు వీజీఎఫ్‌. ఇందుకు పూర్తి భిన్నంగా పీపీపీ కాలేజీల ప్రాజెక్ట్‌ రూపంలో వీజీఎఫ్‌ కింద ప్రజా ధనాన్ని బాబు సర్కార్‌ ప్రైవేట్‌కు మళ్లిస్తోందని విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలోనే వైద్య కళాశాలల కోసం ప్రభుత్వమే భూములు సేకరించింది. ఆ భూములను అభివృద్ధి చేసి ఎలక్ట్రిసిటి, అప్రోచ్‌ రోడ్లు, నీటి వసతులు కల్పించింది.

దీంతో పాటు కాలేజీల నిర్మాణాలను ప్రారంభించింది. వివిధ దశల్లో నిర్మాణాలున్నాయి. అలాంటి కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడమే కాకుండా ఎకరం భూమి లీజు కేవలం రూ.100 మాత్రమే కాకుండా, చికిత్సలకు ఫీజుల వసూళ్లు, 66 ఏళ్ల యాజమాన్య హక్కుల రూపంలో ఇప్పటికే భారీ ఎత్తున ఆయాచిత లాభాలు ప్రభుత్వమే సమకూర్చింది. ఆపై వీజీఎఫ్‌ కింద రూ.వేల కోట్లు మళ్లించడం వెనుక ప్రభుత్వ పెద్దల భారీ కుట్రలున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement